Ranya Rao Gold Smuggling| దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు (Kannada Actress Ranya Rao) .. ఇప్పుడు అనూహ్యంగా వాంగ్మూలం మార్చేంది. డీఆర్‌ఐ అధికారులపై పలు సంచలన ఆరోపణలు చేసింది. తనను పలుమార్లు డిఆర్ఐ అధికారులు కొట్టారని, తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకున్నారని ఆరోపించింది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అడిషనల్ డైరెక్టర్ జనరల్‌కు లేఖ కూడా రాసింది. (gold smuggling case).
‘‘నన్ను అరెస్టు చేసిన దగ్గరి నుంచి ఓ పది, పదిహేను సార్లు చెంపదెబ్బకొట్టారు. పదేపదే దాడి చేసినా వారు సిద్ధం చేసిన కాగితాలపై సంతకాలు చేయడానికి నిరాకరించాను. కానీ వారు పెట్టిన చిత్రహింసలు, ఒత్తిడి తట్టుకోలేకపోయాను. టైప్ చేసిన ఓ 50- 60 కాగితాలు, 40 తెల్ల కాగితాలపై నా చేత బలవంతంగా సంతకాలు చేయించారు. వారు చెప్పిన దానికి అంగీకరించకపోతే.. నా తండ్రిని ఈ కేసులో ఇరికిస్తామని బెదిరించారు. ఈ వ్యవహారంతో అసలు ఆయనకు ఏం సంబంధం లేదు. నన్ను నిర్బంధించిన తర్వాత 24 గంటల పాటు ఉద్దేశపూర్వకంగా నిద్ర, ఆహారం అందకుండా చేశారు. నాపై తప్పుడు కేసు పెట్టారు. నా దగ్గరి నుంచి ఎలాంటి బంగారం స్వాధీనం చేసుకోలేదు. వేరే వ్యక్తులను రక్షించడం కోసం ఢిల్లీ నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు అధికారులుగా నటించి.. నన్ను ఇరికించారు’’ అని పేర్కొన్నారు.
Also Read: హోలీ సంబరాల్లో ఘర్షణ.. దుకాణాలు, వాహనాలు దగ్ధం.. పోలీస్ అధికారి హత్య
స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన దగ్గరినుంచి రన్య రావు వ్యాఖ్యలు మారుతూ వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని, దుబాయ్‌లో వారు చెప్పిన చోటకు వెళ్లి బంగారం తీసుకొని డెలివరీ చేయాలని చెప్పారని గతంలో వాంగ్మూలం ఇచ్చింది. ఇటీవల కోర్టు ముందు హాజరుపర్చినప్పుడు.. కస్టడీలో అధికారులు తనను కొట్టలేదు కానీ బెదిరించారని చెప్పింది. అయితే తాను మానసికంగా ఎంతో వేదనకు గురయ్యానని చెప్పడం గమనార్హం. బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం ఆమె బెయిల్‌ను తిరస్కరించిన నేపథ్యంలో అమె డిఆర్ఐ ఉన్నతాధికారులకు ఈ లేఖ రాశారు.
అయితే ఈ కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల పేర్లు రాసేందుకు కేటాయించిన కాలమ్‌ను విచారణ చేసే అధికారులు ఖాళీగా ఉంచారని జాతీయ మీడియా కథనాల ద్వారా వెల్లడైంది. బంగారం అక్రమ రవాణా కేసులో రాజకీయ నేతలు, అధికారుల పాత్ర ఉండొచ్చని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ కాలమ్‌ను సీబీఐ ఖాళీగా ఉంచిందని సమాచారం. దాంతో అనుమానితులుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, చట్టసభ ప్రతినిధుల గుండెల్లో గుబులు మొదలైంది. కొందరు వ్యక్తులు సిండికేట్‌లా ఏర్పడి ఈ దందాను నడిపిస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులు ఇప్పటికే గుర్తించి.. సీబీఐకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
రన్యా రావు సవతి తండ్రిని సెలవుపై పంపిన ప్రభుత్వం
కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) అక్రమ బంగారం రవాణా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె సవతి తండ్రి, డీజీపీ ర్యాంకు అధికారి కె.రామచంద్రరావును సెలవుపై వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనికి ఎటువంటి కారణాలు పేర్కొనలేదు. ప్రస్తుతం ఆయన ‘కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ ఛైర్మన్, ఎండీగా ఉన్నారు. ఆయన స్థానంలో ఏడీజీపీ (రిక్రూట్‌మెంట్) కేవీ శరత్ చంద్రకు బాధ్యతలు అప్పగించింది.
బంగారాన్ని అక్రమంగా తరలించే సమయంలో భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకు సవతి తండ్రి పేరును రన్యా రావు ఉపయోగించుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రామచంద్రరావు పాత్ర ఏమైనా ఉందా అనే దానిపైనా దృష్టిసారించాలని సూచించింది. ఈ కేసు విచారణ అధికారిగా అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ తాజా పరిణామాల దృష్ట్యా రామచంద్రరావును ప్రభుత్వం కంపల్సరీ లీవ్‌పై పంపింది.