PVR-INOX Time Waste | మల్టీప్లెక్సులో సినిమా చూడడానికి వెళ్లిన ఒక ప్రేక్షకుడు థియేటర్ యజమాన్యం పై కోర్టులో కేసు పెట్టాడు. సినిమా లేటుగా స్క్రీనింగ్ చేశారని.. అందువల్ల తన విలువైన సమయం వృథా కావడంతో చాలా నష్టపోయానని కోర్టులో వాపోయాడు. కేసు విచారణ చేసిన కోర్టు.. థియేటర్ యజమాన్యానికి గట్టి షాకిచ్చింది. ప్రేక్షకుడికి నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. ఈ ఘటన బెంగుళూరు నగరంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బెంగుళూరు నగరానికి చెందిన అభిషేక్ అనే 30 ఏళ్ల యువకుడు 2023 సంవత్సరంలో ప్రముఖ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన సామ్ బహదూర్ చూడడానికి బుక్ మై షో లో ఆన్ లైన్ మోడ్ లో మూడు సినిమా టికెట్లు బుక్ చేసుకున్నాడు. పివిఆర్ సినిమాస్ ఐనాక్స్ లో సాయంత్రం 4.05 గంటలకు షో. దీంతో సినిమా నిడివిని బట్టి 6.30 గంటలకు ముగిసిపోతుంది. ఆ తరువాత తన ముఖ్య మైన పనులు చేసుకోవచ్చని అభిషేక్ భావించాడు. కానీ సినిమా చూడడానికి పివిఆర్ మల్లీప్లెక్స్ కు వెళ్లి.. అరగంట పాటు సినిమా ప్రారంభం కాలేదు. ఆ సమయమంతా మల్లీప్లెక్స్ వారు స్క్రీన్ పై యాడ్స్, ఇతర సినిమాల ట్రలర్లు ప్లే చేశారు. 4.30 గంటలకు సినిమా ప్రారంభమైంది. అంటే 25 నిమిషాలు ఆలస్యంగా సినిమా స్టార్ట్ అయింది. అయితే స్నేహితులతో సినిమా చూడడానికి వచ్చిన అభిషేక్ తనకు ఆలస్యమైపోతుందని ఆందోళన పడ్డాడు. అనుకున్నట్లు గానే సినిమా షో అరగంట లేటుగా ముగిసింది.
ఆ తరువాత అభిషేక్ తన ముఖ్యమైన అపాయింట్ మెంట్స్ ఉండడంతో వాటి కోసం వెళ్లగా.. అక్కడ అవి ఫలించలేదు. ఆలస్యం కారణంగా అభిషేక్ కు ఆ రోజు చాలా నష్టం జరిగింది. తనకు జరిగిన నష్టానికి పివిఆర్ మల్టీప్లెక్స్ వారే కారణమని భావించి అభిషేక్ కన్జూమర్ కోర్టులో దావా వేశాడు. తన విలువైన సమయాన్ని థియేటర్ యజమాన్యం వృధా చేసిందని.. అందుకోసం తనకు నష్ట పరిహారం చెల్లించాలని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను నష్టపోయిన రూ.50,000 థియేటర్ యజమాన్యం చెల్లించాలని కోర్టులో వాదించాడు.
Also Read: జీవితకాలం పానిపూరి ఫ్రీ.. భలే బిజినెస్ ఐడియా గురూ!
అభిషేక్ వాదనలు విన్న కన్జూమర్ కోర్టు.. ఈ కేసులో థియేటర్ యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రేక్షకుడి సమయం విలువను ప్రాధాన్యం ఉందని అభిప్రాయపడింది. అభిషేక్ టైమ్ వేస్ట్ చేసి అతని నష్టానికి గాను రూ.50,000, అతని మానసిక వేదనకుగాను పరిహారంగా మరో రూ.5,000. కేసు ఫైల్ చేయడానికి అభిషేక్ చెల్లించిన రూ.10,000 కలిపి మొత్తం రూ.65,000 చెల్లించాలని తీర్పు చెప్పింది. పైగా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకు మరో రూ.1 లక్ష కోర్టులో డిపాజిట్ చేయాలని జరిమానా కూడా విధించింది.
అయితే ఈ కేసులో అభిషేక్ బుక్ మై షో ప్లాట్ ఫామ్ ను కూడా పార్టీగా చేర్చాడు. కానీ బుక్ మై షో ఒక టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ మాత్రమేనని.. జరిగిన ఘటనలో బు కై షో పాత్ర ఏమీ లేదని కోర్టు అభిప్రాయపడింది. ఫిబ్రవరి 15న బెంగుళూరు కన్జూమర్ కోర్టు వెలువరించిన ఈ తీర్పు ప్రకారం.. ఇతరుల సమయం వృధా చేసి లాభం పొందే హక్కు మరొకరికి లేదు, ప్రేక్షకుడు సినిమా చూడడానికి వస్తే.. అతడికి ఇతర వీడియోలు బలవంతంగా చూపించడం కూడా నిబంధనల ఉల్లంఘనే.
మరోవైపు ఈ కేసులో పివిఆర్ తరుపున వాదించిన లాయర్ మాత్రం తాము ప్రజల అవగాహన కోసం సామాజిక స్పృహ వీడియోలు ప్లే చేశామని అందులో తప్పేముందని వాదించగా.. కోర్టు ఈ వాదనకు బదులిస్తూ.. అలాంటి వీడియోలు 10 నిమిషాల నిడివి కంటే తక్కువగానే ఉండాలని చెప్పింది. అవి కూడా సినిమా ప్రారంభం లేదా ఇంటర్వల్ సమయంలోనే సూచించింది. కోర్టు విధించిన జరిమానా మొత్తం చెల్లించేందుకు పివిఆర్ ఐనాక్స్ కు ఒక నెల రోజుల గడువు ఇచ్చింది.