Nagpur Violence Chhaava | నాగపూర్‌లో సోమవారం రాత్రి హింసాత్మక ఘటనలు జరిగాయి. రెండు వర్గాలకు చెందిన అల్లరిమూకలు వాహనాలు, ఇళ్లు, షాపులు ధ్వంసం చేశారు. అయితే ఈ ఉద్రిక్తతలకు ‘ఛావా’ సినిమా ఒక కారణమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్‌తో మొదలైన ఆందోళన కొంత హింసాత్మకంగా మారింది. ఆ తర్వాత కర్ఫ్యూ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులపై ఆయన ఇవాళ అసెంబ్లీలో కీలక విషయాలు వివరించారు.
ఇక్కడ నేను కేవలం ఒక సినిమాను మాత్రమే దోషారోపణ చేయాలనుకోవడం లేదు. కానీ, ఇలా మాట్లాడక తప్పదు. శంభాజీ మహారాజ్ చరిత్రను ‘ఛావా’ చిత్రం ప్రజల ముందు ఉంచింది. అదే సమయంలో పలువురి మనోభావాలు రగిలిపోయాయి. అందుకే ఔరంగజేబు మీద వ్యతిరేకత ఒక్కసారిగా తెర మీదకు వచ్చింది.
అయితే.. ఇదంతా పక్కా ప్రణాళిక బద్ధంగా జరిగిన కుట్ర అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్‌తో సోమవారం సాయంత్రం వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ ధర్నా చేపట్టాయి. కర్రలతో ఔరంగజేబు నకిలీ సమాధిని ఏర్పాటు చేసి దాన్ని తగలబెట్టారు. కాసేపటికే మతపరమైన గ్రంథాలను తగలబెట్టారని ప్రచారం రేగింది. ఇది కొంత తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కాబట్టి ఇందులో కుట్ర కోణం కూడా దాగి ఉండొచ్చు అని ఆయన అన్నారు.
అయితే చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా సహించేది లేదని.. కులం, మతం ఏదైనా సరే ప్రజలు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవాలని సూచించారు. అదే సమయంలో ఉద్రిక్తతలకు కారణమయ్యేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలంతా సమన్వయంతో పాటుతూ శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని అసెంబ్లీ వేదికగా విజ్ఞప్తి చేశారు.
Also Read: హోలీ సంబరాల్లో ఘర్షణ.. దుకాణాలు, వాహనాలు దగ్ధం.. పోలీస్ అధికారి హత్య
ఇదిలా ఉంటే.. గత రాత్రి నాగ్‌పూర్‌లో భారీ ఎత్తున విధ్వంస కాండ జరిగింది. రాళ్లు రువ్వుకుంటూ.. పలు వాహనాలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు.. పోలీసుపైకి రాళ్లు రువ్వారు. ఈ దాడుల్లో.. కేవలం పోలీసులకే 33 మందికి గాయాలయ్యాయని సమాచారం. అయితే సాధారణ పౌరులు ఎంత మంది గాయపడ్డారనేదిపై అక్కడి మీడియా ఛానెల్స్ తలా ఓ ఫిగర్ చెబుతుండడం గమనార్హం.
దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన చిత్రంలో లీడ్ రోల్ శంభాజీగా విక్కీ కౌశల్, శంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక, జౌరంగజేబుగా అక్షయ్ ఖన్నా తమ నటనతో ఆకట్టుకున్నారు. అయితే సినిమా రిలీజ్ సమయంలో సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రశంసించారు. మరాఠా యోధుడు శంభాజీ పోరాటాన్ని, త్యాగాన్ని ఇప్పటి తరానికి తెలియజేసిన ఈ చిత్రం నిజంగా అద్భుతమైనదని కొనియాడారు.
ప్రధాని మోదీ గత జన్మలో ఛత్రపతి శివాజీ.. బీజేపీ ఎంపీ
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అంశంపై వివాదాలు సాగుతున్న సమయంలో.. బీజేపీ ఎంపీ ప్రదీప్ పురోహిత్ వ్యాఖ్యలు అగ్నిలో ఆజ్యం పోశాయి. లోక్ సభలో ఎంపీ ప్రదీప్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోదీ గత జన్మలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ఒక సాధువు తనకు చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్, ప్రతిపక్ష నేతల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి.
కాంగ్రెస్ ఎంపీ వర్ష గైక్వాడ్, ఈ వ్యాఖ్యలను విమర్శిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. శివాజీ మహారాజ్‌ను అవమానించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా.. స్పీకర్ దిలీప్ సైకియా ప్రదీప్ పురోహిత్ ప్రకటనపై విచారణ చేయాలని సభా కార్యకలాపాల నుండి బహిష్కరించే ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు.