MISS Scheme: రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రకరకాల పథకాలు ఉన్నాయి. వాటిలో మిస్ ఒకటి. మిస్.. అదేంటి అనుకుంటున్నారా? సింపుల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే వడ్డీ రాయితీ పథకం అన్నమాట. తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవచ్చు.
రైతు తన పొలంలో సాగు చేసేందుకు పెట్టుబడి నిధులు తప్పనిసరి. ప్రభుత్వాలు ఎంతో కొంత సర్దుతాయి. కాకపోతే సమయానికి ఇస్తే.. రైతు ఆ పనిని పూర్తి చేయగలదు. లేకుంటే ఏడాదంతా నరకం అనుభవించాల్సిందే. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం కంటిన్యూ చేస్తోంది వడ్డీ రాయితీ పథకం-మిస్.
బుధవారం సమావేశమైన మోదీ మంత్రివర్గం ఈ ఆర్థిక సంవత్సరానికి స్కీమ్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అవసరమైన నిధులను కేటాయించడమే కాదు ఎలాంటి మార్పులు చేయలేదు. దీని గురించి ఇంకాస్త డీటేల్ గా వెళ్దాం.
రైతులకు రుణాలు అందించేందుకు యూపీఏ ప్రభుత్వం 2006లో వడ్డీ రాయితీ పథకాన్ని ప్రారంభించింది. యూపీఏ-2 హయాంలో వడ్డీ రాయితీ పథకాన్ని సవరించింది. ఆనాటి నుంచి దీన్ని సవరించిన వడ్డీ రాయితీ పథకం-మిస్‌గా చెబుతారు. ఈ పథకం కింద 3 లక్షల వరకు వ్యవసాయ రుణాలను బ్యాంకుల నుంచి తీసుకోవచ్చు. తక్కువలో తక్కువ 7 శాతం వడ్డీకే అందజేస్తాయి.
ALSO READ: కేంద్రం కొత్త ప్లాన్.. ఇక ప్రతీ ఇంటికి డిజిటల్ ఐడీ, అదెలా సాధ్యం
రైతులకు బ్యాంకులు కల్పించే 1.5 శాతం వడ్డీ రాయితీకి సరిపడా మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తుంది ప్రభుత్వం. దీనివల్ల బ్యాంకులు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వగలుగుతాయి. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు అదనంగా 3 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. దీనివల్ల రైతులు చెల్లించాల్సిన వడ్డీ రేటు ఏడాదికి కేవలం 4 శాతం కానుంది.
మోదీ సర్కార్ వచ్చిన ఈ పథకాన్ని పొడిగిస్తూ వస్తోంది. ఈసారి కూడా అదే చేసిందనుకోండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డుతో 3 లక్షల వరకు రుణం పొందవచ్చు. వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన స్వల్పకాలిక పంట రుణాలు, పశు పోషణ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, ఫిషరీస్ లాంటి రంగాలకు ఈ పథకం వర్తించనుంది.
వడ్డీ రాయితీ పథకానికి అర్హతలు ఒకసారి చూద్దాం. రైతు వయస్సు 18 ఏళ్ల నుంచి 75 ఏళ్ల మధ్య ఉండాలి. సొంత భూమి ఉండి వ్యవసాయం చేస్తున్నవారు అర్హులు. కౌలు రైతులు, షేర్ క్రాపర్స్, లీజుదారులకు అవకాశం ఉంది. పాడి రైతులు, చేపల రైతులు, కోళ్ల రైతులు సైతం దీని పరిధిలోకి వస్తారు.
విడి విడిగా రైతులే కాకుండా, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, స్వయం సహాయక సంఘాలు ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చు. అయితే 3 లక్షల వరకు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలకు మాత్రమే ఈ రాయితీ వర్తించనుంది. వడ్డీ రాయితీ పథకానికి రైతులు బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాలు తీసుకోవచ్చు. బ్యాంకులను సంప్రదించినప్పుడు ఈ పథకం నిబంధనల ప్రకారం తెలియజేస్తాయి.
కిసాన్ క్రెడిట్ కార్డ్ లేదా ఇతర వ్యవసాయ రుణాల దరఖాస్తు ప్రక్రియతో సమానమైన విధానాన్ని దీని విషయంలో అనుసరిస్తారు. ఏ బ్యాంకు నుంచి రుణం పొందాలను కుంటున్నారో ఆశాఖను సంప్రదించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. గుర్తింపు కార్డు అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ లాంటివి ఉండాలి. భూ యాజమాన్య పత్రాలంటే భూమి రికార్డులు లేదా పట్టాదార్ పాస్ బుక్‌తోపాటు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి.