Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో: బీజేపీలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, చిన్నచిన్న భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి, అయితే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన శుక్రవారం కీలక సమావేశాన్ని నిర్వహించారు.
నితిన్ నబీన్‌ను సత్కరించిన రాంచందర్ రావు
ఈ సందర్భంగా రాంచందర్ రావు నితిన్ నబీన్ ను శాలువాతో సత్కరించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారి, రాష్ట్ర ఇన్ చార్జీ అభయ్ పాటిల్, ఎంపీలు లక్ష్మణ్, రఘుందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ధర్మపురి అర్వింద్ హాజరయ్యారు.
రాంచందర్ రావు మాట్లాడుతూ..
ఈ కీలక భేటీ అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తామని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని, పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిందని, తెలంగాణలో పార్టీ సంస్థాగతంగా మరింత బలంగా ఉందని పేర్కొన్నారు.
అధికారమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం..
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణ సిద్ధం చేస్తోందని రాంచందర్ రావు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. జనసేనతో సహా ఏ పార్టీతోనూ తెలంగాణలో పొత్తు ఉండదని రాంచందర్ రావు స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు ఏ ఎన్నికల్లో అయినా సరే బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. గతంలోనూ 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశామని, భవిష్యత్‌లోనూ అదే విధానాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఇతర పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని రాంచందర్ రావు తెలిపారు.
రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది.. రాంచందర్ రావు
అయితే ఎవరు ఎప్పుడు చేరతారనే వివరాలను ఇప్పుడే వెల్లడించలేమన్నారు. పార్టీలోకి వచ్చిన రోజు నుంచే కొత్త, పాత అనే తేడా లేకుండా అందరూ కలిసి పనిచేస్తారని చెప్పారు. రాష్ట్రంలోని 937 మండలాల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉందని, మెజారిటీ నియోజకవర్గాల్లో విజయం సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజా సమస్యల విషయంలో పోరాటాలు ఉధృతం చేస్తామని రాంచందర్ రావు అన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీల అమలులో విఫలమైందని విమర్శించారు. కేంద్ర పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోతోందని అన్నారు. రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై సమావేశంలో చర్చ జరిగిందని తెలిపారు. రెండు స్థానాల్లో విజయం సాధించేలా ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కేంద్ర నాయకత్వం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రతి మూడు నెలలకు ఒకసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు వస్తారని తెలిపారు. పార్టీ నేతలంతా కలిసి పనిచేసి రాష్ట్రంలో అధికారాన్ని సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సర్కార్ పై రాంచందర్ రావు ఫైర్..
ప్రస్తుతం ఈనెల 10వ తేదీ వరకు ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతున్నందున ఇతర కార్యక్రమాలను వేగవంతం చేయలేకపోయామని, అయినప్పటికీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్, స్టేట్ లెవల్ మీటింగ్స్ విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. వివిధ రంగాల్లో జరుగుతున్న అవినీతిని ఎండగట్టడమే బీజేపీ ముఖ్య ఎజెండా అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజా పోరాటాలు చేయడమే బీజేపీకి నిజమైన రోడ్ మ్యాప్ అని నితిన్ నబీన్ స్పష్టం చేశారని రాంచందర్ రావు తెలిపారు. రాబోయే రోజుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కోర్ కమిటీ సభ్యులతో చర్చించి పాదయాత్రలు, బస్సు యాత్రలు వంటి ప్రజా చైతన్య కార్యక్రమాలను రూపొందించి ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్తామని రాంచందర్ రావు వెల్లడించారు.
Also Read: ఏపీలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల భారీ బదిలీలు.. ఏ అధికారికి ఏ పోస్టింగ్?