Ahmedabad Flight Crash: అహ్మదాబాద్ లోని షాలిబాగ్ ప్రాంతంలో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. విమానాశ్రం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ప్లైట్ కూలిపోయిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులున్నారని సమాచారం. విమానం జనావాసాల సమీపంలో కూలిపోయినట్లు జాతీయ మీడియా తెలిపింది.
ఈ ఘటన అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని షాహిబాగ్ ప్రాంతంలో జరిగింది. ఘటనా స్థలంలో మంటలు ఎగిసిపడుతుండటంతో వెంటనే 12 ఫైర్ ఇంజిన్లు చేరుకొని మంటలు ఆర్పే పనిలో పడ్డాయి. విమానంలో ఉన్న ప్రయాణికుల్లో కొంత మంది స్పాట్‌లోనే చనిపోయినట్లు తెలుస్తోంది. విమానంలో నుంచి కొంతమందిని వెలికి తీసి గాయపడిన వారికి వెంటనే ఆస్పత్రికి తరలిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనలో స్థానికులు కూడా గాయపడినట్లు సమాచారం.
ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం AI-171 గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరింది. కానీ రన్ వే పై నుంచి టేకాఫ్ అయిన తరువాత ఆకాశంలో కొద్ది దూరం వెళ్లాక విమానం కూలిపోయినట్లు అధికారులు చెప్పారు. దీంతో విమానం కూలిన పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే పనిలో ఉంది.
ఈ సమాచారం తెలియగానే పౌరవిమానాయన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడు పరిస్థితిని సమీక్షించేందుకు ఘటన స్థలికి బయల్దేరారు. విమానం జనావాసాలపై కూలిన నేపథ్యంలో క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రమాదానికి స్పష్టమైన కారణం తెలియరాలేదు. ప్రమాద సమయానికి విమానంలో 12 మంది సిబ్బంది, 241 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో పలువురు ప్రముఖులు, రాజకీయవేత్తలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.