Supreme Court Plea: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ కు వ్యతిరేకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఓటర్ల సవరణ ప్రక్రియ (SIR)లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ.. న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండా సీఈసీ చేపట్టిన నిర్ణయాలు, మార్గదర్శకాలు, సాఫ్ట్‌వేర్ మార్పులను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని పిటిషన్ లో అభ్యర్థించారు. అంతేకాకుండా దీనిపై సిట్ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎస్ఐఆర్ (SIR)కి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు, ఇచ్చిన ఆదేశాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ (Sukhbir Singh Sandhu), వివేక్ జోషి (Vivek Joshi) కనీసం 14 సందర్భాల్లో తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు ప్రముఖ జాతీయ పత్రిక రాసిన కథనం తీవ్ర దుమారం రేపింది. ఫారం-6 మార్పులు, ఓటర్ల జాబితా డేటా నిర్వహణకు సంబంధించి తమకు తెలియకుండా లేదా తమ సిఫార్సులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారని కమిషనర్లు పేర్కొన్నట్లు కథనంలో తెలిపింది. గత కొద్దిరోజులుగా ఈసీపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఈ వార్తా కథనం మరింత బలం చేకూర్చినట్లైంది. దీనిపై రాహుల్ గాంధీ గురువారం ప్రెస్ మీట్ పెట్టి మరీ సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులోనూ ఆయనకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైంది.
ప్రజా ప్రాతినిధ్య చట్టం – 1950 లోని సెక్షన్ 32 కింద సీఈసీ జ్ఞానేష్ కుమార్ తో పాటు బాధ్యులైన అధికారులపై ఫిర్యాదు నమోదు చేసి విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఫారం-6 ను అక్రమంగా సవరించడం, డేటాబేస్‌ల కేంద్రీకరణ, ఈసీఐ నెట్ (ECINet) ద్వారా అర్హులైన ఓటర్లను పునరుద్ధరించకపోవడం, బెంగాల్‌లో ఈసీఐ పేరిట 16.10 లక్షల అప్పీళ్లు దాఖలు చేయడం వంటి చర్యలు విధి నిర్వహణ ఉల్లంఘన కిందకే వస్తాయని పిటిషనర్ పేర్కొన్నారు.
ఎన్నికల కమిషన్ చట్టం – 2023లోని సెక్షన్ 18 ప్రకారం.. సీఈసీ, ఇతర కమిషనర్ల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే మెజారిటీ నిర్ణయం ప్రకారమే వ్యవహరించాల్సి ఉంటుందని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే ఈ నిబంధనను ఉల్లంఘిస్తూ జ్ఞానేష్ కుమార్ ఒంటెద్దు పోకడలతో తీసుకున్న నిర్ణయాలు, జారీ చేసిన ఆదేశాలు, సాఫ్ట్‌వేర్ మార్పులను చెల్లుబాటు కావని (Void ab initio) ప్రకటించాలని పిటిషనర్ కోరారు. మిగిలిన ఇద్దరు కమిషనర్లు సీఈసీ జ్ఞానేష్ కుమార్ కు తెలిపిన అభ్యంతరాలను సైతం కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకెళ్లారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఏకంగా 13 కోట్ల ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని పిటిషనర్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో సైబర్ సెక్యూరిటీ, ఐటీ నిపుణులతో కూడిన స్వతంత్ర జ్యుడీషియల్ ఎంక్వైరీ కమిషన్ లేదా ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని కోరారు. ఈ బృందం ద్వారా ఈసీఐ నెట్, ఈఆర్‌ఓ నెట్ డేటాబేస్‌ల ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అలాగే పశ్చిమ బెంగాల్‌లో 16.10 లక్షల అప్పీళ్ల దాఖలు వెనుక ఉన్న బాధ్యులను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: బిహార్‌లో మళ్లీ బరితెగించిన ఆకతాయిలు.. ప్రముఖ టూరిస్ట్ స్పాట్‌లో యువతిపై వికృత దాడి!
అంతేకాకుండా పోర్టల్‌లలో చేసిన మార్పులను రద్దు చేసి ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ – 1960’ ప్రకారం నిర్ణయించిన అసలైన ఫారం-6ను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. 2025 అక్టోబర్ 1 నుండి ఈసీఐ నెట్, ఈఆర్‌ఓ నెట్ సర్వర్ లాగ్‌లు, డేటాబేస్‌లు, కమ్యూనికేషన్లు, మెటాడేటాను భద్రపరచాలని స్పష్టం చేశారు. ఈ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేష్ కుమార్, క్యాబినెట్ కార్యదర్శి, మనీష్ గార్గ్, సీమా ఖన్నాలను ప్రతివాదులుగా న్యాయవాది చేర్చారు. అయితే ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అన్నది ప్రస్తుతం ఆసక్తిరేపుతోంది.
Also Read: ఓవైపు ఎన్నికలపై ఆరోపణలు.. ఇంకోవైపు పోటీ.. విపక్షాల తీరుపై సీజేపీ చీఫ్ ఆశ్చర్యం!