BJP Distributing Cash| మరి కొన్ని గంటల్లో మహారాష్ట్ర అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా.. బిజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి వినోద్ తావ్డే సహా కొందరు ఓటర్లకు నగదు పంపిణీ చేశారని ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక ప్రాంతీయ పార్టీ ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వినోద్ తావ్డే మహారాష్ట్ర బిజేపీ జెనెరల్ సెక్రటరీ పదవిలో ఉన్నారు. ఆయన, మరో బిజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాల్ఘర్ జిల్లా విరార్ ప్రాంతంలో ఒక హోటల్ లో నగదు పంచారని స్థానిక పార్టీ వెల్లడించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బహుజన్ వికాస్ అఘాడీ పార్టీ ఈ ఆరోపణలు చేసింది.
ముంబైలోని నాలాసొపారా రాజన్ నాయక్ అనే బిజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, వినోడ్ తావ్డే నేతృత్వంలో ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు తమ కార్యకర్తలకు భారీ డబ్బులు ఇచ్చారని అతని ప్రత్యర్థి బహుజన్ వికాస్ అఘాడీ ఎమ్మెల్యే క్యాండిడేట్ క్షితిజ్ ఠాకుర్ మీడియా ముందు చెప్పారు. వినోద్ తావ్డే, ఇతర బిజేపీ నాయకులు విరార్ హోటల్ లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బులు పంచుతుండగా.. వారిని తమ కార్యకర్తలు పట్టుకున్నారని క్షితిజ్ ఠాకుర్ తెలిపారు. బిజేపీ నాయకుడు భారీ మొత్తంలో వారి కార్యకర్తలకు ప్రజలకు పంచడానికి కవర్‌లలో పెట్టి డబ్బులిచ్చారని, ఎవరికి ఎంత ఇచ్చారో మొత్తం ఒక డైరీలో రాసి ఉంచారని ఠాకుర్ వెల్లడించారు. ఆ నగదు, డైరీ హోటల్ లో నుంచి బహుజన్ వికాస్ అఘాడీ కార్యకర్తలు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ట్విట్టర్ ఎక్స్ లో ఆయన వీడియోలు పోస్ట్ చేశారు.
Also Read: విమాన ప్రయాణంలో ప్రైవేట్ పార్ట్స్ కాలిపోయాయి.. ఎయిర్‌లైన్స్‌పై కేసు పెట్టిన ప్రయాణికుడు!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోల్లో వినోద్ తావ్డే ముందు బహుజన్ వికాస్ అఘాడీ పార్టీ కార్యకర్తలు నగదు చూసిస్తూ నిరసన చేస్తున్నారు. తావ్డే కు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. ఎన్నికల్లో నగదు పంపిణీ చేస్తున్నారని బిజేపీ నాయకులపై కేసు కూడా నమోదు చేశారు.
స్వాధీనం చేసుకున్న డబ్బులు పాల్ఘర్ జిల్లా కలెక్టర్ గోవింద్ బోడ్కే కు అందించారు. కలెక్టర్ గోవింద్ మీడియా ముందు మాట్లాడుతూ.. “మాకు హోటల్ నుంచి రూ.9 లక్షల 93వేలు అందాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు. అయితే విరార్ హోటల్ లో బిజేపీ నాయకులు మొత్తం రూ.5 కోట్లు పంచారని ఆ విషయాలన్నీ ఒక డైరీలో ఉన్నాయని బహుజన్ వికాస్ అఘాడీ అధ్యక్షుడు హితేంద్ర ఠాకుర్ అన్నారు.
ఈ ఘటనపై కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్దశ్ ఠాక్రే శివసేన నాయకులు స్పందించారు. బిజేపీ సీనియర్ నాయకులే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని.. కానీ ఎన్నికల కమిషన్, పోలీసులు.. ప్రతిపక్ష నాయకుల బ్యాగులు చెక్ చేశారు. కానీ అసలైన బ్యాగులని మాత్రం చెక్ చేయకుండా వదిలేశారని.. ఇప్పుడు ఆ బ్యాగులు నుంచే ప్రజలకు ఎన్నికల సమయంలో డబ్బులు పంచుతున్నారని మండిపడ్డారు.
మరోవైను బిజేపీ మాత్రం ఇదంతా ప్రతిపక్ష పార్టీల హై డ్రామా అని కొట్టిపారేసింది. ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని ఎద్దేవా చేసింది.