PUBG On Railway Track| వ్యసనాలకు బానిసైలుగా మారినవారు ప్రపంచాన్నే నిర్లక్ష్యం చేస్తారు. తమ చుట్టూ ఏం జరుగుతుందో వారికి పట్టదు. పక్కనే ఎంతటి ప్రమాదం ఉన్నా.. అత్యవసర పరిస్థితులున్నా.. వారి మదిలో ఆ దురలవాటు మాత్రమే ఉంటుంది. దీని వల్ల ప్రాణాలే కోల్పోయిన వారున్నారు. తాజాగా అలాంటి ఒక ఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది. సరదా కోసం ఒక రైల్వే ట్రాక్ పై కూర్చొని ముగ్గురు విద్యార్థులు మొబైల్ గేమ్ లో లీనమైపోయారు. పక్కనే ట్రైన్ దూసుకొచ్చినా వారు గమనించలేదు. దీంతో రైలు కింద పడి మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే.. బిహార్ రాష్ట్రం పశ్చిమ చంపారన్ జిల్లా మన్సా టోలా ప్రాంతంలో ఉన్న రాయల్ స్కూల్ సమీపంలో గురువారం జనవరి 2, 2025న నరకటియాగంజ్ ముజఫర్‌పూర్ రైల్ సెక్షన్ వద్ద ఒక రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు స్కూల్ విద్యార్థులు ఫుర్కాన్ ఆలం, సమీర్ ఆలం, హబీబుల్లా అన్సారీ.. అందరూ టీనేజ్ వయసులో ఉన్నారు.
ఈ ముగ్గరూ కలిసి మొబైల్ ఫోన్ లో పబ్జీ ఆన్‌లైన్ గేమ్ ఆడుతూ రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. అక్కడ రైల్వే ట్రాక్ మీదనే కూర్చొని గేమ్ ఆడుతూ చుట్టు పక్కలా ఏం జరుగుతోందో పట్టించుకోలేదు. ఆ సమయంలో వారితో పాటు అక్కడ మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. వారు రైల్వే ట్రాక్ పై కూర్చో వద్దని చెప్పినా ఆ ముగ్గురు విద్యార్థులు వినలేదు. పైగా చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పబ్జీ గేమ్ లో ఆడుతూ లీనమైపోయారు.
పక్క ట్రాక్ మీద నుంచి ట్రైన్లు వస్తున్నా.. వారు ఏమీ పట్టనట్లు అజాగ్రత్తగా కూర్చొని ఆడుతున్నారు. ఈ క్రమంలో వారు కూర్చొన్న రైలు పట్టాలపైనే కాసేపట్లో ట్రైన్ వచ్చింది. దీన్ని ఆ ముగ్గురూ గమనించలేదు. ఆ ట్రైన్ పక్క ట్రాక్ లో వస్తుందేమోనని అలాగే కూర్చుండిపోయారు. దీంతో ఆ ట్రైన్ ఒక్కసారిగా పూర్తి వేగంతో దూసుకెళ్లిపోయింది. ఆ ట్రైన్ తాకిడికి ముగ్గురు ఎగిరి పడి అక్కడికక్కడే చనిపోయారు.
Also Read: పందెం కాశాడు.. 20 నిమిషాల్లో 2 విస్కీ బాటిళ్లు పచ్చిగానే.. ఎంత సంపాదించాడంటే!?
కళ్ల ముందరే భారీ ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో ఉన్న మరో ఇద్దరు పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే ట్రాక్ పై ముగ్గురు స్కూల్ పిల్లలు చనిపోయారని తెలిసి స్థానికులు అక్కడ గుమిగూడారు. సమీపంలోని ముప్ఫసిల్ పోలీస్ స్టేషన్ నుంచి అధికారులు అక్కడికి చేరుకొని ఆ మూడు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించారు.
చనిపోయిన ముగ్గురిలో ఫుర్కాన్ ఆలం.. మన్షా తోలా, రైల్వే గుమ్తీకి చెందిన వాడు కాగా.. మిగతా ఇద్దరు హబీబుల్లా అన్సారీ, సమీర్ ఆలం బరీ తోలాకు చెందినవారు అని పోలీసులు తెలిపారు.
ముగ్గురూ టీనేజర్లు కావడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకంలో మునిగిపోయారు. వారి మృతదేహాలను అంత్యక్రియల కోసం పోస్ట్ మార్టం తరువాత వారికి అప్పగిస్తామని రైల్వే పోలీసులు, సదర్ సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీసర్ వివేక్ దీప్ చెప్పారు.