Manish Sisodia| సుదీర్ఘకాలంపాటు ఒక నిందితుడిని జైలు ఉంచడం సరికాదని.. అతడికి బెయిల్ పొందే హక్కు ఉందని సుప్రీం కోర్టు శుక్రవారం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఘూటుగా వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియా గత 17 నెలలుగా జైలులో ఉన్నారు. ఆయన కేసులో విచారణ ఇంతవరక మొదలు కాలేదు. పైగా సిసోదియా ట్రయల్ కోర్టు, హై కోర్టులో బెయిల్ కోసం ఎన్ని సార్లు ప్రయత్నించినా ఆ రెండు కోర్టులలో ఆయన బెయిల్ పిటీషన్ వాయిదా వేస్తూ వచ్చారు.
ఈ కారణంగా సిసోదియా బెయిల్ కోసం సుప్రీం కోర్టు తలుపులు తట్టారు. ఆయన బెయిల్ పిటీషన్ లో వాదనలు విన్న సుప్రీం కోర్టు.. హైకోర్టు, ట్రయల్ కోర్టు విచారణ తీరుపై మండిపడింది. మనీష్ సిసోదియాకు పది లక్షల ష్యూరిటీపై బెయిల్ మంజూరు చేసింది. సిసోదియాకు బెయిల్ ఇవ్వకుండా.. అసలు విచారణ మొదలు పెట్టకుండా ఇంతకాలం జైలులో నిర్భందించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను ఉల్లంఘించడమే అని చెప్పింది. ఆర్టికల్ 21 ప్రకారం.. ఒక వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తిగత జీవినం సాగించేందుకు అతనికి మౌలిక హక్కు ఉందని చెప్పింది. బెయిల్ ఇవ్వకుండా కేవలం వాయిదాలు వేస్తూ.. ఇంతకాలం హైకోర్టు, ట్రయల్ కోర్టులు కాలక్షేపం చేశాయని నొక్కి చెప్పింది.
సుదీర్ఘకాలం విచారణ కొనసాగే కేసులలో ఒక వ్యక్తిని అత్యవసరమైతేనే బెయిలు నిరాకరించాలని.. బెయిల్ నిందితుడి హక్కు, జైలు ఒక ముందస్తు చర్య మాత్రమే అని అభివర్ణించింది. న్యాయం జరుగుతుందని కోర్టులకు వస్తే.. వారిని సుదీర్ఘకాలం పాటు ఎదురు చూసేలా చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని దేశ అత్యుత్తమ కోర్టు వ్యాఖ్యానించింది. సిసోదియా కేసులో ఆయన ఆధారలను తారుమారు చేస్తాడని, దేశం వదిలి పారిపోతాడని చెప్పడం నమ్మశక్యంగా లేదని.. ఆధారలన్నీ పోలీసుల ఆధీనంలో ఉన్నాయని చెప్పినప్పుడు వాటిని ఎలా తారుమారు చేస్తాడని ప్రశ్నించింది. పైగా సిసోదియా ఒక రాజకీయ నాయకుడు, రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తి ఆయన పారిపోతాడని తాము భావించడం లేదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఈ కేసులో ఈడీ ప్రవేశపెట్టిన అన్ని పిటీషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఫిబ్రవరి 26, 2023న అప్పుడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోదియాను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. ఆ తరువాత మార్చి 9, 2023న ఈడీ అధికారులు ఆయనను తమ కస్టడీలోకి తీసుకున్నారు. 2021-22 ఢిల్లీ లో కొత్త మద్యం పాలసీ రూపొందించడంలో ఆయన అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో సిబిఐ, ఈడీ అధికారులు ఆయనను గత 17 నెలలుగా జైలులోనే ఉంచారు.
Also Read: ‘ఉద్యోగం కావాలంటే బాస్ తో సమయం గడపాలి’.. మహిళకు కండిషన్ పెట్టిన మేనేజర్