ఇప్పుడంటే మిసైళ్లు, డ్రోన్లతో యుద్ధాలు సాగుతున్నాయి కానీ.. అప్పట్లో యుద్ధ ట్యాంకర్లు వేసుకుని శత్రు శిబిరాలవైపు దూసుకుని వెళ్లేవారు సైనికులు. వాహనాల్లో సరిహద్దుల వెంబడి పహారా కాసేవారు. శత్రువుల్ని వెంటాడి మరీ మట్టుబెట్టేవారు. అలాంటి టైమ్ లో, కరెక్ట్ గా చెప్పాలంటే 1965 భారత్-పాక్ యుద్ధంలో మన సైనికుడు అబ్దుల్ హమీద్ చూపిన పోరాట స్ఫూర్తి అసామాన్యం. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఆనాటి మన సైనికుడు ధైర్య సాహసాలను మరోసారి గుర్తు చేసుకుందాం.
వద్దన్న భార్య..
ఇండియన్ ఆర్మీలో హవాల్దార్ గా పనిచేసేవాడు అబ్దుల్ హమీద్. అది 1965. బారత్-పాక్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఆరోజు ఆర్మీ క్వార్టర్స్ నుంచి అబ్దుల్ హమీద్ డ్యూటీకి బయలుదేరాడు. ఆయన భార్యకు ఏదో కీడు శంకించింది. ఆయన బయలుదేరే సమయంలో బ్యాగ్ కి ఉన్న తాడు తెగిపోయింది. దాన్ని అపశకునంగా భావించిన ఆమె.. మీరు ఈరోజు యుద్ధానికి వెళ్లొద్దు అని భర్తకి చెప్పింది. కానీ హమీద్ వెనకడుగు వేయలేదు. 1962 యుద్ధంలో కూడా తాను యుద్ధరంగంలోకి వెళ్లి సురక్షితంగా తిరిగొచ్చిన విషయాన్ని భార్యకు గుర్తు చేశాడు. ఇప్పుడు కూడా ఏమీ కాదని అనునయించాడు. కానీ ఆరోజు హమీద్ తిరిగి రాలేదు. యుద్ధభూమిలోనే వీరమరణం పొందాడు.
ఎవరి బలం ఎంత..?
హవాల్దార్ గా డ్యూటీలో ఉన్న అబ్దుల్ హమీద్.. జీపులో ఉండి సరిహద్దుల్లో ఉన్న చెరకు పొలాల దగ్గర పహారా కాస్తున్నాడు. ఆయన వద్ద రీకోయిల్ లెస్ తుపాకీ ఉంది. ఆర్ఆర్ లేదా ఆర్సీఎల్ అనే కోడ్ తో దాన్ని పిలుస్తారు. అయితే అప్పటికే చైనాతో యుద్ధం జరిగి మూడేళ్లు కావడంతో భారత్ ఆర్థికంగా కాస్త దెబ్బతిన్న పరిస్థితి. ఆయుధ సంపత్తిలో కూడా అంత పర్ఫెక్ట్ గా లేదనే చెప్పాలి. కానీ పాకిస్తాన్ యుద్ధానికి కవ్విస్తోంది. అప్పటి పాకిస్తాన్ మిత్రదేశమైన అమెరికా వారికి ఒకటిన్నర బిలియన్ డాలర్ల మేర సహాయాన్ని అందించింది. ఆమేరకు పాటన్ ట్యాంక్ లు, చాఫీ లైట్ ట్యాంక్ లు, M48 ట్యాంకుల, సాబర్ జెట్ లను సమకూర్చింది. వీటితో పాకిస్తాన్ సైన్యం రెచ్చిపోడానికి సిద్ధంగా ఉంది.
12 ట్యాంక్ లు ధ్వంసం..
