Jamili Elections Bill: ఎంపీలు ఎంత చెప్పినా మారడం లేదా? వారి కారణంగా మోదీ సర్కార్‌కు టెన్షన్ పట్టుకుందా? కీలకమైన బిల్లు నేపథ్యంలో విప్ జారీ చేసినా, ఎంపీలు ఎందుకు డుమ్మా కొట్టారు? స్వపక్షంలోనే విపక్షం తయారైందా? ఎంపీలపై బీజేపీ హైకమాండ్ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది? మోదీ-అమిత్ షా ద్వయం ఆలోచన ఏంటి?
బీజేపీలో మోదీ హవా క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఛరిష్మా కలిగిన నేతలను వెతికే పనిలో పడినట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో పాతవారిని పక్కనపెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోందట. ఇందుకు కారణాలు అనేకమని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. రీసెంట్‌గా వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లు నేపథ్యమే దీనికి కారణమని తెలుస్తోంది.
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు వాడివేడీగా జరుగుతున్నాయి. కీలక బిల్లుల విషయంలో పార్టీ ఎంపీలు కచ్చితంగా సభకు రావాల్సిందేనని విప్ జారీ చేసింది బీజేపీ. అయినా ఎంపీల వైఖరి మారలేదు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు మంగళవారం లోక్‌సభకు వచ్చింది. బిల్లు పెట్టడానికి ముందు సభలో చిన్నపాటి చర్చ జరిగింది. ఆ తర్వాత బిల్లు సంబంధించి ఓటింగ్ ప్రవేశపెట్టారు న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్‌వాల్.
వన్ నేషన్-వన్ ఎలక్షన్ కు బిల్లుకు సంబంధించి సభలో మూడింట రెండొంతుల మెజార్టీ రావాల్సివుంది. లేకుంటే బిల్లు వీగిపోయినట్టేనని ప్రతిపక్షం కాంగ్రెస్ మొదటి నుంచి చెబుతున్నమాట. బిల్లుకు మద్దతుగా 269 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన ఆ బిల్లును వీగిపోయినట్టే. కానీ బిల్లు పాసైందని లోక్‌సభ ఓకే చేయడం, ఆపై జేపీసీ పంపడం జరిగిపోయింది.
ALSO READ: సంక్షోభంలో విద్యారంగం.. దేశంలో 10 లక్షల టీచర్ పోస్టులు ఖాళీ.. లక్ష విద్యార్థులు ఫెయిల్
వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లు విషయంలో మోదీ సర్కార్‌కు తగిలిన తొలి దెబ్బ. ఎందుకంటే ఈ బిల్లు పాస్ కావాలంటే కనీసం 360 మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. రేపటి రోజు జేపీసీలో సంప్రదింపుల తర్వాత బిల్లు పెట్టినా వీగిపోవడం ఖాయమనే చర్చ ఢిల్లీ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.
పరిస్థితి గమనించిన మోదీ సర్కార్, లోక్‌సభకు పార్టీకి చెందిన ఎంతమంది ఎంపీలు హాజరయ్యారు అనేదానిపై లెక్క తీశారు. ఓటింగ్ సమయంలో దాదాపు 20 మంది బీజేపీ ఎంపీలు లేరని తేలింది. వారిలో పలువురు కేంద్రమంత్రులు ఉన్నారు.
గిరిరాజ్‌సింగ్, నితిన్ గడ్కరీ, జ్యోతిరాదిత్య సింధియా, సిఆర్ పాటిల్, శంతను ఠాకూర్, జగదాంబికా పాల్, బీవై రాఘవేంద్ర, విజయ్ బాఘేల్, ఉదయ్‌రాజే భోంసాలే, జగన్నాథ్ సర్కార్, జయంత్‌కుమార్ రాయ్, సోమన్న, చింతామణి మహారాజ్ సభలో లేరని తేలింది. దీనిపై బీజేపీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆయా నేతలతో గతరాత్రి గట్టిగా మాట్లాడినట్టు సమాచారం.
ఇదిలావుండగా వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లుకు సంబంధించి 48 గంటల్లోపు జేపీసీ ఏర్పాటు చేయకపోతే ఆ బిల్లు వీగిపోవడం ఖాయమనే చర్చ సాగుతోంది. బిల్లు ఇప్పుడు వీగిపోతే వచ్చే సెషన్‌లో ప్రవేశ పెట్టాలంటున్నాయి పార్లమెంట్ వర్గాలు. మరో రెండురోజుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.