India Vs Pakistan : కనిపిస్తే కాల్చి పడేయండి. ఇండియాన్ ఆర్మీకి క్లియర్ కట్ ఆదేశాలు అందాయి. బోర్డర్‌లో ఏమాత్రం అనుమానం ఉన్నా.. షూట్ ఎట్ సైట్ ఆంటూ ఆర్డర్స్ వచ్చాయి. పాకిస్తాన్‌తో సరిహద్దు ఉన్న పంజాబ్, రాజస్తాన్‌లో హైఅలర్ట్ విధించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత కూడా పాకిస్తాన్ రెచ్చిపోతుండటం.. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడటాన్ని భారత్ సీరియస్‌గా తీసుకుంది. పాక్ కాల్పుల్లో ఒక జవాన్, 15 మంది పౌరులు చనిపోవడంతో మరింత అలర్ట్ అయింది. పాక్ దుశ్చర్యలతో సింధూర్ -2 కూడా ఉండే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి పాక్‌లోని 21 ఉగ్ర స్థావరాలను ఇండియన్ ఆర్మీ గుర్తించిందని.. అందులో 9 టెర్రర్ క్యాంపులపై మాత్రమే ఆపరేషన్ సిందూర్‌తో అటాక్ చేసిందని చెబుతున్నారు. పాక్‌కు ఒక ఛాన్స్ ఇచ్చి చూశారని అంటున్నారు. అయినా సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూ తోక జాడిస్తున్న దాయాది దేశానికి గట్టి బుద్ధి చెప్పేలా.. ఆ మిగతా 12 ఉగ్రవాద క్యాంపులపై కూడా దాడులు జరగొచ్చని తెలుస్తోంది.
మోదీతో దోవల్ భేటీ అందుకేనా..
ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోడీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. బోర్డర్‌లో పాక్ ఆర్మీ కాల్పులు, పౌరుల మరణం తర్వాత తీసుకోబోయే చర్యలపై మోడీతో దోవల్ చర్చించినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్‌లో మిగిలిని 12 ఉగ్రవాద స్థావరాలపై దాడికి భారత్ సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. యుద్ధం వస్తే త్రివిధ దళాల సన్నద్ధతపై ప్రధాని, అజిత్ దోవల్‌ను అడిగి తెలుసుకున్నారని సమాచారం. అటు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సైతం ప్రధాని మోడీను కలిశారు. LOC వెంబడి తీసుకోవాల్సిన చర్యలు.. భద్రతా బలగాల మోహరింపుపై చర్చించారు.
కేంద్రమంత్రి హింట్ ఇచ్చారా?
అటు, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదన్నారు. ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్‌కు సంబంధించి కొన్ని విషయాలు బయటకు చెప్పలేమన్నారు. సెకండ్ ఆపరేషన్ ఉందని ఇప్పటికే ప్రచారం జరుగుతుండగా.. కేంద్రమంత్రి కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. త్వరలోనే మళ్లీ పాక్‌పై దాడులు ఉంటాయా? PoJKనే ఇండియన్ ఆర్మీ ఈసారి స్వాధీనం చేసుకుంటుందా? దాడులు ఎక్కడుంటాయి? ఎప్పుడుంటాయి? ఎలా ఉంటాయి? ఇవే ప్రశ్నలు వినిస్తున్నాయి.
భారత్‌పై పాక్ మిస్సైల్ అటాక్
పంజాబ్‌లోని అమృత్‌సర్‌పై పాక్ మిస్సైల్ దాడికి ప్రయత్నించింది. పాక్ ప్రయోగించిన మిస్సైల్‌ను భారత్ గాల్లోనే ధ్వంసం చేసింది. యాంటీ మిస్సైల్ వ్యవస్థ ద్వారా భద్రతా బలగాలు అడ్డుకున్నట్లు తెలుస్తుంది. వెంటనే అమృత్‌సర్‌లో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అమృత్‌సర్-బాటాలా రోడ్డులోని ఓ పొలంలో క్షిపణి శిథిలాలు రైతులకు కనిపించినట్లు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పాక్ సరిహద్దుకు అమృత్‌సర్ 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.
బోర్డర్‌లో పాక్ బరితెగింపు..
సరిహద్దుల్లో పాక్ కర్కశత్వానికి నలుగురు చిన్నారులు సహా.. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. బుల్లెట్ గాయాలైన 57 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోల్జర్ దినేష్ కుమార్ మృతిచెందారు. చారిత్రక ప్రాధాన్యమున్న పూంచ్ కోట, ఆలయాలు, గురుద్వారాలపైనా పాక్ దాడి చేసింది. బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్‌లో ఐదుగురు మైనర్లు సహా 10 మంది గాయపడ్డారు. కుప్వారా జిల్లాలోని కర్నాహ్ సెక్టార్‌లో బాంబుల శకలాలు పడి మంటలు అంటుకుని పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. పాక్ చర్యలకు భారత సైన్యం ధీటుగా జవాబిస్తోంది. భారత్ ప్రతిదాడిలో పాక్ సైన్యంలో చాలామంది చనిపోయినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. దాయాది ఆర్మీ పోస్ట్‌లను ధ్వంసం చేసింది.
