Chennai News: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది తమిళనాడులోని అన్నాయూనివర్సిటీలో విద్యార్ధినిపై లైంగిక దాడి కేసు. దీనికి సంబంధించి చెన్నై కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ ఘటనలో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడు జ్ఞానశేఖరన్‌కు యావజ్జీవ జైలు శిక్ష విధించింది. కేవలం ఆరునెలల్లో తీర్పు వెలువరించింది న్యాయస్థానం.
అసలేం జరిగింది? గతేడాది అంటే 2024 డిసెంబర్ 23న చెన్నైలోని అన్నాయూనివర్సిటీలోకి చొరబడిన జ్ఞానశేఖరన్, విద్యార్థిని, ఆమె స్నేహితుడిపై దాడి చేశాడు. ఆ తర్వాత విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తతంగాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించాడు. చివరకు బాధిత విద్యార్ధిని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.
ఫిర్యాదు రోజు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా ఓ కుదుపు కుదిపేసింది. నిందితుడికి అధికార పార్టీతో సంబంధాలు ఉన్నాయంటూ విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించాయి. దీనిపై అధికార డీఎంకె-అన్నాడీఎంకె-బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
చివరకు ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. అయితే నిందితుడు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో దిగిన ఫోటోను షేర్ చేసింది బీజేపీ. చివరకు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందంటూ బీజేపీ నేత అన్నామలై తనను తానే కొరడాతో కొట్టుకుని దండించుకున్నారు. చివరకు 48 రోజుల ఉపవాస దీక్షయాత్ర చేపట్టారు.
ALSO READ: పోలీసు ఉద్యోగ పరీక్షల్లో భారీ స్కామ్, ఆధార్‌తో గుట్టు రట్టు
ఇక కేసు విషయానికొద్దాం. ఎఫ్ఐఆర్‌లో బాధితురాలి వ్యక్తిగత వివరాలు బయటకు రావడంతో తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ వ్యవహారాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. కేవలం మహిళా అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఈ కేసులో చెన్నై మహిళా న్యాయస్థానం సోమవారం సంచనల తీర్పు వెల్లడించింది. నిందితుడ్ని దోషిగా నిర్దారించింది. అతడికి కనీసం 30 ఏళ్లపాటు జైలు శిక్ష విధించింది. ఈ విషయంలో దోషి జైలు శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చింది. అతడిపై నమోదైన లైంగిక దాడి, అత్యాచారం, భయపెట్టడం, అపహరణ వంటి 11 తీవ్రమైన ఆరోపణల్లో దోషిగా ప్రస్తావించింది.
మొత్తం 29 మంది సాక్షులు వాంగ్మూలం సేకరించారు పోలీసులు. విచారణ సమయంలో 100 పేజీల ఛార్జీషీట్ దాఖలు చేశారు సిట్ అధికారులు. అయితే శిక్ష నుంచి తప్పించుకునేందుకు నిందితుడు తన తల్లి, ఎనిమిదేళ్ల కుమార్తెకు తాను ఆధారమని, శిక్ష తగ్గించాలని అభ్యర్థించాడు. అందుకు న్యాయస్థానం ససేమిరా అంది. బాధితురాలికి తాత్కాలిక సహాయంగా 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయస్థానం తీర్పుపై రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.