Kejriwal Vs Yogi | దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రస్తుతం ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. యూపీ ముఖ్యమంత్రి, భారతీయ జనత పార్టీ అగ్రనేత యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలనలో ఢిల్లీ “డంపింగ్ యార్డ్”గా మారిపోయిందని.. ఆప్ ప్రభుత్వం.. 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంలో విఫలమైందని సిఎం యోగి ఆరోపించారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఆయన ఒక సవాల్ విసిరారు. ఢిల్లీలో కాలుష్యం మీరిపోయిందని.. యమున నదిలో నీరు మొత్తం కలుషితంగా ఉందని.. ఒక వేళ అలా కాదంటే కేజ్రీవాల్ యమున నదిలో మునిగి స్నానం చేసి చూపించాలని ఛాలెంజ్ చేశారు.
యోగి ఆదిత్యనాథ్ చేసిన ఆరోపణలకు కౌంటర్ చేస్తూ ఢిల్లీ మాజీ సిఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అదే స్థాయిలో ఎదురు విమర్శలు చేశారు. గురువారం ఆయన పశ్చిమ ఢిల్లీలోని హరినగర్‌లో తన పార్టీ అభ్యర్థి తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఉత్తర్ ప్రదేశ్ లోని విద్యుత్ కోతల అంశాన్ని ప్రస్తావించారు. “ఇక్కడ (ఢిల్లీలో) ప్రజలు 24 గంటలూ నిరాటంకంగా విద్యుత్ పొందుతున్నారని నాకు చెబుతున్నారు. ఢిల్లీకి ఐదు సంవత్సరాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా చేసేలా చూసుకున్నాం. కానీ యూపీలో పదేళ్లుగా బిజేపీ ప్రభుత్వం ఉంది. అయినా కరెంటు కోతలు ఎన్ని గంటలు ఉంటాయో వినయంగా అడగాలనుకుంటున్నాను” అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ ప్రభుత్వంపై వరుసగా ఆరోపణలు చేశారు. “ఆప్ ప్రభుత్వం ఢిల్లీని డంపింగ్ యార్డ్‌గా మార్చింది. విదేశాల నుంచి అక్రమ వలసలను అడ్డుకోవడంలో విఫలమైందని” విమర్శించారు. “బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్నారు. వారికి అన్ని రకాల సౌకర్యాలను ఆప్ ప్రభుత్వం కల్పిస్తోంది. ఢిల్లీలోని యమునా నది మురికి కాలువగా మారింది. కుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్‌లో పుణ్యస్నానం చేసి వచ్చినప్పుడు, అక్కడి యమునా నదిలో కేజ్రీవాల్ మునగగలరా? ఆయన నైతికంగా దీనికి సమాధానం చెప్పాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: సంతానం లేని మహిళలను గర్భవతి చేస్తే రూ.10 లక్షలు.. బిహార్‌లో బంపర్ స్కామ్
ఇక, యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ పరిస్థితిని ఇతర అంశాల్లో కూడా విమర్శించారు. “నొయిడా-గాజియాబాద్ రోడ్లతో పోల్చితే ఢిల్లీలోని రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ఢిల్లీలో మురుగు రోడ్లపై పొంగి పొర్లిపోతోంది. నీటి సమస్య ప్రజలను వేధిస్తోంది. 24 గంటల విద్యుత్ సరఫరా చేయలేకపోతున్నారు. అంతేకాకుండా ప్రజల నుంచి మూడు రెట్లు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సోషల్ మీడియా, మీడియా సమావేశాల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అబద్ధాలు చెప్పడమే ఆప్ నేతల పని” అని ఆయన తీవ్రంగా ఢిల్లీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఇప్పుడు, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆప్, బిజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఫలితాలు 8న వెలువడతాయి. ఆప్ పార్టీ నేతలు తన హ్యాట్రిక్ విజయం కోసం శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు, అదే సమయంలో కాంగ్రెస్, భాజపా పార్టీలు కూడా అధికారం కోసం పట్టువదలకుండా ప్రచారం చేస్తున్నాయి.