Amit Shah Insult Ambedkar| రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం రాజ్యంగం 75వ వార్షికోత్సవం, జమిలి ఎన్నికలపై ప్రసంగం చేస్తూ.. భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేడ్కర్‌ని అవమానించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
అమిత్ షా మంగళవారం రాజ్యసభలో మాట్లాడుతూ.. ఇటీవల అందరికీ అంబేడ్కర్ పేరు ఉచ్చరించడం ఫ్యాషన్ అయిపోయిందని అన్నారు. దానికి బదులు దేవుడిని తలుచుకొని ఉంటే స్వర్గంలో చోటు దక్కేది అని సెటైర్ వేశారు. “ఇప్పుడొక ఫ్యాషన్ నడుస్తోంది. అంబేడ్కర్, అంబేడ్కర్, అంబేడ్కర్, అంబేడ్కర్, అంబేడ్కర్, అంబేడ్కర్. ఈ పేరు ఇన్నిసార్లు ఉచ్చరిస్తున్నారు. ఇంతగా ఆ భగవంతుడిని తలుచుకొని ఉంటే వారందరికీ ఏడు జన్మల వరకు స్వర్గం లభించేది.” అని ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి అమిత్ షా వెటకారంగా మాట్లాడారు.
“అంబేడ్కర్ పేరుని కాంగ్రెస్ నాయకుడు అన్ని సార్లు ఉచ్చరిస్తున్నారు.. దానికి భారతీయ జనతా పార్టీకి సంతోషం వ్యక్తం చేస్తోంది. కానీ అంబేడ్కర్ విలువలను ఆయన భావాల గురించి కూడా మాట్లాడితే బాగుండేది.” అని షా సెటైర్లు వేశారు.
అమిత్ షా వ్యాఖ్యాలను లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు. “మనుస్మృతిని నమ్మే వారు తప్పకుండా అంబేడ్కర్ ని వ్యతిరేకిస్తారు.” అని రాహుల్ గాంధీ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ALSO READ: సంక్షోభంలో విద్యారంగం.. దేశంలో 10 లక్షల టీచర్ పోస్టులు ఖాళీ.. లక్ష విద్యార్థులు ఫెయిల్
బాబా సాహెబ్ అంబేడ్కర్‌ని అమిత్ షా అవమానించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. “అమిత్ షా బాబా సాహెబ్ అంబేడ్కర్‌ని ఘోరంగా అవమానించారు. బిజేపీ – ఆర్‌ఎస్ఎస్ లు మన జాతీయ జెండాకు వ్యతిరేకమని మరోసారి నిరూపితమైంది. వారి పూర్వీకులు, సంఘ్ పరివార్ కు చెందిన వారంతా ఆశోక చక్ర వ్యతిరేకించారు. వారంతా రాజ్యంగానికి బదులు మనుస్మృతిని దేశంలో అమలు పరచాలని స్వాతంత్ర్యం లభించిన తొలి రోజే అనుకున్నారు. కానీ బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ ఇది జరగవివ్వలేదు. అందుకే ఆయనంటే వీరందరికీ ద్వేషం. మోడీ ప్రభుత్వంలోని మంత్రులందరూ ఒకటి అర్థం చేసుకోవాలి. నా లాంటి కోట్ల మందికి బాబా సాహెబ్ అంబేడ్కర్ భగవంతుడి కంటే తక్కువేమీ కాదు. ఆయన దళితులకు, ఆదివాసీలకు, వెనుకబడిక వారికి, మైనారిటీలకు, పేదలకు ఎప్పుడూ ఒక ప్రవక్తనే. అమిత్ షా క్షమాపణలు చెప్పాల్సిందే”. అని ఖర్గే భావోద్వేగంగా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఎంపీ జైరాం రమేష్ కూడా అమిత్ షా వ్యాఖ్యలు చాలా అసహ్యకరంగా ఉన్నాయన్నారు. ఆయన వ్యాఖ్యలు.. అంబేడ్కర్ పట్ల బిజేపీ – ఆర్‌ఎస్ఎస్ ల విద్వేషాన్ని బహిర్గతం చేశాయని చెప్పారు. “ఆయన పేరు పట్ల వీరికి విద్వేషముందో బయటపడింది. వీరి పూర్వీకులే బాబా సాహెబ్ బొమ్మలను దహనం చేశారు. వారే అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మార్చాలని చూశారు. కానీ దేశ ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పారు. అయితే ఇప్పుడుకూడా బాబా సాహెబ్ పేరంటే వీరికి ఎంత ద్వేషం ఉందో బయటపడింది. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. అమిత్ షా దేశానికి క్షమాపణలు చెప్పాలి.” అని జైరామ్ రమేష్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
“బాబా సాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ భగవంతుడితో సమానమే.. ఆయన రాసిన రాజ్యాంగం.. దేశ ప్రజలకు పవిత్ర గ్రంథమే. ఆయన గురించి అంత అవమానకరంగా మాట్లాడడానికి అమిత్ షాకు ఎంత ధైర్యం” అని కాంగ్రెస్ జెనెరల్ సెక్రటరీ కెసి వేణఉగోపాల్ అన్నారు.