Chennai: తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. బుధవారం తమిళనాడులోని కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. మద్దతు కాకుండా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడంపై నేతలు చర్చించనున్నారు. దీనిపై విజయ్ పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.
విజయ్‌కు బిగ్ రిలీఫ్.. మద్దతుకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్ ముందుకు వచ్చిన తరుణంలో ఎన్నికల తర్వాత అక్కడి పరిస్థితిని సమీక్షించింది కాంగ్రెస్ హైకమాండ్. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ అగ్ర నాయకత్వం అధినేత మల్లికార్జున్ ఖర్గే నివాసంలో సమావేశమైంది. ఈ భేటీకి రాహుల్ గాంధీ, సీనియర్ నాయకులు హాజరయ్యారు.
విజయ్ పార్టీకి మద్దతు విషయమై పలు విధాలుగా ఆలోచన చేశారు. మద్దతు కంటే.. ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితే బాగుంటుందని పలువురు నేతలు తమ అభిప్రాయాలను బయటపెట్టారు. దీనివల్ల రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయని, కేడర్ కూడా ఉత్సాహంగా కదులుతుందని అంచనా వేశారట.
ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని డిసైడ్, తమిళనాడు కాంగ్రెస్ నేతలు భేటీ
సమావేశం తర్వాత మీడియా ముందుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్, జైరాం రమేశ్. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోరుతూ విజయ్‌కి చెందిన తమిళగ వెట్రి కజగం పార్టీ.. కాంగ్రెస్ పార్టీని సంప్రదించినట్లు ధృవీకరించారు. ఢిల్లీ పొలిటికల్ వర్గాల సమాచారం మేరకు.. రెండు కేబినెట్ పదవులు తీసుకోవాలని భావిస్తోందట కాంగ్రెస్. టీవీకే ఒకటి ఇవ్వాలని వార్తలు వస్తున్నాయి.
టీవీకే అభ్యర్థనపై తుది నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ విభాగానికి అప్పగించింది పార్టీ హైకమాండ్. తమిళనాడులో ఏర్పడే ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ భాగం కావడాన్ని కాంగ్రెస్ కోరుకోవడం లేదన్నారు వేణుగోపాల్. తమిళనాడు ప్రజల తీర్పు లౌకిక పాలన వైపు సూచిస్తోందన్నారు.
ALSO READ: విమర్శలు, అవమానాలే మమ్మల్ని నడిపించాయి.. టీవీకే అధినేత విజయ్ భావోద్వేగ ట్వీట్!
మరోవైపు టీవీకేకు మద్దతు ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నారని తమిళనాడు ఏఐసీసీ ఇన్‌చార్జ్ గిరీష్ చోడంకర్ అన్నారు. కార్యకర్తల నుండి వచ్చిన అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానానికి తెలియజేశానని అన్నారు. అసెంబ్లీలో మెజారిటీ మార్కుకు చేరుకోని టీవీకే పార్టీకి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుపై హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు.
మద్దతు ఇవ్వాలని టీవీకే ఇంకా తనను సంప్రదించలేదన్నారు. ఈ విషయంలో వారు మరెవరినైనా సంప్రదించారో లేదో తనకు తెలీదన్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశం కానున్నారు. మద్దతుపై అందులో నిర్ణయం తీసుకున్నారు.