Building Collapse : ఉత్తర్ ప్రదేశ్ లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్ లో నిర్మాణంలో ఉన్న స్టేషన్ స్లాబ్ కూలిపోంది. దాంతో.. అక్కడ పని చేస్తున్న అనేక మంది కార్మికులు నిర్మాణ ప్రాంతంలో చిక్కుకుపోయారని తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకుని.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది.. ఇప్పటి వరకు 23 మందిని సురక్షితంగా రక్షించారు. మరింత మంది స్లాబ్ నిర్మాణ సామగ్రి కింద చిక్కుకుని ఉన్నారని.. పోలీసులు అనుమానిస్తున్నారు.
యూపీలోని అనేక రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. నూతన రైల్వే ట్రాకులు, కొత్త స్టేషన్ భవనాల నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగానే.. కన్నౌజ్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన నిర్మాణ పనుల్లో శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. ఎత్తుగా పిల్లర్లు పోసిన గుత్తేదారులు.. స్లాబ్ నిర్మించే పనుల్లో ఉండగా.. ఒక్కసారిగా స్లాబు కూలిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ నిర్మాణ పనులు జరుగుతుండడంతో..చాలా మంది అందులోనే చిక్కుకుని పోయారు.
స్లాబ్ కుప్పకూలిన నేపథ్యంలో అక్కడ చుట్టుపక్కల అంతా ఆందోళనకర వాతావరణ ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెనువెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. వీరికి తోడుగా.. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. నిర్మాణంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రక్షించిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకి తరలించారు.
Also Read : గోనె సంచుల్లో కుక్కి, బీరువాలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు.. యూపీలో దారుణ హత్యలు
ఈ ప్రమాద వార్తను తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ప్రమాద ఘటనపై ఆరా తీశారు. వెనువెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి సరైన వైద్యం అందేలా చూడాలని, ప్రమాదంలో చిక్కుకున్న వారిని వీలైనంత త్వరగా కాపాడేందుకు ప్రయత్నించాలని ఆదేశించారు.