సరిహద్దుల్లో హైఅలర్ట్
పాక్ ఫైరింగ్‌తో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతాలైన పూంచ్, ఉరి, రజోరి సెక్టర్‌ల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తోంది. సరిహద్దు ప్రాంతాల ప్రజలను బంకర్‌లలో తలదాచుకోవాలని ఆదేశించింది. పోలీసులకు అధికారుల లీవులు రద్దు చేశారు. సరిహద్దులను పూర్తిగా మూసేస్తున్నట్టు ప్రకటించారు. ప్రజలెవ్వరూ బోర్డర్ దగ్గరకు వెళ్లొద్దని సూచించారు. పంజాబ్, రాజస్థాన్‌లలోని సరిహద్దు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అక్కడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.
ఫైటర్ జెట్స్ పెట్రోలింగ్
రాజస్తాన్‌లోని జోధ్‌పూర్, కిషన్‌ఘర్, బికనేర్ ఎయిర్‌పోర్ట్‌లను శుక్రవారం వరకు మూసివేశారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హైఅలర్ట్‌లో ఉంది. వెస్ట్రన్ సెక్టార్‌లో IAF పెట్రోలింగ్‌ను పెంచింది. సుఖోయ్-30 MKI ఫైటర్ జెట్స్ ఎయిర్ పెట్రోలింగ్ చేస్తున్నాయి. మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఇండియన్ ఆర్మీ యాక్టివేట్ చేసింది. యాంటీ డ్రోన్ సిస్టమ్‌లను మోహరించింది.
పాక్ హడల్
అటు, పాక్ కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత అలర్ట్ అయింది. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. మెడికల్ సిబ్బంది అత్యవసర విధుల్లో ఉండాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 48 గంటలపాటు గగనతలాన్ని మూసేసింది. ఇస్లామాబాద్, పంజాబ్‌లలో విద్యాసంస్థలు క్లోజ్ చేసింది. భద్రతా బలగాలను కూడా అలర్ట్ చేసింది.
లాహోర్ బ్లాస్టింగ్స్ ఎవరి పని?
మరోవైపు, పాకిస్తాన్‌లోని లాహోర్‌లో బాంబుల మోత మోగింది. వాల్టన్ విమానాశ్రయానికి సమీపంలోని గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాల్లో బాంబులు పేలాయి. డ్రోన్లతో దాడి జరగిందని భావిస్తున్నారు. ఇప్పటికే లాహోర్, ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్టులతో పాటు ఎయిర్‌స్పేస్‌ను కూడా మూసేసింది పాక్. కేవలం కరాచి ఎయిర్‌పోర్ట్‌ను మాత్రమే నడుపుతోంది.
పాక్ ఆర్మీపై BLA అటాక్స్
ఓ వైపు భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలోనే పాక్ ఆర్మీకి వరుస షాక్‌లు ఇస్తోంది బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ BLA. బోలన్‌లోని మచ్ కుంద్ ఏరియాలో పేలుళ్లు జరిపింది. సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న పాక్ ఆర్మీ సైనికుల ట్రక్‌ను IED బాంబుతో పేల్చేశారు.
Also Read : పాకిస్తాన్‌కు కేఏ పాల్.. మోదీతో బిగ్ టాస్క్!
పాక్‌పై అమెరికా సీరియస్
ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన పాకిస్థాన్‌పై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకునే హక్కు ఉందన్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను నియంతగా అభివర్ణించారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో పాక్‌కు నిజాయితీ లేదన్నారు.
భారత్‌కు బ్రిటన్ సపోర్ట్
ఆపరేషన్ సిందూర్‌పై ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కు మద్దతు పెరుగుతోంది. తాజాగా బ్రిటన్ కూడా భారత్‌కు మద్దతు తెలిపింది. పహల్గాం ఉగ్రదాడిలో అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాద సంస్థలపై దాడి చేసే హక్కు భారత్‌కు పూర్తిగా ఉందని బ్రిటన్ ఎంపీ ప్రీతి పటేల్ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై ఆమె బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో స్పందించారు. ఆత్మరక్షణ కోసం పోరాడే హక్కు భారత్‌కు ఉందన్నారు. అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలనే భారత్ లక్ష్యంగా చేసుకుందని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్‌కు బ్రిటన్ ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని పిలుపునిచ్చారు.