South Africa Sports Minister: పాకిస్తాన్ దేశం ఏ ముహూర్తాన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ హక్కులు దక్కించుకుందో కానీ.. ఈ ట్రోఫీని నిర్వహించేందుకు వివాదాలు మాత్రం వీడడం లేదు. మొదట హైబ్రిడ్ మోడల్ విధానంతో భారత్ – పాకిస్తాన్ మధ్య మొదలైన ఈ సమస్య.. అది సర్దుమనిగిందనుకునే లోపే మరో సమస్య తెరపైకి వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆఫ్గనిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ ని ఇంగ్లాండ్ జట్టు బహిష్కరించనుందని సమాచారం.
Also Read: Yuzvendra Chahal: విడాకులపై చాహల్ మరో సంచలన పోస్ట్ !
అయితే ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్ ని ఎందుకు బహిష్కరిస్తుంది..? ఈ ఇరు జట్ల మధ్య వివాదం ఏంటి..? అనే వివరాల్లోకి వెళితే.. ఆఫ్ఘనిస్తాన్ లో 2021లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటినుండి ఆడవారిపై కఠినమైన ఆంక్షలు అమలు చేయడం, వారికి క్రీడల్లో పాల్గొనే హక్కు లేకుండా చేయడం విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. అమెరికా సంకీర్ణ సేనల నిష్క్రమణతో అధికారం చేపట్టిన తాలిబాన్లు.. ఆ దేశంలో స్త్రీ హక్కులని పూర్తిగా కాలరాశారు.
అక్కడి స్కూల్లలో చదివే విద్యార్థులు ఆరవ గ్రేడ్ మించి చదవకూడదు, ఉద్యోగాలు చేయకుండా ఆంక్షలు, మగవారి తోడు లేకుండా ప్రయాణం చేసే వారికి కొరడా దెబ్బలు వంటి క్రూరమైన నిర్ణయాలతో తాళిబాన్లు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఆఫ్గనిస్తాన్ కి చెందిన మహిళ జట్లను ఏ క్రీడలలో పాల్గొననివ్వడం లేదు. మహిళల నోట క్రికెట్ అనే మాట వినపడకుండా చేసేశారు. వారి మాట కాదని మైదానంలో కనిపిస్తే ఇంటి పెద్దలను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
దీంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తాలిబాన్ల పాలనను, ఆ దేశంలో వారు విధించిన కఠినమైన ఆంక్షలను యూకే రాజకీయ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. స్త్రీలకు విలువ లేని తాలిబాన్ దేశానికి చెందిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తమ జట్టు క్రికెట్ ఆడకూడదని గలమెత్తారు. ఏకంగా 160 మంది యూకే రాజకీయ నాయకులు సంతకం చేసిన లేఖను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి అందజేశారు. రిఫార్మ్ యూకె నాయకుడు నిగెల్ ఫరేజ్, లేబర్ పార్టీ మాజీ నేత జెరెమీ కార్బిన్, తదితరులు ఈ విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజాగా ఈ జాబితాలోకి సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు కూడా చేరింది. ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మ్యాచ్ ని రద్దు చేసుకోవాలని సౌత్ ఆఫ్రికా ను ఆ దేశ ప్రజలు కూడా కోరుతున్నారు. దీంతో దక్షిణాఫ్రికా ప్రజల డిమాండ్ కి ఆ దేశ క్రీడల మంత్రి గేటన్ మెకేంజీ సంఘీభావం తెలిపారు. ప్రజల నిరసనకు తన మద్దతు తెలుపుతున్నానని.. ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ ని బాయ్ కాట్ చేయాలని అన్నారు. అయితే ఇందులో తన అధికారం పరిమితమైంది మాత్రమేనని.. ఇందులో తాను నిర్ణయం తీసుకోలేనని తెలిపారు.
Also Read: Shikhar Dhawan: మళ్లీ పెళ్లి చేసుకోవాలనుంది.. శిఖర్ ధావన్ వీడియో పోస్ట్ వైరల్!
దక్షిణాఫ్రికా ప్రభుత్వం, క్రికెట్ బోర్డు ఆలోచన చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే ఈ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుపై వేటు వేయాలని.. క్రీడల వ్యవహారాలలో రాజకీయ జోక్యాన్ని ఏమాత్రం సహించకూడదని ఆయన డిమాండ్ చేశారు. ఇక చాంపియన్స్ ట్రోఫీ 2025 మరో నలభై రోజులలో.. అనగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్ లోని కరాచీ వేదికగా ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, ఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.