Anant Ambani Completes Padayatra| రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, భారత కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ 170 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేశారు. గుజరాత్‌లోని తమ పూర్వీకుల స్వస్థలం జామ్‌నగర్ నుంచి శ్రీకృష్ణుడి దివ్య క్షేత్రం ద్వారకకు పాదయాత్రను ప్రారంభించిన విషయం ఇటీవల మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగిస్తూ అనంత్ ఆదివారం శ్రీ రామనవమి రోజున ద్వారక నగరానికి చేరుకొని శ్రీ కృష్ణుడిని దర్శించుకున్నారు.
ఈ సందర్బంగా.. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన తల్లి నీతా అంబానీ, భార్య రాధికా మర్చంట్‌తో కలిసి పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర యాత్రలో తనతో ఉన్న అందరికీ కృతజ్ఞతలు తెలిపి, ఆధ్యాత్మిక అనుభూతిని పంచుకున్నారు. ఏప్రిల్ 10న అనంత్ అంబానీ పుట్టినరోజు కాగా.. అప్పటి వరకు ఆయన ద్వారక లోనే బస చేస్తారు.
నీతా అంబానీ స్పందిస్తూ..
ఈ సందర్భంంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. తన కుమారుడు పది రోజులపాటు పాదయాత్ర చేసి ద్వారకకు చేరుకోవడం పట్ల చాలా గర్వంగా ఉందని తెలిపారు. ఈ ప్రయాణంలో పాల్గొన్న యువకులందరూ భారతదేశ సంస్కృతిని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తున్నారని ఆమె చెప్పారు. అనంత్‌కు ఆ శ్రీ కృష్ణుడు మరింత శక్తినివ్వాలని తన హృదయపూర్వకంగా ప్రార్థించానని నీతా అంబానీ పేర్కొన్నారు.
Also Read: జమిలి ఎన్నికలు అప్పుడే.. సమయం చెప్పేసిన నిర్మలా సీతారామన్
పాదయాత్ర వివరాలు
అనంత్ అంబానీ మార్చి 29న ద్వారకకు పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో ప్రతి రోజు 20 కిలోమీటర్ల దూరాన్ని నడిచారు. ప్రతిరోజు రాత్రి వేళ మాత్రమే సుమారు ఏడు గంటలపాటు నడుస్తూ.. మార్గంలో ఎదురైన ప్రజలతో మమేకమై, ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.
ఈ ప్రయాణంలో కొంతమంది స్థానికులు కూడా అనంత్‌కు సంఘీభావంగా పాదయాత్రలో చేరి, ఈ ఆధ్యాత్మిక మార్గంలో సహకరించారు. పాదయాత్ర చివర్లో అనంత్ హనుమాన్ చాలీసా, సుందరకాండ, దేవీ స్తోత్రాలను పాడుతూ ఆధ్యాత్మికంగా తన యాత్రను ముగించారు. ఈ పాదయాత్ర అనంత్‌కు ఒక సాధారణ ప్రయాణం కాకుండా, జీవితంలో ఆధ్యాత్మిక శక్తిని పొందే ఒక అర్థవంతమైన అనుభూతిగా నిలిచిందని ఆయన భార్య రాధికా మర్చెంట్ అన్నారు.
యువతకు అనంత్ అంబానీ సందేశం
తాను ద్వారకకు పాదయాత్ర చేస్తున్న సమయంలో అనంత్ అంబానీ మీడియాతో మాట్లాడుతూ, తన జీవితంలో ప్రతి పనిని ప్రారంభించే ముందు ద్వారకాధీశుడిని స్మరించడం తన అభ్యాసమని తెలిపారు. “ద్వారకాధీశుడిని స్మరించినప్పుడు ఏ పనైనా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫల్యంగా పూర్తవుతుంది” అని ఆయన చెప్పారు.