Nasal Vaccine : కోవిడ్ నివారణకు భారత్ బయోటెక్ తయారు చేసిన నాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాక్సిన్ ను ‘ఇన్‌కొవాక్’ పేరుతో మార్కెట్ లోకి విడుదల చేశారు. కొవిడ్ నివారణకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్ ‘ఇన్‌కొవాక్’ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, కేంద్ర శాస్త్రసాంకేతికశాఖ మంత్రి జితేంద్ర సింగ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, సంస్థ జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్ల పాల్గొన్నారు.
ముక్కు ద్వారా వేసే ఈ వ్యాక్సిన్ వాషింగ్టన్ యూనివర్సిటీ- సెయింట్ లూయీస్ సహకారంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. ప్రపంచంలో కరోనా కోసం రూపొందించిన తొలి నాజల్ వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. 18 ఏళ్లు దాటిన వారికి రెండు ప్రాథమిక డోసులు ఇస్తారు. ఆ తర్వాత బూస్టర్ డోసుగానూ ఈ టీకాను వినియోగించవచ్చు.
ధర ఎంతంటే..?
‘ఇన్‌కొవాక్’ వ్యాక్సిన్ ఇప్పటికే కొవిన్ పోర్టల్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రైవేట్ గా కొనుగోలు చేయాలంటే ఒక డోసు ధర రూ.800గా నిర్ణయించారు. దీనికి జీఎస్‌టీ అదనం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.325కే సరఫరా చేస్తారు. దీని జీఎస్టీ అదనంగా ఉంటుంది. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ ఇటీవల ప్రకటించింది.
ఈ వారం నుంచే ఈ టీకా మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ తెలిపింది. ‘ఇన్‌కొవాక్ టీకాను రవాణా చేయడం, నిల్వ ఉంచడం ఎంతో సులువవుతుంది. ఈ టీకాను అధికంగా ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. దీంతో కరోనా మహమ్మారిపై పోరాటానికి మరొక పదునైన అస్త్రం లభించిదని డాక్టర్ కృష్ణ ఎల్ల ప్రకటించారు.