MPHW Recruitment: స్వేచ్చ బ్యూరో: అధికారుల నిర్లక్ష్యం ఇప్పుడు దాదాపు 650 మంది అభ్యర్ధుల ఉద్యోగాలను గందరగోళంలోకి నెట్టింది. సుమారు మూడేళ్ల తర్వాత ఉద్యోగం పొందుతున్నామనే ఆశతో ఉన్న అభ్యర్ధులను చిన్న నిర్లక్ష్యం ఇరకాటంలోకి నెట్టింది. ఇప్పుడు ఆయా అభ్యర్ధులంతా తమకు ఉద్యోగం వస్తుందా? లేదా? అని టెన్షన్ పడుతున్నారు. 2023లో విడుదలైన ఎంపీహెచ్ ఏ ఫీమెల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కు సంబంధించి, అధికారుల ఆలస్య ధోరణి కారణంగా 2024లో రాత పరీక్ష నిర్వహించారు.
ఆ తర్వాత వివిధ దశలు దాటుకుంటూ చివరికి 2026 సెప్టెంబరు నాటికి సర్టిఫికెట్ల పరిశీలన (వెరిఫికేషన్) ప్రాసెస్ ముగింపు దశకు వచ్చింది. అయితే 2023లో నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయానికి వారందరి వద్ద నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉన్నది. కానీ, నోటిఫికేషన్ ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నా నియామకాల ప్రాసెస్ పూర్తి చేయకపోవడంతో, ఈ సుదీర్ఘ కాలంలో చాలామంది అభ్యర్థుల సర్టిఫికేట్ గడువు ముగిసింది. దరఖాస్తు సమయంలో పూర్తి అర్హత కలిగిన వారు.. ప్రభుత్వం చేసిన ఆలస్యం వల్ల ఇప్పుడు “అనర్హులు”గా మారే ప్రమాదం దాపురించింది.
ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి, తమ రిజిస్ట్రేషన్‌ను రీన్యూవల్ చేయించుకునేందుకు నర్సింగ్ కౌన్సిల్‌ను సంప్రదించిన అభ్యర్థులకు మరో ఊహించని షాక్ తగిలింది. రీన్యూవల్ చేయాలంటే ముందుగా ఎన్ యూఐడీ కార్డు తప్పనిసరి అని కౌన్సిల్ వర్గాలు కొత్త రూల్ చెబుతున్నాయి. ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే, ఆ కార్డు జారీ కావడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని అధికారులు తేల్చిచెబుతున్నారు.పైగా బోర్డు నిర్వహించే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు తుది గడువు ఈనెల 28 వరకు మాత్రమే ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తమ ఉద్యోగానికి ప్రమాదం వాటిల్లిందని పలువురు అభ్యర్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also read: 24 ఏళ్ల ఆకలి తీర్చుకుంటాం…టీమిండియాకు పీడ కల మిగుల్చుతాం
మరోవైపు తమ భవిష్యత్తు ఏమైపోతుందోనని ఆందోళనతో వివరాలు తెలుసుకునేందుకు నర్సింగ్ కౌన్సిల్ కార్యాలయానికి వెళ్లిన అభ్యర్థులతో అక్కడి సిబ్బంది, అధికారులు తీవ్ర దురుసుగా ప్రవర్తిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. సమాధానం చెప్పాల్సింది పోయి హెచ్చరించే ధోరణిలో మాట్లాడుతున్నారని, ఇన్ ఛార్జ్ రిజిస్ట్రార్ కూడా సరిగ్గా స్పందించడం లేదని అభ్యర్థులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, అహంకార పూరిత వైఖరి వల్ల ఎన్నో కుటుంబాల జీవితాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఇక నోటిఫికేషన్ కు అప్లై చేసే సమయానికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉంటే సరిపోతుందని గతంలో అధికారులే చెప్పారని, కానీ ఇప్పుడు వెరిఫికేషన్ లో కచ్చితంగా లేటెస్ట్ అడుగుతున్నారని అభ్యర్ధులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని పలువురు అభ్యర్ధులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ 650 మంది అభ్యర్థుల ఉద్యోగాలు చేజారిపోకుండా ఉండాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ నెల 28తో ముగిసే డాక్యుమెంట్ సబ్మిషన్ గడువును కనీసం రెండు నుంచి మూడు నెలల పాటు పొడిగించాలి.ఇక ప్రత్యేక చొరవ తీసుకొని బాధితులందరికీ అత్యవసర ప్రాతిపదికన 2-3 రోజుల్లోనే ఎన్ యూఐడీ కార్డులు, రిజిస్ట్రేషన్ రీన్యూవల్స్ పూర్తయ్యేలా నర్సింగ్ కౌన్సిల్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి. బాధితులతో దురుసుగా ప్రవర్తిస్తున్న నర్సింగ్ కౌన్సిల్ సిబ్బందిపై, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని అభ్యర్ధులు కోరుతున్నారు. ఇక ఎన్ యూఐడీ కార్డు పై తమకు అవగాహన లేదని, కౌన్సిల్ కూడా ఆ దిశగా ప్రచారం చేయలేదని బాధితులు లబోదిమంటున్నారు.
Also read: టాటా To మహీంద్రా.. బ్లైండ్ స్పాట్ ఫీచర్ ఉన్న కార్ల లిస్ట్ ఇదే!