Kharge Demands Ballot Paper Elections | బీజేపీ ఎన్నడూ చూడని రీతిలో మోసం చేసి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించి గెలిచిందని.. ఈ రోజు కాకున్నా రేపైనా నిజాలు బయటపడతాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లను తిరిగి ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని బలంగా వాదించారు. బుధవారం ఏఐసీసీ సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఖర్గే అనేక ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు.
“ప్రపంచం మొత్తం ఈవీఎంల నుండి బ్యాలెట్ పేపర్ల వైపు మారుతుండగా, మన దేశం మాత్రం ఇంకా ఈవీఎంలను వాడుతోంది. ఇదే అతి పెద్ద మోసం. టెక్నాలజీని ఉపయోగించుకుని ఈవీఎంలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మళ్ళీ ఈవీఎంల మోసాలను నిరూపించమని వారే మనల్ని కోరుతున్నారు. ఈ విషయంలో యువత ముందుకు రావాలి. బ్యాలెట్ పేపర్ల కోసం పోరాడాలి.
మహారాష్ట్రలో ఏం జరిగింది? ఈవీఎంల ద్వారా పెద్ద మోసం జరిగింది. అక్కడ ఎలాంటి ఓటర్ల జాబితాను తయారు చేశారు? బీజేపీ 90 శాతం సీట్లు ఎలా గెలిచింది? ఎన్నికల చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు. మహారాష్ట్ర ఎన్నికలే పెద్ద మోసం. ఈ విషయాన్ని మేము అనేక చోట్ల ప్రస్తావించాము. రాహుల్ గాంధీ బలంగా వాదించారు. హర్యానాలో కూడా అదే జరిగింది. మా న్యాయవాదులు, నాయకులు ఈ దొంగలను బయటపెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక రోజు నిజాలు బయటపడక తప్పదు.
పార్లమెంటులో ప్రతిపక్షం గొంతును వినిపించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్రం ఏకపక్షంగా బిల్లులను ఆమోదిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ప్రజల అభిప్రాయాలను ఎలా వినిపిస్తాం? అమెరికా టారిఫ్లపై చర్చించే అవకాశం ఇవ్వలేదు. మణిపూర్పై ఉదయం 4 గంటలకు చర్చిస్తామని చెప్పారు. నేను ఉదయం చర్చించాలని కోరినప్పుడు తిరస్కరించారు. ప్రభుత్వం ఏదో దాచుతోంది కాబట్టే ఇలాంటి పనులు చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని నెమ్మదిగా అంతం చేయాలని ప్రయత్నిస్తున్నారు. రాజ్యాంగంపై గత 11 సంవత్సరాలుగా దాడులు జరుగుతున్నాయి. వాటిని కాపాడే బాధ్యత మనపై ఉంది.
కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధి కోసం అనేక సంస్థలను స్థాపించింది. కానీ మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం.. ఆ ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మివేసింది. జాతీయ ప్రయోజనాలకంటే ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాలే ఈ ప్రభుత్వానికి ముఖ్యం. చివరికి రిజర్వేషన్లను కూడా ప్రైవేటీకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే దేశాన్ని అమ్మేసే ప్రమాదం ఉంది.
Also Read: రూ.40 లక్షల క్లాక్ టవర్.. ప్రారంభించిన తర్వాతి రోజే ఆగిపోయిందిగా!
బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో మతపరమైన వివాదాలను సృష్టించాలనుకుంటున్నాయి. మసీదుల కింద శివలింగాలను వెతకడం లేదని చెబుతూతూనే ఆ పని చేస్తున్నారు. ప్రధాని మోదీ నిప్పు పెడితే, ఆర్ఎస్ఎస్ అందులో నెయ్యి పోస్తోంది. రాజస్థాన్ ఆల్వార్ ఘటనతో బీజేపీ దళిత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించింది.
పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలు పెంచడం, గ్యాస్ ధరలు పెంచడం ద్వారా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. దేశంలో అత్యాచారాలు పెరుగుతుండగా అమిత్ షా కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు బిల్లులను ఆమోదించకుండా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంచుతున్నారు. తమిళనాడు గవర్నర్ తీరుపై సుప్రీం కోర్టు తీర్పు ఒక స్పష్టమైన సందేశం. ప్రజల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక చట్టాలు చేసాయి. భూమి సేకరణ చట్టం, నిర్భంద విద్య, అటవీ రక్షణ చట్టాలు చేసింది. ఈ అంశాలపై మనం పోరాడాల్సిన అవసరం ఉంది.” అని ఖర్గే ఉద్వేగ భరితంగా సమావేశంలో ప్రసంగించారు.