Bihar Assembly CM Nitish Kumar Tejashwi Yadav | బీహార్ రాష్ట్రంలో తిరుగులేని నేతగా వెలుగొందుతున్న జనతాదళ్ (యునైటెడ్) నేత మరియు ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ లో రాజ్యమేలితే.. ఇప్పుడు నితీష్ కుమార్ దే పై చేయి. అటు ఇండియా కూటమిలో ఉండాలన్నా, అంతే త్వరగా దానికి ఎండ్ కార్డ్ వేసి ఎన్డీఏ కూటమిలో చేరాలన్నా.. ఆయనకే చెల్లింది. ఆయన ఏ కూటమితో జట్టు కట్టినా, తన ముఖ్యమంత్రి పదవికి ఢోకా లేకుండా చూసుకుంటూ రాజకీయాలు చేస్తూ ఉంటారు.
అయితే, ఈ అంశాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ అసెంబ్లీ వేదికగా లేవనెత్తారు. బీహార్ లో నితీష్ కుమార్ పాలన ‘పొలిటికల్ షిప్ట్స్’ మాదిరిగా ఉందని విమర్శించారు. బీహార్ అసెంబ్లీలో మంగళవారం బడ్జెట్ సమర్పణ సమయంలో రాష్ట్ర అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడే సమయంలో తేజస్వీ యాదవ్ అడ్డుకున్నారు. ఎన్డీఏ నేతృత్వంలోని ప్రభుత్వం బీహార్‌ను అభివృద్ధి మార్గంలో తీసుకెళుతోందని నితీష్ వ్యాఖ్యానించగా.. దానికి తేజస్వీ యాదవ్ అడ్డుతగిలారు.
“అసలు బీహార్‌కు ఏం చేశారో చెప్పండి” అంటూ తేజస్వీ నిలదీశారు. దీనికి తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్, “అంతకు ముందు బీహార్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది” అనే రీతిలో సమాధానం ఇచ్చారు. “నేను ఏం చేశానో మీ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను అడగండి. మీ తండ్రి రాజకీయంగా ఎదగడానికి నేనే కారణం. మీ నాన్న రాజకీయాల్లో ఎదిగారంటే.. అందులో నాది ప్రధాన పాత్ర. మీ నాన్నకు సపోర్ట్ చేయడాన్ని మీ కులంలోని వాళ్లే వ్యతిరేకించేవారు. ఎందుకు అలా చేస్తున్నావ్ అంటూ నన్ను అడిగేవారు. కానీ మీ నాన్నను తయారు చేసింది నేనే. మీ నాన్నకు ఎప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉంటాను” అని రిప్లై ఇచ్చారు నితీష్.
Also Read: ఎడారిగా మారుతున్న కేరళ – అత్యధిక వర్షపాత రాష్టంలోనే ఎందుకిలా.?
దీనికి తేజస్వీ యాదవ్ అసెంబ్లీలోనే స్పందిస్తూ.. “బీహార్ ప్రస్తుత పరిస్థితి గురించి అడిగితే, 2005కు ముందు బీహార్ చరిత్ర గురించి ముఖ్యమంత్రి చెబుతున్నారు.” అంటూ ఎద్దేవా చేశారు. నితీష్ చెప్పేదానిని బట్టి, 2005కు ముందు బీహార్ ఉనికే లేదంటారా?” అంటూ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ప్రస్తుతం కన్‌ఫ్యూజన్‌లో ఉందని, రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి గత హామీలనే మళ్లీ రిపీట్ చేస్తున్నారని తేజస్వీ విమర్శించారు.
లాలు .. బీహార్ రాష్ట్రాన్నే దోచుకున్నారు: ఉపముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరీ
ముఖ్యమంత్రి నితీస్ కుమార్ తరువాత ఉపముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరీని కూడా తేజస్వీ యాదవ్ చురకలు అంటించారు. “ఉపముఖ్యమంత్రి నాన్నగారు.. గతంలో ఎన్నికల సమయంలో బిజేపీ ర్యాలీల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి గురించి అసభ్యంగా మాట్లాడారు. నేను ఉపముఖ్యమంత్రి తండ్రిగారి పేరు ప్రస్తావించను. కానీ ఆయన ముఖ్యమంత్రిని పదే పదే పరుష పదజాలంతో తిట్టిన విషయం వాస్తవం కాదా? లేచి నిలబడి సమాధానం చెప్పండి.. కాదని చెప్పే ధైర్యం ఉందా?” అని తేజస్వీ డిప్యూటీ సిఎంని టార్గెట్ చేశారు.
తేజస్వీ వ్యాఖ్యలతో బిజేపీ ఎమ్మెల్యేలందరూ సభలో కాసేపు గందరగోళం చేశారు. ఆ తరువాత డిప్యూటీ సిఎం సమ్రాట్ చౌదరీ నిలబడి.. “మా నాన్న గురించి ఎందుకు? మీ తండ్రి ఏం చేశారో చెప్పు?.. ఆయన పేద ప్రజలను దోచుకున్నారు. బిహార్ రాష్ట్రం మొత్తాన్ని దోచుకున్నారు. నన్ను జైల్లో పెట్టించారు. నితీష్ కుమార్ గారి వల్లే నేను బయటికి రాగలిగాను.” అని ఆగ్రహంగా అన్నారు.