AIR QUALITY : ఢిల్లీ కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతుంది. నగరంలోని గాలి తీవ్రత ప్రమాదస్ధాయికి చేరుకుంది. శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత(AIR QUALITY) తీవ్రస్థాయికి చేరుకుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాల ప్రకారం వాయు నాణ్యత సూచీ(AIR QUALITY INDEX) 346గా నమోదయ్యింది. లోధీ రోడ్, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్-3, ఆర్కే పురం, జహంగీర్‌పురి వద్ద పొగమంచు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో వరుసగా 438, 463, 486, 491గా నమోదయ్యింది.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని సెక్టార్ 1, సెక్టార్ 116, సెక్టార్ 62వద్ద గాలి నాణ్యత తీవ్రస్ధాయికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అనవసరమైన నిర్మాణ పనులు తక్షణమే నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేసారు.
ఈ మేరకు రాజధానిలో ఐదు రోజుల పాటు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టకూడదని ఢిల్లీ పర్యావరణ మంత్రి ఆదేశాలు జారీ చేసారు. తక్షణమే పనులు నిలిపివేయాలని ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల వలన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలు రెడ్ సిగ్నల్ పడగానే వాహన ఇంజిన్ ఆపేసే కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. దీని వలన కొంతమేరకు కాలుష్యాన్ని తగ్గించొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. నగరంలో వెయ్యి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ (CNG) బస్సులను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.