Jalgaon Train Accident Congress | దేశంలో గత కొంత కాలంగా జరుగుతున్న రైలు ప్రమాదాలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్.. బిజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. తాజాగా మహారాష్ట్రలో జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
బుధవారం జనవరి 22, 2024న మహారాష్ట్రలోని జల్గావ్ లో పుష్పక్ ఎక్స్ ప్రెస్ దుర్ఘటనలో దాదాపు 12 మందికి పైగా చనిపోయారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్ మీడియాతో మాట్లాడుతూ.. “కేంద్ర ప్రభుత్వం రైలు ప్రమాదాలను నివారించాలని తీసుకొచ్చిన కవచ్ టెక్నాలజీ విఫలమైంది. ఆ కొత్త సిగ్నల్ టెక్నాలజీ ఉన్నప్పటికీ ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. మా వద్ద ఉన్న డేటా ప్రకారం.. తాజా ప్రమాదంలో 24 నుంచి 25 మంది దాకా చనిపోయారు.
ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. దీంతో కవచ్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టం ఫెయిలైందని నిరూపితమైంది. దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలి. ఒకప్పుడు రైలు ప్రమాదాలు జరిగినప్పుడు రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. 1956లో శాస్త్రిగారు చేసిన రాజీనామాను ఆదర్శంగా తీసుకొని ప్రధాని మోదీ కూడా ఆయనను అనుసరించాలి” అని విమర్శిస్తూనే ప్రధాని రాజీనామా డిమాండ్ చేశారు.
Also Read: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసు.. ఘటన తరువాత 2 గంటలపాటు బిల్డింగ్‌లోనే దొంగ!
ఉత్తర మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలో బుధవారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్లో మంటలు చెలరేగాయన్న వదంతి 12 మంది మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయని అధికారిక సమాచారం. ముంబయి నుంచి 400 కిలోమీటర్ల దూరంలో మహేజి-పర్ధాడె స్టేషన్ల మధ్య బుధవారం సాయంత్రం 4:45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. లఖ్‌నవూ-ముంబయి పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు వచ్చాయని ఒక్కసారిగా పుకార్లు రాగా అందులో ప్రయాణించే ప్రయాణికులు భయపడి అలారం చెయిన్ లాగారు.
రైలు ఆగగానే హడావుడిగా కిందికి దూకిన ప్రయాణికులు పక్కనే ఉన్న మరో ట్రాకుపైకి చేరుకున్నారు. అదే సమయంలో గంటకు 130-140 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తున్న బెంగళూరు-న్యూదిల్లీ కర్ణాటక ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొంది. ఈ హఠాపరిణామంతో క్షణాల్లో 12 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ఆగుతుండగా ప్రయాణికులు ట్రాక్ మీదకు దిగినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. రైలు మలుపు ఉన్న ప్రదేశంలో కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌కు దృశ్యస్పష్టత సరిగా లేక, బ్రేకులు వేయడానికి సమయం చాలలేదని రైల్వే అధికారులు తెలిపారు.
వదంతుల వల్ల అలజడి
పుష్పక్ ఎక్స్‌ప్రెస్ సాధారణ తరగతి బోగీలో చక్రాలు పట్టేయడం లేదా హాట్ యాక్సిల్ కారణంగా నిప్పురవ్వలు, పొగలు రావడం వల్ల ప్రయాణికులు భయపడినట్లు రైల్వే అధికారులు చెప్పారు. ఈ వదంతుల వల్ల ప్రయాణికులు అప్రమత్తంగా అలారం చెయిన్ లాగారు.
ఈ దుర్ఘటన పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు.
విచారణ ప్రారంభం
ఈ ప్రమాదంపై రైల్వే భద్రత కమిషనర్ మనోజ్ అరోరా విచారణ చేపట్టామని ప్రకటించారు. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించి.. వదంతులను వ్యాప్తి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటన తరువాత రైల్వే శాఖ భద్రతా చర్యలు పునర్విమర్శించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.