BirdFlu Detecting Device| గాల్లో ప్రసరిస్తూ వ్యాపించే బర్డ్ ఫ్లూ వైరస్‌ను కేవలం ఐదు నిమిషాల్లోనే గుర్తించగలిగే ఒక బయోసెన్సర్‌ను వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ కొత్త సాంకేతికత వ్యాధి నివారణ చర్యలను వేగవంతంగా చేపట్టడానికి దోహదపడుతుంది. భారతీయ సంతతికి చెందిన రాజన్ చక్రవర్తి నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. ఈ బయోసెన్సర్‌ను అభివృద్ధి చేయడానికి, వైరస్‌లు, బ్యాక్టీరియాను గుర్తించడంలో వేగం, సున్నితత్వాన్ని (సెన్సిటివిటీ) మెరుగుపరిచే విద్యుత్ రసాయన (Electro Chemical) కెపాసిటివ్ బయోసెన్సర్‌లపై పరిశోధనలు చేపట్టారు.
ఇంతవరకు, పాలిమరేజ్ చైన్ రియాక్షన్ (PCR), డీఎన్ఏ సాధనాలపై ఆధారపడే సంప్రదాయ పరీక్ష విధానాలు ఫలితాలు అందించడానికి 10 గంటలకు పైగా సమయం తీసుకునేవి. మహమ్మారి సమయంలో వ్యాధిని నియంత్రించడానికి ఇది చాలా ఎక్కువ సమయమని రాజన్ వివరించారు. కొత్త బయోసెన్సర్ కేవలం ఐదు నిమిషాల్లోనే ఫలితాలను అందిస్తుంది. అంతేకాకుండా, ఇది సూక్ష్మజీవుల నమూనాలను తదుపరి విశ్లేషణ కోసం భద్రపరుస్తుంది. దీంతోపాటు సూక్ష్మజీవులు ఎంత మోతాదులో ఉన్నాయో కూడా తెలుపుతుంది.
ఈ సాధనం ఒక డెస్క్‌టాప్ ప్రింటర్ పరిమాణంలో ఉంటుంది. దీన్ని కోళ్లు మరియు పశువుల షెడ్‌లకు సంబంధించిన ఎగ్జాస్ట్ వద్ద ఉంచవచ్చు. ఇందులో వెట్ సైక్లోన్ బయోఏరోసాల్ శాంప్లర్ ఉంటుంది, ఇది H5N1 వంటి సూక్ష్మజీవులతో కూడిన గాలిని వేగంగా లోపలికి లాగి.. పరికరంలోని ద్రవంతో కలుపుతుంది. ఈ యూనిట్‌లో ఆటోమేటెడ్ పంపింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది ద్రవ రూపంలోకి మారిన నమూనాలను ప్రతి ఐదు నిమిషాలకు బయోసెన్సర్‌లోకి పంపుతుంది. ఈ విధంగా వైరస్‌ను నిరంతరం గుర్తించడం సాధ్యమవుతుంది.
ఈ బయోసెన్సర్‌లో ఆప్టామర్స్ అనే క్యాప్చర్ ప్రోబ్స్‌లు ఉంటాయి, ఇవి డీఎన్ఏ పోగులు. ఇవి వైరస్ ప్రొటీన్లకు అతుక్కుని వాటిని సులభంగా గుర్తించడంలో సహాయపడతాయి. ఈ సాంకేతికత వ్యాధులను వేగంగా మరియు సమర్థవంతంగా నిరోధించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
Also Read: త్వరగా పెళ్లి చేసుకోండి.. లేదంటే ఉద్యోగం ఊస్టింగే – భలే ఫిట్టింగ్ పెట్టారుగా
బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావమెంత?
ప్రపంచవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇది హెచ్5ఎన్1 వైరస్ వల్ల కలిగే అంటువ్యాధి, ఇది పెంపుడు కోళ్లు మరియు అడవి పక్షులను ప్రభావితం చేస్తుంది. 1996లో చైనాలో మొదటిసారిగా గుర్తించబడిన ఈ వైరస్, ఇప్పుడు యూరప్, అమెరికా వంటి ప్రాంతాల్లో కూడా వ్యాపిస్తోంది. ఈ ఏడాది 16 కోట్ల పెంపుడు పక్షులు మరణించాయి, అందులో 10 కోట్లు అమెరికా మరియు యూరప్‌లోనివి. అడవి పక్షులలో కూడా ఈ వ్యాధి తీవ్రంగా వ్యాపించి, 80 పక్షి జాతులు ప్రభావితమయ్యాయి.
బర్డ్ ఫ్లూ వైరస్ పక్షుల రెట్టలు, లాలాజలం మరియు కలుషితమైన ఆహారం ద్వారా వ్యాపిస్తుంది. ఇది ప్రాణాంతకమైనది, కొన్ని సందర్భాల్లో మానవులకు కూడా సోకుతుంది. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి చైనా వంటి కొన్ని దేశాలు పెంపుడు కోళ్లకు టీకాలు వేస్తున్నాయి. కానీ ఇతర దేశాలు ఈ విధానాన్ని అనుసరించడం లేదు. ఈ వ్యాధి వల్ల కోళ్ల మాంసం, గుడ్ల వ్యాపారం ప్రభావితమవుతోంది. తద్వారా ఆహార సరఫరాలో కొరతకు దారితీస్తోంది.