Kejriwal Ambedkar Row| 75వ రాజ్యాంగ వార్షికోత్సవం సమయంలో రాజ్యాంగ్ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చుట్టూ జాతీయ రాజకీయాలు వేడేక్కాయి. అంబేడ్కర్ పై అమిత్ షా అభ్యంతరకరంగా చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేస్తుండగా.. తాజాగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా అధికార కూటమిపై విమర్శ నాస్త్రాలు సంధించారు.
బాబాసాహెబ్ అంబేడ్కర్ ను బిజేపీ పెద్దలు అవమానిస్తుంటే అధికార కూటమిలోని బిజేపీ యేతర పార్టీలు మౌనంగా ఉన్నాయని సెటైర్ వేశారు. అంబేడ్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తమ అభిప్రాయాలేంటో చెప్పాలని దేశ ప్రజలు ప్రశ్నిస్తున్నారని కేజ్రీవాల్ ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు.
“దేశ ప్రజలు గౌరవనీయులైన నీతీశ్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారి సమాధానాల కోసం ఎదురుచూస్తున్నారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఇద్దరు ముఖ్యమంత్రులు అభిప్రాయమేంటో? చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ కు అమిత్ షా చేసిన అవమానాన్ని మీరు సమర్థిస్తున్నారా?” అని కేజ్రీవాల్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
ALSO READ: సంక్షోభంలో విద్యారంగం.. దేశంలో 10 లక్షల టీచర్ పోస్టులు ఖాళీ.. లక్ష విద్యార్థులు ఫెయిల్
రాజ్యసభలో కేంద్ర మంత్రి అమిత్ షా 75వ రాజ్యాంగ వార్షికోత్సవాల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. “ఈ రోజుల్లో అంబేడ్కర్ పేరు చీటికీ మాటికీ తలుచుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. అంబేడ్కర్, అంబేడ్కర్, అంబేడ్కర్, అంబేడ్కర్, అంబేడ్కర్ అని పదే పదే తలుచుకుంటున్నారు. ఇన్ని సార్లు ఆయన పేరు తులుచుకోవడం కన్నా ఆ దేవుడి పేరు తలుచుకున్నా ఏడు జన్మల వరకు స్వర్గం ప్రాప్తించేది.” అని అమిత్ షా వెటకారంగా వ్యాఖ్యానించారు.
అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు గత రెండు రోజులుగా నిరసనలు చేస్తున్నారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. అమిత్ షా వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. నిజానికి కాంగ్రెస్ పార్టీనే అంబేడ్కర్ ని అవమానించిందని చెప్పారు.
దేశ స్వాతంత్ర్యం తరువాత ఎక్కువ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ అణగారిన వర్గాల కోసం, ఆదివాసీల కోసం, దళితుల సంక్షేమం కోసం ఏమీ చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోనే దళితుల ఊచకోతలు జరిగాయన్నారు. సోషల్ మీడియా ఎక్స్ లో ప్రధాన మంత్రి మోడీ వరుసగా ట్వీట్లు చేస్తూ.. అంబేడ్కర్ పట్ల కాంగ్రెస్ పార్టీ పాపాలు చేసిందన్నారు. అంబేడ్కర్ కు వ్యతిరేకంగా అప్పట్లో నెహ్రూ ఎన్నికల ప్రచారం నిర్వహించారని చెప్పారు.