Kolkata doctor rape-murder case: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కేంద్ర సంస్థ సీబీఐ దర్యాప్తు చేస్తోంది. తాజాగా, ఈ కేసుకు సంబంధించి సీబీఐ సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ హత్యాచార ఘటనలో ట్రైనీ డాక్టర్‌పై గ్యాంగ్ రేపు జరగలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆమెపై నిందుతుడు సంజయ్ రాయ్ ఒక్కడే దారుణానికి ఒడిగట్టినట్లు పేర్కొన్నాయి.
గతంలో ట్రైనీ డాక్టర్‌పై గ్యాంగ్ రేప్ జరిగినట్లు వార్తలు వచ్చాయని, అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని విచారణలో వెల్లడైందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. అలాగే దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని, త్వరలోనే కోర్టులో అభియోగాలు సమర్పించనున్నట్లు తెలిపాయి.
కాగా, ఈ కేసును తొలుత పశ్చిమ బెంగాల్ పోలీసులు దర్యాప్తు చేశారు. విచారణపై అనుమానాలు రావడంతో హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. ఇదిలా ఉండగా, కేసు పూర్తి చేయించేందుకు ఐదు రోజులు సమయం అడిగానని, కానీ హైకోర్టు సీబీఐకి బదిలీ చేసిందని సీఎం మమతాబెనర్జీ విమర్శలు చేశారు. రోజులు గడుస్తున్నా న్యాయం లభించడం లేదని, కేసు పురోగతి గురించి ఎలాంటి వివరాలు లేవని చెబుతున్న తరుణంలో తాజా వార్తలు వెలువడ్డాయి.
Also Read: సీపీఎం కార్యదర్శి ఏచూరి ఆరోగ్య పరిస్థితి మరింత విషమం
మరోవైపు, ఈ కేసుకు సంబంధించి ఆర్జీ కర్ ఆస్పత్రి కేసులో ఈడీ వేర్వేరు చోట్ల దాడులు నిర్వహిస్తోంది. మొత్తం మూడు చోట్ల దాడులు నిర్వహిస్తుండగా..ఈడీ బృందం హౌరా, సోనార్ పూర్ , హుగ్లీకి చేరుకుంది. హుగ్లీలోని ఒక స్థలంలో ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోస్ దగ్గరి బంధువుల ఇల్లు కూడా ఉందని తెలిపింది.
ఈ కేసులో విచారణకు వచ్చిన మాజీ ప్రిన్సిపల్ సీబీై కస్టడీలో ఉన్నారు. అంతకుముందు సీబీఐ కోర్టులో 10 రోజులు కస్టడీని కోరగా.. 8 రోజుల కస్టడీకి ఆమోదం తెలిపింది. సీబీఐ తర్వాత ఈడీ కూడా ఈ కేసులో ప్రవేశించింది.