IIT Baba Attacked On Camera | కుంభమేళాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయిన ఐఐటీ బాబా అభయ్ సింగ్ కు పెద్ద షాక్ తగిలింది. కొంతమంది సాధు వేషంలో వచ్చిన వ్యక్తులు కెమెరా ముందే ఆయనపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటన అభయ్ సింగ్ ఒక టీవీ ఛానల్ లో డిబేట్ లో పాల్గొన్న సమయంలో జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఐఐటీ బాబా అభయ్ సింగ్ ఇటీవల నోయిడాలో ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ లో డిబేట్ లో పాల్గొన్నారు. డిబేట్ కొనసాగుతున్న సమయంలో కాషాయ వస్త్రాలు ధరించిన కొంతమంది వ్యక్తులు అక్కడకు వచ్చారు. ఆ తర్వాత, అభయ్ సింగ్ తో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంలో కర్రలతో దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడి తర్వాత ఆయన డిబేట్ రూమ్ నుండి బయటకు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తనకు న్యాయం చేయాలని పోలీస్ అవుట్ పోస్ట్ ముందు కూర్చున్నారు. దీనితో, పోలీసులు ఆయనకు నచ్చజెప్పి అక్కడి నుండి పంపించారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ ఐఐటీ బాబా ఎవరు?
ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుకున్న అభయ్ సింగ్ ఇప్పుడు బాబాగా అవతరించారు. ఐఐటీ బాబాగా పిలుస్తున్నారు. అభయ్ సింగ్ హర్యానా రాష్ట్రానికి చెందినవారు. మహా కుంభమేళా సందర్భంగా ఐఐటీ బాబా పేరుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. క్యాంపస్ ప్లేస్మెంట్ లోనే ఉద్యోగం పొందిన ఆయన, కొంతకాలం కార్పొరేట్ లో పని చేసి, ఆ తర్వాత దాన్ని వదులుకున్నారు. ఫోటోగ్రఫీపై మక్కువతో ఆ దిశలో దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు. మహా కుంభమేళాకు వచ్చిన ఆయన, ఒక వార్తా ఛానల్ ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఐఐటీ బాబా, ఇంజినీర్ బాబాగా నెటిజన్లు ఆయన్ను పేర్కొంటున్నారు. సైన్స్ ద్వారా ఆధ్యాత్మికతను మరింత ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు.
Also Read: పెళ్లికూతురి ఫ్రెండ్ మెడలో దండ వేసిన వరుడు.. చెంపవాచేలా కొట్టిన వధువు
ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ పై క్షమాపణలు
ఇలా ఉండగా, చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై భారత్ గెలవదంటూ ఐఐటీ బాబా జోష్యం చెప్పిన విషయం తెలిసిందే. “ఈసారి భారత్ గెలవదు. విరాట్ కోహ్లీ సహా అందరికీ ఈ విషయం చెప్పండి. ఇండియా గెలవదని నేను చెబుతున్నానంటే ఇండియా గెలవదంతే” అంటూ ఐఐటీ బాబా జోష్యం చెప్పారు. అయితే, మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో ఈ ఐఐటీ బాబాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తాయి. ఐఐటీ బాబా ఇలా జోస్యం చెప్పడం మానేయాలంటూ క్రికెట్ అభిమానులు సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ పై ఐఐటీ బాబా తాజాగా స్పందించారు. ఈ మేరకు క్షమాపణలు చెబుతూ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. “నేను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఇది పార్టీ టైం. కాబట్టి ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకోవాలి. పాకిస్తాన్ తో మ్యాచ్ ఇండియా ఓడిపోతుందని చెప్పాను కానీ, గెలుస్తుందని నా మనసుకు తెలుసు” అంటూ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ కు విరాట్ కోహ్లీ, టీమ్ ఇండియా సంబరాలు చేసుకుంటున్న ఫోటోలను జోడించారు.