Chhava Movie PM Modi Screening| బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఛావా’ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా పార్లమెంట్‌లో చూసే అవకాశం ఉంది. ఆయనతో పాటు ఇతర మంత్రులు, ఎంపీలు కూడా ఈ చిత్రాన్ని వీక్షించబోతున్నారు. మార్చి 27న, పార్లమెంట్‌లోని బాలయోగి ఆడిటోరియంలో ఈ సినిమా ప్రదర్శించనున్నారు. ఈ స్క్రీనింగ్‌లో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ ఎంపీలు, ఇతర ముఖ్యనాయకులు హాజరుకాబోతున్నట్లు సమాచారం. చిత్ర దర్శకుడు, తారాగణం కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావచ్చని జాతీయ మీడియా తెలిపింది.
‘ఛావా’ సినిమాలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందింది. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా, దినేష్ విజన్ నిర్మించారు. రష్మిక మందన్నా, అక్షయ్ ఖన్నా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. ముఖ్యంగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో కృూరత్వం ప్రదర్శించడంలో అక్షయ్ ఖన్నా అద్బుతంగా నటించి సిని విమర్శకుల నుంచి ప్రశంసలందుకున్నారు.
ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 14న విడుదలై హిట్ టాక్ తో బాక్సాఫీసు వద్ద ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తోంది. హిందీ బాషలోనే ఈ చిత్రం రూ. 750 కోట్ల పైగా వసూలు చేసింది. ఇటీవల తెలుగు లో కూడా ఈ సినిమా విడుదలై భారీ వసూళ్లను సాధించింది.
Also Read: నోటిసులిచ్చిన వెంటనే ఇళ్లు కూల్చేస్తారా?.. యోగి ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం
‘ఛావా’ సినిమాను ప్రశంసించిన ప్రధాని మోదీ
ఛావా చిత్రం గురించి ప్రధాని మోదీ ఇంతకుముందు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనానికి హాజరైన ఆయన, దేశంలో ప్రస్తుతం ‘ఛావా’ సినిమా ప్రభావం కొనసాగుతున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో.. ఛావా చిత్రానికి ప్రేరణ ఇచ్చిన నవల రచయిత శివాజీ సావంత్‌ను ఆయన అభినందించారు.
ఛావా చిత్రంలో మరాఠాలు, మొఘల్ పరిపాలకుల మధ్య యుద్ధాలను, ఘర్షణలను చూపించారు. ముఖ్యంగా, ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్‌ను చక్రవర్తి ఔరంగజేబు హింసించే సన్నివేశాల్లో రక్తపాతం మరీ ఎక్కువగా చూపించారు. దీంతో ఈ సన్నివేశాలు వివాదాస్పదమయ్యాయి. సినిమా విడుదలైన తర్వాత మహారాష్ట్రలోని హిందువులు భావోద్వేగాలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో.. మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధిని తొలగించాలంటూ నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ దృష్ట్యా, ముస్లిం మత గురువు మౌలానా షాబుద్దీన్ రజ్వీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ సినిమా మతపరమైన అల్లర్లు సృష్టించేలా ఉందని, అందువల్ల ఈ సినిమాను బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రజ్వీ తన లేఖలో.. ‘‘ఛావా చిత్రంలో ఔరంగజేబు పాత్ర హిందూ యువతను రెచ్చగొట్టే విధంగా చూపబడింది. ఈ కారణంగానే నాగ్‌పూర్‌లో మత హింస చెలరేగింది. సినిమా విడుదలైనప్పటి నుంచి దేశంలో మతసామరస్య వాతావరణం క్షీణించింది. ఔరంగజేబును హిందూ వ్యతిరేకిగా చూపించడం ద్వారా హిందూ యువతను రెచ్చగొట్టారు. ఈ కారణంగా, హిందూ సంస్థలు వివిధ ప్రదేశాల్లో ఔరంగజేబు గురించి విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నాయి. ఈ ఘటనలకు కారణమైన రచయితలు, దర్శకులు, నిర్మాతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.