Heavy Rains: దేశ రాజధాని ఢిల్లీ మళ్లీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎన్సీఆర్ ప్రాంతాల్లో వర్షాలు మళ్లీ తీవ్రంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచే కుండపోత వర్షాలు కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. నోయిడా సహా అనేక ప్రాంతాల్లో జల్లులు పడుతుండగా, వాతావరణశాఖ రోజంతా మరిన్ని జోరైన వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావం కేవలం ఢిల్లీ వరకే పరిమితం కాలేదు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కూడా తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. కొండప్రాంతాల్లో మేఘవిస్ఫోటనాలు, కొండచరియలు తరచుగా సంభవిస్తూ భయాందోళనలు రేపుతున్నాయి.
వాతావరణశాఖ ప్రత్యేకంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్‌లకు వచ్చే రెండు రోజులకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. నదులు, వాగుల దగ్గరికి వెళ్లకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు విమానాశ్రయంలో కూడా వర్షం ప్రభావం చూపడంతో అనేక ఫ్లైట్లు ఆలస్యమయ్యాయి. వీకెండ్ నుంచే ప్రారంభమైన వాన సోమవారం కూడా ఆగకుండా కురవడంతో, ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ సహా ప్రధాన ఎయిర్‌లైన్స్ తమ ప్రయాణికులకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశాయి.
ముంబయిలో ఈ వారం పొడవునా వారాంతరంలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అంచనా. మంగళవారం, బుధవారం రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ‘యెల్లో అలర్ట్’ ప్రకటించారు. పగటి ఉష్ణోగ్రతలు 27 నుండి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండగా, దీని కారణంగా.. ప్రజలకు ఇబ్బందిగా మారనుంది. తీరప్రాంతాల్లో గాలి వేగం గంటకు 30 కి.మీ. వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
Also Read: Gold Rate Today: కాస్త ఊరటగా బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే
హిమాచల్ ప్రదేశ్‌లో గత 18 గంటలుగా కురుస్తున్న వర్షాలు ప్రజల్లో భయాన్ని పెంచుతున్నాయి. కులు, మండీ, హమీర్‌పూర్, బిలాస్పూర్ జిల్లాలు నిరంతర వర్షాలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. చంబా, కులు జిల్లాల్లో కొండచరియలు పడిపోవడంతో అనేక రహదారులు మూతపడ్డాయి. యూనా, చంబా, కాంగ్రా, కులు, హమీర్‌పూర్ జిల్లాల్లోని విద్యాసంస్థలు ఇవాళ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
మధ్యప్రదేశ్‌లో కూడా వాతావరణశాఖ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. మోరెనా, షాజాపూర్, నీమచ్, మాంసౌర్, రత్లాం, బాలాఘాట్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇతర ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు, ఉరుములు సంభవించే అవకాశముంది.
ఉత్తరాఖండ్‌లో వర్షాలు మరోసారి తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. బద్రీనాథ్ హైవే సహా గంగోత్రి, యమునోత్రి మార్గాలు కొండచరియల కారణంగా మూసివేయబడ్డాయి. వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ అనేక జిల్లాల్లో ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇక ఉత్తరప్రదేశ్‌లో తూర్పు, పశ్చిమ జిల్లాల్లో వర్షాలు మరింతగా కురిసే అవకాశముంది. గాలివానలు, ఉరుములు సంభవించే అవకాశం ఉండటంతో వాతావరణశాఖ ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది.
రాజస్థాన్‌లో వర్షాలు ప్రాణనష్టానికి దారితీశాయి. బుండి, సవాయి మాధోపూర్, కోటా జిల్లాల్లో వరదలా మారిన పరిస్థితుల్లో నలుగురు పిల్లలు, ఒక టీచర్ సహా ఆరుగురు మృతి చెందారు. జైపూర్, నాగౌర్, అజ్మీర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించడంతో పాఠశాలలకు రెండు రోజుల సెలవు ప్రకటించారు.
వర్షాల దాడితో ఒక వైపు వరద భయం, మరో వైపు ప్రాణనష్టం, ఆస్తినష్టం ఇలా పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని, సూచనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Travel Advisory
🚧⛈️Heads-up, #Delhi travellers!
Due to today’s downpour, several roads across Delhi are currently blocked or experiencing slow movement.
Please allow extra time, take an alternate route if possible, and check your flight status on our website or app before…
— IndiGo (@IndiGo6E) August 25, 2025