Kejriwal Yamuna Court Notice| ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హరియాణా కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 17న కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఢిల్లీలో ప్రవహించే యమునా నదిలో హరియాణా ప్రభుత్వం విషం కలుపుతోందని.. కావాలనే ఫ్యాక్టరీ వ్యర్థాలు నదిలో విసర్జితం చేస్తోందిన కేజ్రీవాల్ ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మొదలైంది. కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు ఢిల్లీ ఎన్నికల సమయంలో చేయడంతో.. రాజకీయ దుమారం రేగింది. ఈ ఆరోపణలపై హరియాణా ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఫిర్యాదులో, కేజ్రీవాల్ యమునా నది నీటిని విషపూరితం చేసినట్లు చేసిన అసత్య వ్యాఖ్యల వల్ల ప్రజలలో భయాందోళనల పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో, హరియాణా కోర్టు కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. సోనిపట్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు (సీజేఎం) ఫిబ్రవరి 17న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. కేజ్రీవాల్ తన ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను సమర్పించాలని, యమునా నది నీటిని హరియాణా ప్రభుత్వం విషపూరితం చేస్తుందన్న వాదనను ధృవీకరించే నివేదికను సమర్పించాలని కోర్టు కోరింది. ఇప్పటికే ఈ అంశంపై ఎన్నికల కమిషన్ కేజ్రీవాల్ కు లేఖ రాయగా.. ఇప్పుడు హరియాణా హై కోర్టు నోటీసులు పంపింది.
ఈ సమస్యపై హరియాణా మంత్రి విపుల్ గోయల్ కూడా తీవ్రంగా స్పందించారు. కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, హరియాణా, ఢిల్లీ ప్రజలలో ఆయన వ్యాఖ్యలు భయాన్ని సృష్టిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ అంశంపై తగిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు. ఈ వ్యవహారంలో హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ కూడా జోక్యం చేసుకున్నారు.
Also Read: కుంభమేళా తొక్కిసలాట.. కారణాలు ఇవే..
ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ యమునా నది నీటిని తాగినట్లు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చర్య ద్వారా, యమునా నది నీరు విషపూరితం కాదని సందేశాన్ని అందించాలని ఆయన ఉద్దేశించారు. అయితే కేజ్రీవాల్ ఈ వీడియోపై ప్రతిస్పందిస్తూ, నయాబ్ సింగ్ నీటిని తాగినట్లు చూపించి నటించారని.. ఆ తర్వాత నదిలోనే ఉమ్మివేసినట్లు ఆరోపించారు. యమునా నదిలో అమ్మోనియా కాలుష్యం ఉన్నందున, ఈ నీరు ఢిల్లీ ప్రజలకు ప్రమాదకరమని కేజ్రీవాల్ మరోసారి పేర్కొన్నారు. తాము తాగలేని నీటిని ఢిల్లీ ప్రజలకు ఇవ్వాలని హరియాణా ప్రభుత్వం కోరుకుంటోందని ఆయన విమర్శించారు.
ఈ వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు. ఢిల్లీ ఎన్నికల సమయంలో నిర్వహించిన ర్యాలీలో, కేజ్రీవాల్ ఆరోపణలను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. “హరియాణా ప్రభుత్వం ప్రధాని తాగే నీటిలో కూడా విషం కలుపుతుందా?” అని ప్రశ్నించారు. “హరియాణా ప్రజల బంధువులు దేశ రాజధానిలో నివసిస్తున్నారు. మరి అలాంటప్పుడు హరియాణా ప్రజలు తాగు నీరు అందించే నదిని కలుషితం చేస్తారా?” అని అడిగారు. ఎన్నికల్లో భయంతోనే హరియాణా ప్రజలపై ‘ఆప్ దా’ నేతలు అసహ్యకరమైన ఆరోపణలు చేస్తున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
హరియాణా, ఢిల్లీ ప్రజలు ఒక్కరే కాబట్టి, హరియాణా ప్రభుత్వం ఎప్పుడూ అలాంటి పని చేయదని మోదీ స్పష్టం చేశారు. అలాగే, ఢిల్లీలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పాలనను విమర్శిస్తూ, ఈ రెండు పార్టీలు 25 సంవత్సరాలు పాలించినప్పటికీ, ఢిల్లీ ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ జామ్‌లు, నీటి సమస్యలు, కాలుష్యం వంటి సమస్యలు గత రెండు దశాబ్దాలుగా ఉన్నాయని ఆయన అన్నారు.