Atishi Resigns: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆప్‌కు కష్టాలు మొదలయ్యాయా? లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు.. మరోవైపు విచారణకు అనుమతి ఇవ్వడం కేజ్రీవాల్‌కు ఇబ్బందులు తప్పవా? ఆప్ కేడర్ ఎందుకు ఆందోళన చెందుతోంది? చీపురుతో తమకు లైఫ్ లేదని భావిస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు అతిషి. తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వీకె సక్సేనాకు సమర్పించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ మఖ్యమంత్రిగా అతిషిను గవర్నర్ కోరారు. అందుకే సరేనని ఆమె చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనలో పడ్డారు. ఇన్నాళ్లు ప్రత్యర్థులకు వ్యతిరేకంగా పోరాటం చేశామని అంటున్నారు. తమపై కేసులు నమోదు చేస్తే తమను ఎవరు పట్టించుకుంటారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా భవిష్యత్ ఏంటనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.
మరోవైపు అరవింద్ కేజ్రీవాల్‌ను అవినీతి కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే చర్యలకు ఉపక్రమించారు ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సేనా. ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోపే ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. కీలక పత్రాలను భద్రపరచాలని పేర్కొన్నారు. లెఫ్ట్ నెంట్ గవర్నర్ నిర్ణయంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో వణుకు మొదలైంది.
ALSO READ: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ఇండియా కూటమి పరిస్థితేంటి?
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల అక్రమాలపై గతంలో చార్జిషీట్లు విడుదల చేసింది బీజేపీ. ఢిల్లీ గవర్నర్ పత్రాలు బయటకు వెళ్లకుండా ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేయాలనే నిర్ణయం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. ఏపీలో ప్రభుత్వ మారగానే కీలక పత్రాలు దగ్దమయ్యాయి. ఈ క్రమంలో ఢిల్లీలో కూడా అలాగే జరగవచ్చని భావించి వీకె సక్సేనా ఆదేశాలు ఇచ్చారని అంటున్నారు.
ఇదిలావుండగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీ సిద్ధమైంది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ మళ్లీ అధినేత ఈడీ అదుపులోకి తీసుకుంటే తమ పరిస్థితి ఏంటన్నది కొందరు మాజీ నేతల ఆలోచన.
ఎన్నికల తర్వాత జరుగుతున్న పరిణామాలతో బెంబేలెత్తుతున్నారు ఆప్ నాయకులు. బీజేపీ తమను వదలదని అంటున్నారు. ఇప్పుడేం చెయ్యాలో తెలియక తికమక పడుతున్నారు. దీనిపై కొందరు నేతలు అధినేతతో మంతనాలు జరిపినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై హోంమంత్రి అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, బీజేపీ ఢిల్లీ విభాగం ముఖ్య నేతలు వీరేంద్ర సచ్‌దేవా, బైజయంత్ పాండా, వర్మ వంటి నేతలు చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఎవరనేదానిపై కొందరు పరిశీలకులతో కమిటీ నియమించనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దాని తర్వాత కొత్త సీఎం ఎవరనేది తేలనుంది.