Assam MLA Terror Attacks| కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై దేశవ్యాప్తంగా విషాదం అలుముకుంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఒక ఎమ్యెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఉగ్రదాడులు కేంద్ర ప్రభుత్వమే చేయించిందని చెప్పారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. అస్సాం రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రెటిక్ ఫ్రంట్ (AIUDF)కు చెందిన ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాంను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. పహల్గాంలో చోటు చేసుకున్న తాజా ఉగ్రదాడి, అలాగే 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి వంటి ఘటనల వెనుక బిజేపీ ప్రభుత్వం కుట్ర చేసిందని ఎమ్మెల్యే అమినుల్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో మొత్తం 40 మంది సిఆర్ పిఫ్ జవాన్లు చనిపోయారు. అలాగే తాజాగా పహల్గాంలో ఉగ్రవాదులు మొత్తం 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటనల వెనుక బిజేపీ కుట్ర ఉందని వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై అస్సాం పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే అమీనుల్ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో దాని ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అమినుల్ ఇస్లాం మీద భారతీయ న్యాయ సమితి (BNS) సెక్షన్ల 152, 196, 197(1), 113(3), 352, 353 కింద కేసు నమోదు చేశామని అస్సాం పోలీసులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వా శర్మ స్పందిస్తూ.. ఉగ్రవాద ఘటనల విషయంలో పాకిస్తాన్‌కు మద్దతుగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేంక్షించేది లేదని.. సొంత పార్టీ అయినా ఇతర పార్టీ అయినా తేడా లేకుండా.. సమానంగా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో అస్సాం ప్రతిపక్ష పార్టీ ఎఐయుడిఎఫ్ కూడా స్పందించింది. ఎమ్యెల్యే అమీనుల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తి గతమని.. పార్టీకి ఆ వ్యాఖ్యలతో సంబంధం లేదని తెలిపింది. ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా తమ పార్టీ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడుతుందని పార్టీ చీఫ్ మౌలానా బదరుద్దీన్ వెల్లడించారు.
Also Read: ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన ముస్లిం.. పోనీవాలాకు నివాళులర్పించిన కశ్మీర్ సిఎం
పాక్ చెరలో బందీగా బీఎస్ఎఫ్ జవాన్
ఇక పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో.. ఒక బీఎస్ఎఫ్ జవాన్ అనుకోకుండా పాకిస్తాన్ బోర్డర్‌లోకి ప్రవేశించి అక్కడి సైన్యం చేతిలో బందీగా మారారు. పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ బోర్డర్ వద్ద ఈ ఘటన జరిగింది. పీకే సింగ్ అనే జవాన్ పాక్ సైన్యం చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై భారత్, పాకిస్తాన్ సైన్యాలు పరస్పర చర్చలు జరుపుతున్నాయి. బందీగా మారిన జవాన్‌ను సురక్షితంగా విడిచిపెట్టాలని బీఎస్ఎఫ్ అధికారులు పాక్ బోర్డర్ సెక్యూరిటీ అధికారులను కోరారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అని, జవాన్ కావాలని పాక్ భూభాగంలోకి అడుగుపెట్టలేదని బీఎస్ఎఫ్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.