– ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కుట్రలు
– లేకుంటే.. వాళ్లకు 240 సీట్లే
– రిజర్వేషన్ల రద్దు అప్పుడే
– ఇండియా కూటమి విజయంతో మారిన లెక్కలు
– అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ
Narendra Modi: ప్రధాని మోదీ ఆలోచనలు, సిద్ధాంతాలతో తాను ఏకీభవించకపోయినా, ఏనాడూ ఆయనను ద్వేషించలేదని విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ నిన్న వాషింగ్టన్‌లోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ప్రధాని మోదీ, రిజర్వేషన్లు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వంటి పలు అంశాలపై తన ఆలోచనలను పంచుకున్నారు.
లోక్‌సభ ఎన్నికలపై..
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని తాను భావించటం లేదని, వాస్తవ పరిస్థితుల ప్రకారం బీజేపీకి 240 సీట్లు కూడా రావాల్సింది కాదని అభిప్రాయ పడ్డారు. ఎన్నికల సంఘం మద్దతు, దేశంలోని సంపన్న వర్తకుల తోడ్పాటు, కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఫ్రీజ్ చేయించి తమను దెబ్బ కొట్టటం వంటి పనులతోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసిన విషయాన్ని వివరిస్తూ.. ఎన్నికల ముందు తమ నేతలకు నిధులు ఇచ్చేందుకు మా వద్ద డబ్బు లేకుండా చేసి పార్టీని ఆత్మరక్షణలో పడేశారనీ, కానీ, ఏది జరిగితే అది జరుగుతుందని, ధైర్యంగా నిలబడదామని తాను పార్టీ నేతలకు చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. 2004 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు ఇదొక ఊహించని పరిణామమని చెప్పుకొచ్చారు.
రిజర్వేషన్ల రద్దుపై..
ప్రస్తుతం భారత్‌లో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. అభివృద్ధిలో, రాజకీయాల్లోనూ వారి భాగస్వామ్యం కూడా అంతంతమాత్రంగానే ఉందన్నారు. దేశంలో నేటికీ నిష్పక్షమైన పరిస్థితులు లేవనీ, అందరికీ సమాన అవకాశాలు అందిన రోజున రిజర్వేషన్ల రద్దు గురించి ఆలోచించాలన్నారు. ఉమ్మడి పౌర స్మృతి గురించి అడగ్గా.. దాని గురించి తాను ఇప్పుడే స్పందించలేనన్నారు.
Also Read: Chakali Ailamma: బ్రేకింగ్ న్యూస్.. కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు
అదంతా గత వైభవమే..
అంతకుముందు వర్జీనియాలో ప్రవాస భారతీయులతో రాహుల్ మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై మండిపడ్డారు. మీడియా, దర్యాప్తు ఏజెన్సీలతో ప్రజలను ప్రభావితం చేసి దేశంలో ఒక విపరీత స్థితిని మోదీ కల్పించారు. కానీ, ఎన్నికల్లో ఇండియా కూటమి పుంజుకోవటం, బీజేపీ లక్ష్యానికి దూరంగా ఆగిపోవటంతో వారికి తత్వం బోధపడింది. నేడు బీజేపీని చూసి ఎవరూ భయపడటం లేదని, తానిప్పుడు నేరుగా పార్లమెంట్‌లో కూర్చున్న ప్రధాని ముందుకెళ్లి.. ‘56 అంగుళాల ఛాతీ ఇక చరిత్రే’ అని చెప్పగలను’ అని ఎద్దేవా చేశారు. భారత్‌లో అన్ని రాష్ట్రాలు సమానమేనన్న ఆలోచనను ఆర్‌ఎస్‌ఎస్ అర్థం చేసుకోలేకపోతోందన్నారు.
మా దారులు వేరు..
‘చెబితే మీరు ఆశ్చర్యపోతారు. మోదీ అంటే నాకు ఎలాంటి ద్వేషం లేదు. చాలాసార్లు ఆయన చేసే పనులను, తీసుకునే నిర్ణయాలను నేను అర్థం చేసుకోగలను. అయితే, ఆయన అభిప్రాయాలు వేరు.. వాటితో నేను ఏకీభవించలేను. అంతేగానీ.. నేను ఆయనను ద్వేషించట్లేదు. శత్రువుగా చూడట్లేదు. ఆయన చేసే పనులను అర్థం చేసుకున్నప్పటికీ.. అవి మంచి ఫలితాలు ఇస్తాయని నేను అనుకోవట్లేదు. మా ఇద్దరివీ విభిన్న దృక్పథాలు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. కాగా.. అమెరికా నుంచి రాహుల్ చేస్తున్న విమర్శలపై భాజపా నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. విదేశీ గడ్డపై దేశం పరువు తీసేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.