Hyderabad: హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో మందు బాబులకు బ్యాడ్ న్యూస్. ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా వైన్ షాపులు మూతపడనున్నాయి. ఏప్రిల్ 6న జంట నగరాల్లో వైన్ షాపులు బంద్ చేయాలని పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి వేయాలని స్పష్టం చేసింది.
మందుబాబులకు షాక్
శ్రీరామనవమి సందర్భంగా 12 గంటల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. అయితే స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపు ఉంది. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా జంటనగరాల్లో మద్యంషాపులతోపాటు బార్లు, కల్లు దుకాణాలు బంద్ చేయాలని సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమించి మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెస్టారెంట్లలోని బార్లు, మిలిటరీ కాంటీన్లు ఈ జాబితాలో ఉన్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరారు.
ఆదివారం మద్యం షాపులు బంద్ విషయం తెలియడంతో అప్పుడే మందు బాబులు షాపుల ముందు క్యూ కట్టేశారు. వీకెండ్ కావడంతో శుక్రవారం రాత్రి చాలా మంది మందుబాబులు కావాల్సిన స్టాక్‌ను కొనుగోలు చేశారు. వేసవి సీజన్ వచ్చిందంటే చాలు మందు బాబులకు చిల్డ్ బీర్ గుర్తుకు వస్తుంది. సాయంత్రం వేళ చల్లగా బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు.
ALSO READ: జస్ట్ ఇంటర్వ్యూతో జాబ్ భయ్యా.. ఈ అర్హతలుంటే సరిపోతుంది
గడిచిన రెండు రోజులు వాతావరణంలో మార్పులు సంభవించడంతో కాస్త చల్లబడింది. అయితే మళ్లీ ఎండలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. హీట్ వేవ్ మొదలుకానుండడంతో మందు బాబులు చల్లటి బీర్ల కోసం వైన్ షాపులకు వెళ్తున్నారు. బీర్ల కొనుగోలు ఒక్కసారిగా పెరగడంతో చాలా షాపుల్లో స్టాక్ అయిపోయింది. ఏప్రిల్ 5న వీకెండ్ కావడంతో ఆయా షాపుల ముందు మరింత రద్దీ పెరిగే ఛాన్స్ ఉంది.
బీర్ల అప్పుడే కొరత
ఎండలు తీవ్రంగా ఉండటంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బ్రాండెడ్ బీర్ల కొరత ఏర్పడింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 70 వేల నుంచి 90 వేల కేసుల బీర్లు అమ్ముడవుతున్నాయన్నది ఓ అంచనా. సమ్మర్‌లో అదనంగా మరో 20 వేల కేసుల డిమాండ్ పెరగవచ్చు. డిమాండ్‌కు తగ్గట్టు స్టాక్ లేదు.
దీంతో మద్యం డిపోలు షాపులకు తక్కువగా సరఫరా చేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి బీర్ల అమ్మకాలు అమాంతంగా పెరిగాయి. లిక్కర్ అమ్మకాలు కాస్త తగ్గుముఖం పట్టినా బీర్లకు సేల్స్ ఎక్కువగా ఉందని అంటున్నారు షాపుల యజమానులు.
బీర్ల కంపెనీల నుంచి రోజుకు లక్షలన్నర కేసుల స్టాక్ వస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారుల మాట. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో బీర్ల అమ్మకాలు ఎక్కువగా సాగుతున్నాయి. గత ఏప్రిల్‌లో హైదరాబాద్ పరిధిలో దాదాపు 15 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం 20 లక్షల కేసులకు పైగా డిమాండ్ వస్తుందని అంటున్నారు.