Karnataka Minister Hebbalkar Accident| కర్ణాటక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ (49) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన మంగళవారం జనవరి 14, 2025 తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో బెళగావి జిల్లా కిత్తూరు తాలూకా అంబద్‌గట్టి సమీపంలో జరిగింది. వేగంగా వెళుతున్న కారు ముందు అకస్మాత్తుగా ఒక కుక్క రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. డ్రైవర్ ఆ కుక్కను తప్పించడానికి వాహనాన్ని పక్కకు తిప్పడంతో, కారు స్టీరింగ్‌పై అదుపు కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది.
ఈ ఘటన సమయంలో మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్‌తో పాటు ఆమె సోదరుడు, కర్ణాటక శాసనమండలి సభ్యుడు చెన్నరాజు కూడా కారులో ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ వీపు, ముఖంపై గాయాలవ్వగా, చెన్నరాజు తలకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదం తీవ్రతను దృష్ట్యా.. కారులోని సేఫ్టీ ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడం వల్ల వారికి ప్రాణాపాయం తప్పింది.
Also Read: దొంగతనానికి వెళ్లి మహిళను ముద్దాడిన దొంగ.. ఎలా పట్టుకున్నారంటే..
మంత్రితో పాటు ఆమె సోదరుడిని చికిత్స కోసం సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ అక్కడ వైద్య చికిత్స పొందుతున్నారు. ప్రమాదం కారణంగా ఇద్దరీకీ తీవ్ర గాయాలు అయినప్పటికీ, వారి పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం.
బెంగళూరు నుండి బెళగావి ప్రయాణం సమయంలో ప్రమాదం
సోమవారం జరిగిన కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) సమావేశానికి బెంగళూరులో హాజరైన అనంతరం లక్ష్మీ హెబ్బాల్కర్ బెళగావి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో కిత్తూరు సమీపంలోని అంబద్‌గట్టి వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మంత్రి హెబ్బాల్కర్ కు ప్రాణాపాయం తప్పింది.