Big Stories

Heart Attack : కోవిడ్ వల్లే గుండెపోట్లు..? కేంద్రం క్లారిటీ..!

Heart Attack : దేశంలో ఇటీవల సడెన్ హార్ట్ అటాక్ కేసులు పెరిగిపోయాయి. ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు నడుస్తూ నడుస్తూ ప్రాణాలు వదిలేస్తున్నారు. ఫంక్షన్లలో డ్యాన్సులు వేస్తూ, జిమ్ చేస్తూ, ఆటలు ఆడుతూ ఇలా ఎంతో మంది అకస్మాత్తుగా గుండెపోటుకు గురై క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. వారిలో ఎక్కువ మంది యువత ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ ప్రభావం తర్వాతే ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కోవిడ్ బారిన పడిన వారే ఇలా కార్డియాక్ అరెస్ట్ కు గురవుతున్నారనే వాదన ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కొంతమంది ఇలా చనిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో గుండెపోట్లకు కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

- Advertisement -

దేశంలో గుండెపోట్ల ఘటనలపై కేంద్రం స్పందించింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారంతో కొవిడ్‌ , గుండెపోటు ఘటనలకు మధ్య సంబంధంపై అధ్యయనం చేస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్ సుఖ్ మాండవీయ వెల్లడించారు. దేశంలో భారీ స్థాయిలో చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వల్ల ‘కొవిన్‌’ వెబ్ సైట్ నుంచి వచ్చిన సమాచారం ఎంతో ఉపయోగపడుతోందని తెలిపారు.

- Advertisement -

కొవిడ్‌ తర్వాత హార్ట్ స్ట్రోక్‌ కేసులు పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయని కేంద్రమంత్రి అన్నారు. తమవద్ద ఉన్న డేటాపై భారత వైద్య పరిశోధన మండలి పరిశోధన ప్రారంభించిందని వెల్లడించారు. మూడు, నాలుగు నెలల క్రితమే పరిశోధన మొదలైందని చెప్పారు. మరో రెండు నెలల్లో ఫలితాలు వస్తాయన్నారు. కొవిడ్‌కు గుండెపోటు ఘటనలకు మధ్య సంబంధాన్ని కనుక్కునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.

మరోవైపు దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభణ మొదలుపెట్టింది. ఇప్పటివరకు 214 రకాల కొవిడ్‌ వేరియంట్లు గుర్తించినట్లు మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. ఈ వేరియంట్లపై కొవిడ్‌ వ్యాక్సిన్‌లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్నారు. ప్రస్తుతం బీఎఫ్‌-7 ఉపరకం ఎక్స్‌బీబీ1.16 వేరియంట్‌ వ్యాప్తిలో ఉందన్నారు.

మరోవైపు కొత్త వేరియంట్లను గుర్తించిన వెంటనే వాటిని ల్యాబ్‌లో ఐసోలేట్‌ చేస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. అనంతరం వాటిపై వ్యాక్సిన్ల పనితీరు ఏవిధంగా ఉందన్న దానిపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు వ్యాప్తిలో ఉన్న అన్ని వేరియంట్లపై వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తేలిందన్నారు.
ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మన్ సుఖ్ మాండవీయ స్పష్టంచేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News