Kejriwal Poll Promise| ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తాజాగా సోమవారం డిసెంబర్ 30న మరో ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే.. దేవాలయాల్లో పూజారులకు, గురుద్వారలో గ్రంథీలకు ప్రతినెలా రూ.18,000 జీతం ఇస్తానని ప్రకటించారు.
సోమవారం ఉదయం కేజ్రీవాల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “మత సంప్రదాయాలను పర్యవేక్షించే పెద్దలుగా పూజాలు, గ్రంథీలు మన సమాజానికి నిస్వార్థంగా సేవలందిస్తున్నారు. కానీ వారి ఆర్థిక కష్టాల గురించి ఎవరూ ఆలోచించకపోవడం చాలా దురదృష్టకరం. అందుకే మా పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో గెలిస్తే వారికి ప్రతినెలా రూ.18000 ప్రభుత్వం జీతం అందిస్తుంది.” అని చెప్పారు.
ఈ పథకం కోసం రేపటి (డిసెంబర్ 31) నుంచే హనుమాన్ టెంపుల్ వద్ద నుంచి రిజిస్ట్రేషన్ నమోదు ప్రారంభిస్తామని కేజ్రీవాల్ తెలియజేశారు. “ఈ పథకం రిజిస్ట్రేషన్ ప్రక్రియను బిజేపీ పెద్దలు అడ్డకోవద్దని వేడుకుంటున్నాను. ఎందుకంటే ఈ పథకానికి అడ్డుగా నిలబడితే మహాపాపం చేసినట్లే.. ఎందుకంటే పూజారులు దేవునికి ప్రజలకు మధ్య వారధి లాంటి వారు” అని బిజేపీని పరోక్షంగా విమర్శించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ వరుసగా సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున ఆయన సీనియర్ సిటిజెన్ల కోసం సంజీవని పథకం, మహిళలకు పెన్షన్ కోసం మహిళా సమ్మాన్ యోజన పథకం ప్రకటించారు. ఆ తరువాత తా జాగా పూజారుల కోసం ఇప్పుడు జీతం ఇస్తామని చెప్పారు.
Also Read: 2024లో భారత్ కోల్పోయిన మహానుభావులు వీరే..
ఆప్ పార్టీ ప్రకటించిన సంజీవని యోజన ప్రకారం.. 60 ఏళ్ల పైబడిన వయోవృద్ధుల కోసం ఉచితంగా వైద్యం అందించబడుతుంది. అదే మహిళా సమ్మాన్ యోజన సంక్షేమ పథకం కింద ప్రతి నెలా మహిళల బ్యాంక్ అకౌంట్లలో రూ.2100 ఢిల్లీ ప్రభుత్వం జమ చేస్తుంది.
విలేకరుల సమావేశంలో బిజేపీపై నిప్పులు చెరిగిన అరవింద్ కేజ్రీవాల్
మీడియా సమావేశంలో మాజీ సిఎం కేజ్రీవాల్ బిజేపీ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని రోజుల క్రితమే కేజ్రీవాల్ బిజేపీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలోని ఆప్ మద్దతుగా నిలబడే ఓటర్ల పేర్లను జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బిజేపీ తొలగించేస్తోందని.. దీన్నే ఆపరేషన్ లోటస్ అని పేరు కూడా పెట్టారని చెప్పారు.
దీనికి సమాధానంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. ఢిల్లీలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులు, రోహింగ్యాలే ఆప్ పార్టీ ఓటర్లని వారు ఎక్కడ నివసిస్తున్నారో తమ వద్ద డేటా ఉందని చెప్పారు. సోమవారం ఈ విషయాన్నే కేజ్రీవాల్ ప్రస్తావించారు. “రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు ఢిల్లీలో అక్రమంగా నివసిస్తున్నట్లు తెలిసినా బిజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. కేంద్ర మంత్రి వద్ద అక్రమ వలస దారుల గురించి డేటా ఉంటే ఆయన దాన్ని బహిర్గతం చేయాలి. అలా చేయకుంటే ఆయన్ని అరెస్ట్ చేయాలి.” అని కేజ్రీవాల్ బిజేపీ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.