Haryana BJP Chief Gang Rape Case| హర్యాణా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌లాల్ బడోలీ, సింగర్ రాకీ మిట్టల్ అలియాస్ జై భగవాన్‌పై సామూహిక అత్యాచారం (గ్యాంగ్ రేప్ Gang Rape) కేసు నమోదైంది. ఢిల్లీకి చెందిన ఓ యువతి తనపై వీరిద్దరూ అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
ఘటన వివరాలు
ఫిర్యాదు చేసిన యువతి తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన 2023 జులై 3న చోటుచేసుకుంది. “నేను, నా స్నేహితురాలు, మా కంపెనీ యజమానితో కలిసి హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలీ అనే పర్యాటక ప్రాంతానికి వెళ్లాము. అక్కడ ఒక హోటల్‌లో బస చేసిన సమయంలో మోహన్‌లాల్ బడోలీ, రాకీ మిట్టల్‌ను కలిశాం. అప్పుడు సింగర్ రాకీ మిట్టల్ నాకు సినిమాల్లో, మ్యూజిక్ వీడియోల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పారు. తాను తీసే ఆల్బమ్‌లో నన్ను నటించేందుకు అవకాశం ఇస్తానని భరోసా ఇచ్చారు. అలాగే మోహన్‌లాల్ బడోలీ తనను ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా పరిచయం చేసుకుని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నన్ను ప్రలోభపెట్టారు” అని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది.
Also Read: టిండర్ యాప్‌లో స్వలింగ సంపర్కుల డేటింగ్.. కిడ్నాప్ చేసి దోపిడి
బలవంతంగా మద్యం తాగించి, అత్యాచారం
ఆమె చెప్పిన వివరాల ప్రకారం, నిందితులు బలవంతంగా తనకు మద్యం తాగించి, తన స్నేహితురాలిని బెదిరించి పక్కకు తీసుకెళ్లారు. అనంతరం బడోలీ, మిట్టల్ కలిసి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె వివరించింది. “హోటల్ వారు బస చేసిన గదికి నన్ను పిలిచి కూర్చోపెట్టారు. కాసేపు తరువాత మద్యం తాగమని చెప్పారు. కానీ నేను అందుకు నిరాకరించాను. అయినా వారు బలవంతం చేసి తాగించారు. ఆ తరువాత నన్ను కొట్టి నాపై ఇద్దరూ అత్యాచారం చేశారు. ఈ ఘటనను వారిద్దరూ వీడియో రికార్డ్ చేశారు. ఈ విషయం బయటకు చెబితే నన్ను చంపేస్తారని బెదిరించారు. ఆ సమయంలో వివస్త్రంగా ఉన్న నన్ను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశారు.” అని వివరాలు వెల్లడించింది.
బాధితురాలు ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న హిమాచల్ ప్రదేశ్ పోలీసులు తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులపై IPC సెక్షన్లు 376డి (గ్యాంగ్ రేప్), 506 (బెదిరింపులు) కింద కేసు నమోదు చేసినట్లు సోలన్ జిల్లా ఎస్పీ గౌరవ్ సింగ్ ప్రకటించారు.
ఇది ఒక సున్నితమైన కేసు కావడంతో, పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఘటన స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్, హోటల్ రికార్డులు, నిందితుల కాల్ డేటా తదితర ఆధారాలను సేకరించేందుకు పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అత్యాచారం కేసులో ఒక రాష్ట్ర బిజేపీ పార్టీ అధ్యక్షుడే ప్రధాన నిందితుడు కావడంతో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు సామాజిక సంఘాలు మరియు మహిళా హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.