Jantar Mantar: స్వేచ్ఛ బ్యూరో: నిరసనలకు వేదికగా మారిన ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంతాన్ని పూర్తిగా మూసి వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించటం లేదని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. నగరం నడిబొడ్డున జరిగే ఆందోళనలతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించింది. మొత్తం నగరాన్ని బందీగా మార్చే పరిస్థితి ఉండకూడదని జస్టిస్ అమిత్ మహాజన్ వ్యాఖ్యానించారు.
నిరసనల కోసం కొనసాగించాలా.. వద్దా..?
జంతర్ మంతర్‌ను నిరసనల కోసం కొనసాగించాలా, వద్దా? అనేది ప్రభుత్వ నిర్ణయమే అయినప్పటికీ, తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ అమిత్ మహాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనకు అనుమతి కోరుతూ జులైలోనే దరఖాస్తు చేసుకున్నా ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు అనుమతి ఇవ్వడం కానీ, తిరస్కరించడం కానీ చేయలేదని కోర్టుకు పిటిషనర్ తరఫు న్యాయవాది సంజయ్ ఘోష్ తెలిపారు.
జంతర్ మంతర్‌ను ఎందుకు మూసేయకూడదు?
నిరసనకు గరిష్ఠంగా 75 మంది మాత్రమే హాజరవుతారని తెలిపామని, అయినా పోలీసులు దరఖాస్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పారు. ఈ సందర్భంగా జంతర్ మంతర్‌ను ఎందుకు మూసివేయకూడదని జస్టిస్ మహాజన్ ప్రశ్నించారు. నగరంలో ఇలాంటి నిరసనలు జరగకూడదనేది తన అభిప్రాయమన్నారు. జంతర్ మంతర్‌ను నిరసనల కోసం ప్రత్యేక ప్రదేశంగా కొనసాగించాలా, లేదా? అనే అంశాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే పరిశీలిస్తోందని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ కోర్టుకు తెలిపారు. దీనిపై జస్టిస్ మహాజన్ స్పందిస్తూ తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అక్కడ నిరసనలు జరగకూడదని మరోసారి స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా చెప్పాలి..
అయితే, ఢిల్లీలో శాంతియుత, ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలకు అవకాశం ఉండదా? అని సంజయ్ ఘోష్ ప్రశ్నించారు. అది పోలీసులు నిర్ణయించాల్సిన విషయమని, నగరంలో నిరసనలకు అవకాశం కల్పించడం సాధ్యం కాకపోతే వారు తగిన నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ మహాజన్ సమాధానమిచ్చారు. అయితే ఢిల్లీలో ప్రజాస్వామ్య నిరసనలకు అవకాశం లేదని ప్రభుత్వం బహిరంగంగా చెప్పాలని, తాము దానిని అంగీకరిస్తామని ఘోష్ అన్నారు.
నగరాన్ని బందీగా మార్చొద్దు..
తాను ప్రజాస్వామ్య నిరసనలకు వ్యతిరేకం కాదని, వాటి వల్ల సాధారణ ప్రజా జీవనం స్తంభించకూడదనే అంశాన్నే ప్రస్తావిస్తున్నానని జస్టిస్ మహాజన్ చెప్పారు. షాహీన్ బాగ్ కేసులో సుప్రీంకోర్టు శాంతియుత నిరసన హక్కును గుర్తించిందని సంజయ్ ఘోష్ గుర్తు చేశారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి నగరాన్ని బందీగా మార్చకూడదు కదా అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అనంతరం ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ దాఖలు చేసిన నిరసన అనుమతి దరఖాస్తుపై ఆగస్టు 8లోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
Also Read: తెలంగాణ బీజేపీలో మైండ్ గేమ్.. ఢిల్లీ భేటీ తర్వాత అసలు ప్లాన్ లీక్!