Indonesia army in parade : గణతంత్ర భారతావణి అనువణువు జాతీయ భావంతో పొంగిపోతుంది. దేశ రాజధాని నడిబొడ్డున సైనికుల కవాతు ఒళ్లు పులకరించేలా సాగిపోయింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్మ్ జాతీయ జెండాను ఎగురవేసి దేశ ప్రజలకు గణతంత్ర శుభాకాంక్షలు తెలిపిన వేశ.. వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంలో హాజరయ్యారు. హస్తినలో రెపరెపలాడుతూ ఎగురుతున్న మువ్వన్నెల జెండా ముందు మన త్రివిధ దళాలు నిర్వహించిన కవాతు చూపరులను కట్టిపడేస్తోంది. ఈ కవాతును ఇండోనేషియా నుంచి వచ్చిన సైనిక, బ్యాండ్ బృందాలు నాయకత్వం వహించడం విశేషం. కాగా.. ఆ దేశ బృందాలు విదేశీ గడ్డపై తొలిసారి కవాతులో పాల్గొనడం మరో విశేషంగా చెబుతున్నారు.
బలమైన వాణిజ్యం బంధాలతో పాటు సుదీర్ఘ వారసత్వ, సంస్కృతిక సంబంధాలున్న ఇండోనేషియా.. భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొని ఇరు దేశాల మధ్యనున్న బంధాన్ని మరింత ముందుకు, కొత్త తీరాలకు చేర్చింది. వేడుకల్లో పాల్గొనేందుకు ముందుగానే భారత్ వచ్చిన ఆ దేశ ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంలో ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రులతో సహా అనేక మంది ప్రముఖులతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య మరింత బలమైన సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రపతి ద్రౌపతి ముర్మ్ తో పాటు గా వేడుకలకు హజరైన ముఖ్య అతిథి సమక్షంలో కవాతు కన్నుల విందుగా సాగింది. మన దళాలు కవాతు చేసేందుకు ముందే ఇండోనేషియా నుంచి వచ్చిన 352 మంది సభ్యుల సైనిక, బ్యాండ్ బృందం కవాతు నిర్వహించింది. వెనుక భారత దళాలకు ముందు నిలిచి.. ప్రత్యేకంగా నిలిచింది. అయితే.. ఇందులో విశేషం ఏంటంటే.. ఇండోనేషియా బయట వేరే దేశాల్లో అధికారుక కవాతులో పాల్గొని, అక్కడ ప్రదర్శన ఇవ్వడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. గతంలో ఏ పొరుగు దేశాల్లో కానీ, వారి మిత్ర దేశాల్లో కానీ సైనిక కవాతు నిర్వహించలేదని వెల్లడించారు.
భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడమే కాకుండా వారి సైన్యానికి కవాతులో పాల్గొనేందుకు అనుమతివ్వడంతో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాం సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే.. ఆయన కూడా ఒకప్పుడు సైనికుడే. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటైన భారత్.. తన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అవకాశాన్ని కల్పించడాన్ని.. ఆ దేశ సైన్యానికి ఇచ్చిన గుర్తింపుగా భావించి ఆనందం వ్యక్తం చేశారు.
ఇండోనేషియన్ ఆర్మీ భారత సమగ్ర వ్యూహాత్మక భాగస్వామి, యాక్ట్ ఈస్ట్ పాలసీకి చాలా ముఖ్యమైన దేశమని భారత్ ప్రకటించింది. ఇండో-పసిఫిక్ సముద్ర జలాల్లో స్వేచ్ఛను, శాంతిని పరిరక్షించే విషయంలో ఇరు దేశాలు చేయాల్సింది చాలా ఉందని వ్యాఖ్యానించింది. ప్రస్తుత బంధం రాబోయే కొన్నేళ్లల్లో మరింత బలపడి.. ద్వైపాక్షిక సంబంధాలలో మరింత ముందుకు సాగుతుందని భారత విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.
Also Read :
ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత పర్యటనకు వచ్చారు. భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనగా.. ఆయన 2024 అక్టోబరులోనే అధికారం చేపట్టారు. ఆ తర్వాత చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే. ఇండోనేషియా అధ్యక్షుడు, ఆరుగురు క్యాబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులు, ఆ దేశ ఉన్నత శ్రేణి వ్యాపార బృందంతో కూడిన శక్తివంతమైన ప్రతినిధి బృందంతో కలిసి భారత్ పర్యటనకు వచ్చారు.