Mahakumbhmela Stampede Reasons | పవిత్ర మహా కుంభమేళాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా బుధవారం వేకువజామున అమృత స్నానం కోసం లక్షలాది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకున్నారు. భారీ రద్దీ కారణంగా తొక్కిసలాట చోటుచేసుకోగా, ఈ ఘటనలో పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇప్పటివరకు 20 మందికిపైగా మృతి చెందినట్టు తెలుస్తోంది. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
భయానక ఘటన ఎలా జరిగిందో చెప్పిన ప్రత్యక్ష సాక్షులు
ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు మీడియాతో మాట్లాడారు. విపరీతమైన రద్దీ వల్ల ఎటువెళ్లాలో తెలియక భక్తులు గందరగోళానికి గురైనట్లు తెలిపారు. చీకట్లో కనబడని ఇనుప చెత్త బుట్టలు కాళ్లకు తగలడంతో చాలామంది కిందపడిపోయారని, ఆ క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుందన్నారు.
“రాత్రి 2.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం చేసేందుకు భారీగా తరలివచ్చారు. అయితే, ఎటువెళ్లాలి? ఎక్కడ స్నానం చేయాలి? అనే విషయంపై స్పష్టత లేకపోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. భక్తులు తలపై భారీ లగేజీలతో వచ్చారు. పుణ్యస్నాన మార్గంలో పెద్ద సంఖ్యలో ఇనుప చెత్త బుట్టలు ఉండటంతో చిమ్మచీకట్లో అవి కనిపించలేదు. అందువల్ల చాలామంది కిందపడిపోయారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది,” అని ప్రత్యక్ష సాక్షి, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ వివేక్ మిశ్రా వెల్లడించారు.
Also Read: మహాకుంభమేళా వెళ్లిన బస్సులో అగ్నిప్రమాదం.. తెలంగాణ వాసి మృతి
తాను కూడా చెత్త డబ్బా తగిలి పడిపోయానని, కుటుంబ సభ్యులతో బతికి బయటపడ్డానని తెలిపారు. వేరే భక్తులను కాపాడే ప్రయత్నంలో స్వల్పంగా గాయపడినట్లు వివరించారు.
మరో ప్రత్యక్ష సాక్షి రామ్‌సింగ్ మాట్లాడుతూ, “బయటకు వెళ్లే మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయి. దాంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. మా కళ్ల ముందే అనేక మంది కిందపడి గాయపడ్డారు,” అని తెలిపారు.
అధికారుల ప్రకటన – మృతులపై స్పష్టత లేని యూపీ సర్కారు
ఈ ఘటన త్రివేణి సంగమానికి కిలోమీటరు దూరంలో జరిగింది. భక్తులందరూ సంగమం ప్రధాన ఘాట్ వద్దే పుణ్యస్నానం చేయాలనే ఉత్సాహంతో ముందుకు తరలడంతో, బారీకేడ్లు విరిగి తొక్కిసలాట చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. గాయపడిన భక్తులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించామని, అయితే మృతుల సంఖ్యపై యూపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
పునరుద్ధరించిన పుణ్యస్నానాలు
తొక్కిసలాట కారణంగా త్రివేణి సంగమంలో కొంత సమయం పుణ్యస్నానాలను నిలిపివేశారు. పరిస్థితి అదుపులోకి రాగానే తిరిగి పునరుద్ధరించారు. మౌని అమావాస్యను పురస్కరించుకొని బుధవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు దాదాపు 3 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు.
144 ఏళ్లకోసారి వచ్చే మహా కుంభమేళా
మహా కుంభమేళా 144 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. ఈ విశేష మహోత్సవం 12 పూర్ణ కుంభమేళాలతో సమానం. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు కొనసాగనుంది. ఇప్పటివరకు 20 కోట్ల మందికిపైగా భక్తులు మహా కుంభమేళాకు హాజరై పుణ్యస్నానాలు ఆచరించారు.