Philippines Visa Free Travel: ఇండియన్ టూరిస్టులకు ఫిలిప్పీన్స్ అదిరిపోయే న్యూస్ చెప్పింది. భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు 14 రోజుల వరకు వీసా లేకుండా తమ దేశంలో పర్యటించే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాదు, ఎంపిక చేసిన దేశాలలో చెల్లుబాటు అయ్యే వీసాలు, నివాసాలు కలిగి ఉన్నవారికి అదనంగా 30 రోజుల యాక్సెస్ ఉంటుందని ప్రకటించింది.
మే నుంచే కొత్త విధానం అమలు
భారత్- ఫిలిప్పీన్స్ దేశాల మధ్య పర్యాటక, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో.. ఫిలిప్పీన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. రెండు కొత్త కేటగిరీల కింద కింద భారతీయ పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని ప్రవేశపెట్టింది. ఈ నెల ఫస్ట్(మే 2025) నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది. టూరిస్టులకు మరింత ప్రయాణ సౌలభ్యాన్ని కలిగిస్తుంది. ఈ విధానంతో మరింత మంది భారతీయ పర్యాటకులు తమ దేశానికి వస్తారని ఫిలిప్పీన్స్ భావిస్తోంది.
వీసా రహిత ప్రయాణానికి గైడ్ లైన్స్
ఫిలిప్పీన్స్ తాజా నిబంధనల ప్రకారం.. భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్లు 14 రోజుల వరకు వీసా లేకుండా ఫిలిప్పీన్స్ లోకి వెళ్లొచ్చు. ఒకవేళ ఆ సమయం పూర్తి అయితే, టూరిస్టులు కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యే పాస్ పోర్ట్, వసతికి సంబంధించిన వివరాలు, ధృవీకరించబడిన రిటర్న్ టికెట్, పర్యటన వ్యవధికి తగినంత బ్యాంక్ బ్యాలెన్స్ ను అక్కడి అధికారులకు సూచించాల్సి ఉంటుంది. వీసా లేకుండా కేవలం 14 రోజుల వరకే దేశంలో ఉండేందుకు అనుమతి ఉంటుంది.
వీసా నిబంధనలు మరింత సులభతరం
భారతీయ పర్యాటకుల కోసం ఫిలిప్పీన్స్ వీసా నిబంధనలను సైతం మరింత సులభతరం చేసింది. ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, కెనడా, స్కెంజెన్ దేశాలు, సింగపూర్, యునైటెడ్ కింగ్ డమ్ దేశాలకు చెందిన చెల్లుబాటు అయ్యే వీసాలు లేదంటే శాశ్వత నివాసం కలిగి ఉన్న భారతీయ పౌరులు 30 రోజుల వీసా రహిత పర్యాటనకు అర్హులుగా ప్రకటించింది. భారతీయ పౌరుల కోసం ప్రస్తుత ఇ-వీసా వ్యవస్థ అమలులో ఉంటుందని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ప్రకటించింది. వీసా రహిత ప్రవేశానికి అర్హత లేని ప్రయాణీకులు ఈ వీసాను పొందే అవకాశం ఉందని తెలిపింది.
Read Also: ఐఆర్సీటీసీ ఇ-వాలెట్.. స్వరైల్ యాప్ లో పనిచేస్తుందా? ఎలా వాడాలి?
పర్యాటక రంగానికి మేలు కలిగే అవకాశం
తాజాగా తీసుకొచ్చిన సులభతరమైన వీసా నిబంధనలతో ఫిలిప్పీన్స్ భారతీయ పర్యాటకుల రాకపోకలను గణనీయంగా పెరుగుతాయని భావిస్తోంది. పర్యాటక రంగానికి ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని ఆశిస్తోంది. సహజ సౌందర్యం, వారసత్వ ప్రదేశాలు, విభిన్న అనుభవాలకు ప్రసిద్ధి చెందిన ఫిలిప్పీన్స్, సందర్శకుల బాగా ఆకట్టుకుంటుంది. అలాగే భారతీయ పర్యాటకుల సంఖ్య పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానంతో ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెరుగుతాయని ఫిలిప్పీన్స్ ఆశిస్తోంది.
Read Also: రాత్రి వేళ రోడ్డుపై మెరిసే ఈ లైట్లు కరెంటు లేకుండా ఎలా పనిచేస్తాయో తెలుసా?