Middle Class Income Stagnant Report| దేశంలో ప్రజల ఆదాయం గత కొన్ని సంవత్సరాలుగా పెరగడం లేదు. దీనివల్ల వారి వినియోగ శక్తి క్షీణించిపోయింది. ఆసియా ఖండంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశంలో వినియోగదారుల వర్గం పెరగడం లేదు. కేవలం సంపన్నుల సంపద మాత్రమే పెరుగుతోంది. దేశంలో 100 కోట్ల మందికి వస్తువులు కొనడానికి, సేవల కోసం ఖర్చు చేయడానికి తగినంత ఆదాయం లేదని బ్లూమ్ వెంచర్స్ సంస్థ (Bloom Ventures) నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. 143 కోట్ల జనాభాలో.. అత్యవసరం కాని వస్తువులు, సేవలపై ఖర్చు చేయగల వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. వెంచర్ క్యాపిటల్ నివేదిక ప్రకారం, దేశంలో 13 నుండి 14 కోట్ల మంది మాత్రమే ‘వినియోగ వర్గం’గా ఉన్నారు. వీరికే కనీసావసరాలకు మించి కొనుగోలు చేయగల సామర్థ్యం ఉంది.
ఈ వినియోగదారుల వ్యయంపైనే దేశ జీడీపీ ఎక్కువగా ఆధారపడి ఉందని నివేదిక పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల సౌలభ్యంతో ఎక్కువ ఖర్చు చేస్తున్నా.. అది చాలావరకు అత్యవసర సేవల కోసమే ఉంటోందని తెలిపింది. కొత్త స్టార్టప్‌ల సేవలకు వినియోగదారులు డబ్బు ఖర్చు చేయడం లేదని నివేదిక తెలిపింది. భారతదేశంలో వినియోగదారుల మార్కెట్ విస్తృతంగా విస్తరించడం లేదని, సంపన్నుల సంఖ్య పెరగడం లేదని, ఉన్నవారే మరింత సంపన్నులవుతున్నారని ఈ సర్వే తేల్చింది. ఈ మార్పు వ్యాపార ధోరణులను ప్రభావితం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు.
మధ్యతరగతిపై ఒత్తిడి
1990లలో జాతీయాదాయంలో 34% ఉన్న భారతీయ సంపన్నుల వాటా ఇప్పుడు 57.7 శాతం పెరిగింది. దిగువ సగం జనాభా వాటా 22.2% నుండి 15%కి పడిపోయింది. ఆర్థిక పొదుపు కూడా క్షీణిస్తోంది. చాలామంది భారతీయులు రుణాలపై ఆధారపడుతున్నారు. ఆర్థికంగా ఎదుగుతున్న వినియోగదారులు కొనుగోళ్ల కోసం రుణాలపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో, హామీ లేని రుణాల నిబంధనలను రిజర్వ్ బ్యాంకు కఠినతరం చేయడం వారిని బాగా ప్రభావితం చేస్తోంది.
Also Read: ఐటీ రంగంలో జీతాల పెంపు నామమాత్రమే.. ఎందుకంటే?..
వినియోగదారుల డిమాండ్‌కు ప్రధాన చోదకశక్తిగా ఉన్న మధ్యతరగతి కుంచించుకుపోతోంది. దేశంలో పన్ను చెల్లించే మధ్యతరగతిలో సగం మందికి దశాబ్దం కాలంగా వేతనాల్లో పెరుగుదల లేదు. ద్రవ్యోల్బణంతో పోలిస్తే వారి ఆదాయాలు సగానికి పడిపోయాయి. ఈ ఆర్థిక మాంద్యం మధ్యతరగతి పొదుపును దాదాపుగా నాశనం చేసింది. భారతీయ కుటుంబాల నికర ఆర్థిక పొదుపు 50 ఏళ్ల కనిష్టానికి చేరిందని ఆర్బీఐ పదేపదే చెబుతోంది. దాంతో మధ్యతరగతి గృహ వ్యయాలతో ముడిపడ్డ ఉత్పత్తులు, సేవలకు ముందస్తు సవాళ్లు ఎదురవుతున్నాయని నివేదిక సూచిస్తోంది.
ఉద్యోగాలపై ఏఐ టెక్నాలజీ ప్రభావం
సాంకేతికత, యాంత్రీకరణ దెబ్బకు వైట్ కాలర్ ఉద్యోగాలు వేగంగా కుంచించుకుపోతున్నట్లు మార్సెలస్ నివేదిక హెచ్చరిస్తోంది. క్లరికల్ మరియు సెక్రటేరియల్ పోస్టులను క్రమంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత వ్యవస్థలు భర్తీ చేస్తున్నాయి. దాంతో తయారీ రంగంలో పర్యవేక్షక ఉద్యోగాలు కూడా తగ్గుతున్నాయి. ఏఐ యొక్క ఈ దుష్ప్రభావం గురించి ఆర్థిక సర్వే–2025 కూడా పేర్కొంది. ఏఐ వల్ల ఉత్పాదకత పెరుగుతున్నా, కార్మికులపై ఆధారపడే భారతీయ ఆర్థిక వ్యవస్థను ఇది దెబ్బతీస్తుందని హెచ్చరించింది. వృద్ధిని కూడా ఇది ప్రభావితం చేస్తుందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రభుత్వం, ప్రైవేట్ రంగం మరియు విద్యా సంస్థల మధ్య సహకారం మరియు సమగ్ర విధానం అవసరమని నివేదిక పేర్కొంది. ఉద్యోగాలపై ఏఐ ప్రభావం విషయంలో అలసత్వం చూపితే, భారతదేశం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.