సెప్టెంబర్ 8న, హమీద్ తో కలసి ఉన్న భారత సైన్యం.. పంజాబ్ సరిహద్దుల్లోని దట్టమైన చెరకు పొలాల మధ్య జీపులో వెళ్తోంది. అలా వెళ్తుంటగా వారికి శత్రు ట్యాంకుల గర్జన వినిపించింది. హమీద్ ప్యాసింజర్ సీటులో కూర్చున్నాడు. వారి జీపు చీమా గ్రామం ముందున్న ఇరుకైన బురద ట్రాక్‌పై దూసుకుపోతుంది. అప్పుడే వారికి పాకిస్తాన్ యుద్ధ ట్యాంక్ లు కనిపించాయి. వాటిని పాక్ కి అమెరికా అందించింది. అమెరికా జనరల్ జార్జ్ ఎస్.ప్యాటన్ పేరుమీదుగా ఆ యుద్ధ ట్యాంకులకు ప్యాటన్ ట్యాంక్ లు అనే పేరు పెట్టారు. అలాంటి ట్యాంక్ లు వరుసగా దూసుకొస్తున్నాయి. కానీ హమీద్ సహా ఇతర సైనికులు తెలివిగా వ్యవహరించారు. చెరకు తోటల మాటున కాపుకాశారు. ఒక్కో ట్యాంక్ ని పేల్చివేశారు. ఇందులో హమీద్ పాత్ర ముఖ్యమైనది. హమీద్ ప్యాసింజర్ సీట్ లో కూర్చుని తన రీకోయిల్ లెస్ తుపాకీతో ట్యాంకర్లను టార్గెట్ చేసేవాడు. తొలి ట్యాంకర్ ని టార్గెట్ చేసినప్పుడు, రిజల్ట్ ఎలా ఉందో చూడ్డానికి బైనాక్యులర్ ని వాడాడు హమీద్. బైనాక్యులర్ చేతిలోకి తీసుకునే లోపే అక్కడ ట్యాంకర్ బ్లాస్ట్ అయిన చప్పుడు వినిపించింది. ఇక ట్యాంకర్లను వరసబెట్టి టార్గెట్ చేశాడు హమీద్.
హమీద్ 7 నుంచి 8 ట్యాంక్ లు పేల్చివేశారంటూ రికార్డ్ లు ఉన్నా.. మరికొంతమంది సైనిక అధికారుల సమాచారం ప్రకారం ఆయన మొత్తం 12 ట్యాంకుల్ని పేల్చేశారని, అందులో 8 ట్యాంకుల్ని ఆయన ఒక్కడే పేల్చారని అంటారు. ప్రస్తుతం చైనా తయారీ మిసైల్స్ పాకిస్తాన్ ని ఎలా మోసం చేశాయో, అప్పటి యుద్ధంలో అమెరికా తయారీ ప్యాటన్ ట్యాంక్ లు కూడా పాకిస్తాన్ ని అలాగే మోసం చేశాయి. ఆ ప్యాటన్ ట్యాంక్ డిజైన్ లోపం వల్ల అవి బుల్లెట్ల తాకిడికి పేలిపోయేవి. అలా మొత్తం ఆ యుద్ధంలో 75 ప్యాటన్ ట్యాంకుల్ని భారత సైన్యం పేల్చేసింది. దాన్ని ప్యాటన్ శ్శశానంగా పిలిచేది.
చివరి ట్యాంక్ ని పేల్చిన హమీద్.. పాకిస్తాన్ సైనికుడికి ఎదురుపడాల్సిన సందర్భం వచ్చింది. ఆ సమయంలో ఇద్దరూ ఒకరికొకరు తుపాకీలు గురిపెట్టుకుని కాల్చారు. ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. హవాల్దార్ అబ్దుల్ హమీద్ 12 శత్రు ట్యాంకుల్ని తుత్తునియలు చేసి వీరమరణం పొందాడు. ఆయనకు భారత సైనిక అత్యున్నత పురస్కారం పరమవీర చక్రను ప్రభుత్వం ప్రకటించింది. 2015లో ఉత్తర ప్రదేశ్ లోని ఘాజీపూర్ లో హవాల్దార్ అబ్దుల్ హమీద్ స్మారకాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.