అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 ఖరీఫ్ సీజన్ కు వరి కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక కీలక నిర్ణయం తీసుకుంది. క్వింటాలుకు రూ. 69 పెంచినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తాజా పెంపుతో క్వింటాల్ వరి ధాన్యం ధర రూ. 2,369కి చేరిందన్నారు. గత దశాబ్ద కాలంలో ఏళ్లలో ఖరీఫ్ పంటలకు ఎంఎస్‌పీ భారీగా పెంచినట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడిపై కనీసం 50% లాభం వచ్చేలా కనీస మద్దతు ధరలను సవరించినట్లు వెల్లడించారు. దీని కోసం రూ.2,70,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మరోవైపు రైతులకు వడ్డీ రాయితీ కింద రూ. 15,642 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. వరితో పాటు గోధుమ, మొక్కజొన్న, జొన్న, పప్పు ధాన్యాల ధరలు కూడా పెంచినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు.
పంటల వారీగా పెరిగిన ధరల వివరాలు
వరితో పాటు మొత్తం 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వరికి క్వింటాల్ కు రూ.69 పెంచగా.. జొన్నలు రూ. 328, సజ్జలు రూ.150, రాగులు రూ.596, మొక్కజొన్న రూ.175, కందిపప్పు రూ.450, పెసర రూ.86, మినుములు రూ.400, వేరుశెనగ రూ.480, పొద్దుతిరుగుడు రూ.441, సోయాబీన్ రూ.436, కుసుమలు రూ.579, పత్తి రూ.589 చొప్పున ధరను పెంచినట్లు తెలిపారు.
గత ఏడాది రూ. 117 పెంపు
కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కూడా వరికి కనీస మద్దతు ధర పెంచింది. క్వింటాలుకు రూ.117 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సాధారణ వరి ధర రూ.2,300కి, ఏ-గ్రేడ్ వరి ధర రూ.2,320కి చేరింది. అయితే, రైతులు ఈ మద్దతు ధరపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సాగు ఖర్చులతో పోల్చితే ఈ ధర ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. క్వింటాలుకు రూ.3,000 వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఈ ఏడాది కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు కాక ఇబ్బందులు పడ్డారు. ఓవైపు వానాకాలం సీజన్ ప్రారంభం అయినా, ఇప్పటికీ ధాన్యం కొనుగోళ్లు పూర్తికాకపోవంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు ధాన్యం తడిసి అరిగోసపడుతున్నారు. వెంటనే తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాని రైతులు కోరుతున్నారు.
Read Also: రాత్రి వేళ రోడ్డుపై మెరిసే ఈ లైట్లు కరెంటు లేకుండా ఎలా పనిచేస్తాయో తెలుసా?
ఖరీఫ్ సీజన్ సాగు షురూ
ఖరీఫ్ సీజన్ అనేది మన దేశంలో వర్షాకాలంలో అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పండించే పంటల సాగు కాలం. ఈ సీజన్‌లో నైరుతి రుతుపవనాలపై ఆధారపడి వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, కందులు, పెసర, శనగలు, వేరుశనగ, సోయాబీన్, సన్ ఫ్లవర్, పత్తి, చెరకు వంటి పంటలు సాగు చేస్తారు. ఈ పంటలు సాధారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కోతకు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఈ ధరలు ఈ పంటలకు వర్తించనున్నాయి.
Read Also: ఇండియన్స్ కు ఫిలిప్పిన్స్ బంపర్ ఆఫర్.. వీసా అక్కర్లేదు, అదొక్కటీ చాలు!