Ajit Pawar Income Tax| మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు 2021 బినామీ ఆస్తుల కేసులో ఆదాయ పన్నుశాఖ (ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్)కు చెందిన బినామీ ఆస్తుల లావాదేవీల నిరోధక అప్పీలెట్ ట్రిబునల్ క్లీన్ చిట్ ఇచ్చింది. అజిత్ పవార్, అతని కుటుంబ సభ్యులు బినామీ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలను కొట్టిపారేసింది. దీంతో ఆదాయ పన్ను శాఖ 2021లో సీజ్ చేసిన అజిత్ పవార్‌కు చెందిన రూ. వేయి కోట్ల విలువ గల ఆస్తులను విడుదల చేసింది.
మహారాష్ట్రలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో కలిసి అజిత్ పవార్ కూడా ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే అప్పేలెట్ ట్రిబునల్ తీర్పు రావడం గమనార్హం.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన అజిత్ పవార్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.1000 కోట్ల విలువ ఆస్తులను బినామీ ఆస్తులుగా గుర్తిస్తూ.. అక్టోబర్ 7, 2021న ఆదాయ పన్ను శాఖ సీజ్ చేసింది. సీజ్ చేసిన ఆస్తుల్లో మహారాష్ట్ర సతారా నగరంలోని షుగర్ ఫ్యాక్టరీ, రాజధాని ఢిల్లీలోని ఆయన ఫ్లాట్, గోవాలో ఒక రిసార్ట్ తో పాటు ఇంకా కొన్ని ఆస్తులున్నాయి.
Also Read: ఇండియాలో మోడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా కుట్ర.. బిజేపీ ఆరోపణలు
అయితే మూడేళ్లపాటు జరిగిన విచారణ తరువాత అజిత్ పవార్‌కు క్లీన్ చిట్ లబించింది. సీజ్ చేసిన ఆస్తులేవీ అజిత్ పవార్ పేరుపై లేకపోవడంతో ఈ కేసు కొట్టివేస్తున్నట్లు అప్పీలెట్ ట్రిబునల్ ప్రకటించింది.
“అదాయ పన్ను శాఖ విచారణ అధికారులు సరిపడ ఆధారాలు చూపలేదని.. ఆస్తులన్నీ సక్రమంగా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేశారని అప్పీలేట్ తీర్పు చెప్పింది. “అజిత్ పవార్ లేదా అతని కుటుంబ సభ్యులు ఆస్తులు అక్రమంగా కొనుగోలు చేశారనే ఆరోపణలు రుజువు చేయడానికి విచారణ అధికారులు ఎటువంటి ఆధారాలు చూపలేదు. అజిత్ పవార్, ఆయన భార్య సునేత్ర పవార్, కుమారుడు పార్థ్ పవార్.. వీరెవరూ ఆస్తులు కొనుగోలు చేయడానికి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయలేదు.” అని అప్పీలెట్ ట్రిబునల్ వ్యాఖ్యానించింది.
అజిత్ పవార్ తరపున వాదించిన లాయర్.. అడ్వకేట్ ప్రశాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ.. “అజిత్ పవార్ లేదా ఆయన కుటుంబ సభ్యులుపై బినామీ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలన్నీ ట్రిబునల్ కొట్టిపారేసింది. వారంతా చట్టానికి వ్యతిరేకంగా ఎటువంటి నేరానికి పాల్పడలేదు. ఆస్తులను కొనుగోలు చేయడానికి సక్రమ సంపాదన ఉపయోగించారు. ఆస్తుల కొనుగోలు లావాదేవీల ప్రక్రియ అంతా బ్యాంకుల ద్వారా చట్టపరమైన మార్గాల ద్వారానే జరిగింది. ఎటువంటి అవతవకలు జరగలేదు. ఇదే నిరూపితమైంది.” అని అన్నారు.
అజిత్ పవార్ 2019 నుంచి 2024 వరకు నాలుగు సార్లు ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. బిజేపీ కూటమి ప్రభుత్వంలో కానీ, కాంగ్రెస్ – శివసేన కూటమిలో గానీ ఆయన లేకుండా ప్రభుత్వ ఏర్పాటు జరగలేదు. తాజాగా ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఎన్సీపీ 41 సీట్లపై విజయం సాధించింది.