Indigo Passenger Dead Mid flight| ఒక ప్రయాణికురాలు అస్వస్థత కారణంగా విమానం అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆదివారం రాత్రి ముంబై నుంచి వారణాసికి వెళ్లేందుకు బయలుదేరిన ఇండిగో ఎయిర్‌లైన్స్ (Indigo Airlines) విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న 89 ఏళ్ల సుశీలా దేవి అనే వృద్ధురాలు ఆకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందినవారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో, విమాన సిబ్బంది తక్షణమే స్పందించి ఆమెకు సహాయం చేయాలని యత్నించారు.
ఆ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, సమీపంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని చత్రపతి సంభాజీనగర్‌లో ఉన్న చికల్థానా విమానాశ్రయంలో (ఔరంగాబాద్ విమానాశ్రయం) అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా విమానం ఆదివారం రాత్రి 10 గంటలకు భద్రంగా ల్యాండ్ అయింది.
Also Read: భర్తను చంపి డ్రమ్ములో పెట్టిన ఆమె.. జైల్లో గర్భవతి, తండ్రి ఎవరు?
విమానాశ్రయానికి వచ్చిన వైద్య బృందం సుశీలా దేవిని పరీక్షించింది. అయితే, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. విమానాశ్రయ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె విమాన ప్రయాణ సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది ఆమెకు ప్రాథమిక చికిత్స అందించేందుకు ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది.
అత్యవసర ల్యాండింగ్ అనంతరం, స్థానిక పోలీసు స్టేషన్ అధికారులు అవసరమైన చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేశారు. అనంతరం ఇండిగో విమానం మళ్లీ వారణాసి ప్రయాణాన్ని కొనసాగించింది.
సుశీలా దేవి మృతదేహాన్ని చత్రపతి సంభాజీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే సంబంధిత అధికారులు ఈ ఘటన వివరాలను మీడియాకు తెలియజేశారు.
ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. అయితే విమానం ల్యాండింగ్ జరగలేదు. తోటి ప్రయాణికురాలు మరణిస్తే.. ఆ మృతదేహాం పక్కనే మిగతా ప్రయాణికులు కూర్చొని ప్రయాణించాల్సి వచ్చింది. ఫిబ్రవరి 2025లో ఆస్ట్రేలియా నుంచి కతార్ బయలుదేరిన విమానంలో మిచేల్ రింగ్ అనే మహిళ ఒక్కసారిగా టాయిలెట్ వెళుతూ కుప్పకూలింది. ఆ తరువాత విమాన సిబ్బంది ఆమె చనిపోయనట్లు తెలుసుకొని మార్గంలోనే శవాన్ని పెట్టేశారు. బిజినెస్ క్లాస్ లోని శవం తీసుకు వెళ్లాలని ప్రయత్నించిన అది కుదరలేదు. దీంతో తోటి ప్రయాణికులు ఎయిర్ లైన్స్ పై ఫిర్యాదు చేశారు.