Haryana Elections: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. అక్టోబర్ 5న జరిగే పోలింగ్‌లో మొత్తం 90 స్థానాలలో ఓటర్లు తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈసారి 90 సీట్లకు గానూ మొత్తం 1028 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అక్టోబరు 8వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ ఎన్నికలలో బిజెపి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, జెజెపి, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, బిఎస్‌పి కూటమి పోటీలో ఉండగా, ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీజేపీల మధ్యే సాగనుంది. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో నువ్వానేనా అన్నట్లుగా నిలిచిన ఎన్డీయే, ఇండియా కూటముల తరపున బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సరిగ్గా నాలుగున్నర నెలల తర్వాత మరోసారి నేరుగా హర్యానాలో తలపడనున్నాయి. హర్యానాతో బాటే జమ్మూ-కశ్మీర్ ఎన్నికలుండటం, ఈ ఫలితాల తర్వాత వెంటనే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలుండటంతో హర్యానా ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈసారి ఇక్కడ పోటీ చేస్తున్న మొత్తం 1028 మందిలో 538 మంది (52%) కోటీశ్వరులేనని ఏడీఆర్ ప్రకటించింది. నార్నౌండ్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి కెప్టెన్ అభిమన్యు రూ.491 కోట్లతో అత్యంత సంపన్న అభ్యర్థిగా ఉండగా, రెండు, మూడు స్థానాల్లో సోహ్నా కాంగ్రెస్ అభ్యర్థి రోహ్తస్ సింగ్ (రూ.484 కోట్లు), హిసార్ నుంచి బరిలో నిలిచిన సావిత్రి జిందాల్(రూ.270 కోట్లు) నిలిచారు. ఈసారి బరిలో నిలిచిన వారిలో 133 మంది మీద క్రిమినల్ కేసులున్నాయి. మొత్తం అభ్యర్థుల్లో 100 మందే మహిళలున్నారు. రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ‘ఆగకుండా.. పురోగమిస్తున్న హర్యానా’ (నాన్‌స్టాప్ హర్యానా) నినాదంతో ముందుకుపోతుండగా, బీజేపీ పాలనలో అవినీతి బాగా పెరిగిందని విమర్శిస్తున్న కాంగ్రెస్ ‘హర్యానా… లెక్కలు అడుగుతోంది’ (హర్యానా మాంగే ఇసాబ్) అనే నినాదంతో దూసుకుపోతోంది.
Also Read: భార్య నిర్ణయం.. ఆశ్చర్యపోయిన సీఎం సిద్ధరామయ్య
2014లో హర్యానాలోని పదికి పది లోక్‌సభ సీట్లు గెలుచిన బీజేపీ, తర్వాతి అసెంబ్లీ ఎన్నికలలో 47 స్థానాలు గెలిచి, స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 10 సీట్లు సాధించినా, అసెంబ్లీలో 40 సీట్లే గెలిచింది. దీంతో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్డీ) నుంచి విడిపోయి, ఏడాదిలోనే ఎన్నికలు ఎదుర్కొని 10 అసెంబ్లీ స్థానాలు గెలిచిన దేవీలాల్ మనవడు దుష్యంత్ చౌతాలా పార్టీ ‘జననాయక్ జనతా పార్టీ’ (జేజేపీ)తో పొత్తు పెట్టుకొని అక్కడ సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసింది. కాగా, గత మార్చిలో జేజేపీ నేత ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోగా, స్వతంత్రుల మద్దతుతో బీజేపీ సర్కారును నిలబెట్టుకుంది. ఆ వెంటనే నాటకీయ పరిణామాల మధ్య రెండు సార్లు సీఎంగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ చేత రాజీనామా చేయించి, ఓబీసీ నేతగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాయబ్ సింగ్ సైనీని సీఎంను చేసి ఎన్నికలను ఎదుర్కొంటోంది. మరోవైపు, కాంగ్రెస్ గతంలో కంటే కాంగ్రెస్ ఇక్కడ బాగా పుంజుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికలలో 10 సీట్లలో ఒక సీటు మిత్రపక్షమైన ఆప్‌కు కేటాయించి, 9 సీట్లలో బరిలో దిగిన కాంగ్రెస్ 5 సీట్లు గెలిచింది. కానీ, మాజీ సీఎం, ఇక్కడి కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా ఉన్న భూపిందర్ సింగ్ హుడా వర్గం, దళిత నేత కుమారి షెల్జా వర్గం, రాజ్యసభ ఎంపీ రణ్‌దీప్ సుర్జేవాలా వర్గాలు ఎవరికివారుగా ఉండటం కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది.
గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టుకట్టిన ఆప్, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీచేస్తోంది. 40 సీట్లలో తన అభ్యర్థులను దించింది. ముఖ్యంగా హర్యానా- ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల మీద ఆప్ ఫోకస్ పెట్టింది. ఇక.. హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ, చంద్రశేఖర్ ఆజాద్‌నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీతో పొత్తుపెట్టుకుంది. మొత్తం 90 సీట్లలో జేజేపీ 70 చోట్ల, ఆజాద్ సమాజ్ పార్టీ 20 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఓంప్రకాష్ చౌతాలాకు చెందిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. హర్యానాలో జాట్‌ల తర్వాత దళితులదే అత్యధిక ఓటు బ్యాంకు. మొత్తం 90 సీట్లలో 17 సీట్లు ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు కాగా, 35 సీట్లలో దళిత ఓటుబ్యాంకు నిర్ణయాత్మక శక్తిగా ఉంది. జాట్, దళిత ఓటు బ్యాంకును ఏ పార్టీ పొందగలిగితే వారిదే గెలుపు అన్నట్లుగా పరిస్థితి ఉంది.
Also Read: వామ్మో.. ఈ ఖడ్గమృగాన్ని చూడండి.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని సడెన్‌గా…
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలు మొత్తం పీకేజే (పెహల్వాన్, కిసాన్, జవాన్) కేంద్రంగా నడుస్తున్నాయి. ఈ మూడు వర్గాలు ఈసారి బీజేపీ కొంప ముంచటం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యయసాయ చట్టాలకు వ్యతిరేకంగా హరియాణా రైతులు భారీ స్థాయిలో ఆందోళన చేపట్టగా, నాడు వారిని ఢిల్లీలో అడుగుపెట్టకుండా కేంద్రం కట్టడి చేసింది. అలాగే, సాయుధ బలగాల్లో చేరేందుకు ఎక్కువ మొగ్గు చూపే హరియాణా యువత కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అదే సమయంలో మల్లయోధుల గడ్డగా పేరొందిన హర్యానా ఎన్నికల్లో బీజేపీ నేత బ్రిజ్‌భూషణ్ సింగ్ మీద స్థానిక మహిళా రెజర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు బీజేపీకి గండంగా మారాయి. వీటితోపాటు నిరుద్యోగం, మహిళలపై దాడులు, ద్రవ్యోల్బణం, పదేళ్లుగా అధికారంలో ఉండటంతో సహజంగా ఏర్పడే ప్రజా వ్యతిరేకత వంటి అంశాలూ బీజేపీకి ప్రతికూలంగా మారాయి. ఇక, బీజేపీ నుంచి ఇద్దరు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించటంతో వారంతా రెబల్స్‌గా నిలవటంతో వారిపై వేటు వేయాల్సి వచ్చింది. అయినా, జాట్‌యేతర వర్గాల్లో పట్టు నిలుపుకోవటం, రాష్ట్రంలోని 35 శాతంగా ఉన్న ఓబీసీల మద్దతు పొందటం మీద బీజేపీ ఫోకస్ చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు పలు సంక్షేమ- అభివృద్ధి పథకాలను ప్రకటించింది. అభ్యర్థుల ఖరారు, ప్రచారం, నిర్వహణ ఇలా వివిధ ప్రక్రియల్లో మరింత క్రియాశీలక పాత్ర పెంచుకోవడానికి ఆర్ఎస్ఎస్కూడా ఇక్కడ క్రియాశీల పాత్ర పోషిస్తోంది.
అయితే, బీజేపీకి ప్రతికూలంగా ఉన్న అంశాలన్నింటినీ నిలదీస్తూ కాంగ్రెస్ ముందుకు సాగటం ఈసారి ఆ పార్టీకి కలిసొచ్చేలా ఉంది. రైతు ఉద్యమం వేళ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, కేంద్రంలో తమ ప్రభుత్వం రాగానే అగ్నిపథ్‌ను రద్దు చేస్తామని ప్రకటించటం, రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు టికెట్ ఇవ్వడం వంటి చర్యలతో కాంగ్రెస్ ముందుకెళ్లింది. మరోవైపు ప్రముఖ దళిత మహిళా నేత కుమారి షెల్జా వంటి నేతలు క్రియాశీలత, రాహుల్ పాపులారిటీ, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు బలమైన వ్యవస్థాగత నిర్మాణం ఆ పార్టీకి కలిసివచ్చేలా ఉంది. 90 అసెంబ్లీ సీట్లకుగాను 2,556 మంది ఆశావహులు ఈసారి కాంగ్రెస్ టిక్కెట్లు ఆశించటం కాంగ్రెస్ హవాకు ఒక బలమైన సంకేతం. అటు భూపేందర్‌సింగ్ హుడాకి రాష్ట్రంలో మంచి పేరుంది. మెజారిటీ సీట్లు ఆయన సూచించిన వారికే దక్కటమే గాక జాట్ వర్గ నేతగా, 35 సీట్లు వారికే ఆయన ఇప్పించుకోగలిగారు. కాంగ్రెస్ గెలిస్తే ఆయనే సీఎం అని మెజారిటీ ఓటర్లు భావిస్తున్నారు. నేటితో ఎన్నికల ప్రచారం కూడా ముగిసినందున, ఇక ఓటరు ఏ నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సిందే.